కాళిదాసు ప్రశ్న – 5

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 185

కాళిదాసు రఘు వంశ “ధార్మిక” మహాకావ్యాన్ని రచించేటప్పుడు ఏం చెప్పాడు? “రఘువంశ రాజుల చరిత్రలు  వజ్రంతో తొలిచిన మణుల వలె అక్కడక్కడ పడి ఉన్నాయి. నేనొక దారం (సూత్రం) లాగ వాటిని ఒక చోట గ్రుచ్చి ఆ కథలకు హారత్వాన్ని కలిగిస్తున్నాను” అన్నాడు. ఆ వంశం ఎవరితో మొదలైంది? బ్రహ్మతో ప్రారంభమై సూర్యుని ద్వారా వచ్చి ఇక్ష్వాకు మహారాజుతో వృద్ధి చెందింది. ఆ పరంపరలో పృథు చక్రవర్తి ఉన్నాడు, కువలయాశ్వుడు ఉన్నాడు, మాంధాత ఉన్నాడు, త్రిశంకుడు ఉన్నాడు, అంశుమంతుడు ఉన్నాడు. ఆ వంశానికి ఇక్ష్వాకు వంశం అనే పేరూ ఉంది. వీరందరికీ కూడా గొప్ప చరిత్రలు ఉన్నాయి. కాళిదాసు వీరెవ్వరి చరిత్రలూ ముట్టుకోలేదు, వదలివేశాడు!

వీరందరి తరువాత వచ్చిన దిలీప చక్రవర్తితో మొదలుపెట్టాడు ఈ రఘువంశ మహాకావ్యాన్ని. ఎందుకు? ఇక్ష్వాకుని పేరు కూడా ఈ వంశానికి ఉంది కదా? ఆయనకేమి లోటు?  పృథు చక్రవర్తి తక్కువవాడా? మాంధాత తీసిపోయాడా? కువలయాశ్వుడు లెక్కలోకి రాడా? దిలీపునితో ఎందుకు మొదలు పెట్టాడు? ఆ వంశ రాజుల చరిత్రలను “మణుల”తో పోల్చిన ఆ మహాకవి మరి అన్ని మణులను ఎందుకు ప్రక్కన పెట్టేశాడు? దిలీప “మణి” నే ఎందుకు ఎంచుకొని తన కావ్యాన్ని మొదలు పెట్టాడు? ఈ ప్రశ్న గతంలో ఎవరికైనా వచ్చిందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ రఘువంశ మహాకావ్యాన్ని అధ్యయనం చేస్తూ ఉంటే నాకు ఈ ప్రశ్న వచ్చింది. మరి సమాధానం వెతుక్కోవలసిన బాధ్యత కూడా నా మీదే ఉంది కదా?

కాళిదాసు తన వర్ణనల ద్వారా నాకు ఎన్నో ప్రశ్నలు వేస్తున్నాడని అన్నాను. ఆ ప్రశ్నలను నాకు నేనే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ దిలీప చక్రవర్తి లక్షణాలు కూడా నన్ను ప్రశ్నిస్తున్నాయి. ఆ ప్రశ్నలను కాస్సేపు ప్రక్కన పెట్టేసి ఇప్పుడు క్రొత్తగా నాలో పుట్టుకొచ్చిన ప్రశ్నకు ముందు సమాధానం చెప్పుకోవాలి.

నాకు తోచిన సమాధానం ఇదీ…

దిలీపునికి పూర్వం ఉన్న చక్రవర్తులు గొప్పవారే. ధార్మికులే. ఒక్కరిద్దరు మినహా! వారందరి చరిత్రలలో లేని ఒక విశేషం దిలీప చక్రవర్తి కథలో ఉంది. అది “సనాతన ధర్మ” మూలమైన ఒక విశేషాంశం!

దిలీపునికి సంతానం లేదు. దంపతులు ఇద్దరూ తమ కులగురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు తమ సమస్యను చెప్పుకోవడానికి. ఆ మహర్షి  ఆ దంపతులకు సంతానం కలగక పోవడానికి కారణాన్ని వివరించాడు. “పూజ్యులైన వారిని పూజింపక పోవటం వల్ల” వారికి సంతానం కలగటం లేదని ఆయన చెప్పారు. ఇంతకీ దిలీపుడు చేసినది ఏమిటి?

దిలీపుడు ఒకసారి ఇంద్రుని వద్దకు వెళ్ళి తిరిగి వస్తున్నాడు. ఆయన భార్య అప్పుడు ఋతుమతి అయిఉంది. ఋతుమతి అయిన భార్యతో గడపటం విహితం. ఆ ఆలోచనతో దిలీపుడు తిరిగి వస్తున్నాడు. ఒకప్రక్క ఆకాశగంగా తరంగ ధ్వని అంతటా నిండి ఉంది. అక్కడ మరొక ప్రక్క కల్పవృక్ష ఛాయలో కామధేనువు విశ్రాంతి తీసుకుంటూ ఉంది. దిలీప చక్రవర్తి గమనించలేదు. కామధేనువుకు కోపం వచ్చింది! దిలీపుని శపించింది! అదేవిటీ? తనను గమనించ మాత్రం కోపం రావాలా? ఆ కోపం తనను గమనించనందుకు అనుకోవడం మన అజ్ఞానం! అలా గమనించక పోవడం, గౌరవించకపోవడం “ధర్మ” విరుద్ధం! “ధర్మోల్లంఘనం”! ధర్మాన్ని ఉల్లంఘించినందుకు శిక్ష తప్పదు! అందుకే ఆ శాపం తప్ప కామధేనువుకు తనను గౌరవించలేదనే అహంకారం కానే కాదు!

అయితే కామధేనువు ఆ శాపానికి పరిహారం కూడా చెప్పింది. శాపమిచ్చిన కామధేనువే దిలీపుడు ప్రార్థించకుండానే ఆ శాపానికి పరిహారం కూడా ఎందుకు అనుగ్రహించింది? కామధేనువుకు “ధర్మ స్వరూపం” తెలుసు కాబట్టి! ఏవిటిది?

దిలీపుడు ధర్మాన్ని దాటని వాడు. “శాస్త్రము నందు మొక్కవోని బుద్ధి” కలవాడు. ఆ సమయంలో భార్యాసంగమం శాస్త్ర విహితం. ఆ యోచనలో ఉన్నాడు. అన్యమనస్కత కారణంగా మాత్రమే కానీ “నిర్లక్ష్యం”, “అహంకారం” వల్ల కానే కాదు. “దేవతాత్మ” అయిన కామధేనువుకు అది తెలుసు. దిలీపునికి సంతానం లేదు. సంతానం కోసం పరితపిస్తున్నారు ఆ దంపతులు. శాస్త్ర విహిత బుద్ధి అయిన దిలీపుడు సంతాన కాంక్షతో తిరిగి వెడుతున్నాడు. నేల నేలే రాజుకు సంతానం కలగాలి, పరంపర కొనసాగాలి, ధర్మ రక్షణ జరగాలి. ఈ ఉద్దేశ్యంతోనే కామధేనువు దిలీపుడు ప్రార్థించకుండానే శాప విమోచనాన్ని కూడా అనుగ్రహించింది. ఏమిటా విమోచన మార్గం?

“నువ్వు సంతాన కాంక్షతో నన్ను చూడకుండా వెడుతూవున్నావు. మీ దంపతులు నా సంతానాన్ని సేవించే వరకూ మీకు సంతానం కలుగదు!” శాపమూ, దాని విమోచనమూ రెండూ ఏకకాలంలో అందించింది కామధేనువు!

ఈ రహస్యాన్ని దిలీప దంపతులకు వశిష్ఠ మహర్షి తెలియచేశాడు. ఆయన దగ్గర యజ్ఞ కార్యానికి అవసరమైన పాలు, పెరుగు, నెయ్యి అనుగ్రహించటానికి నందినీ ధేనువు ఉన్నది. అది కామధేను సంతానమే!

కనుక ఆ మహర్షి తన దగ్గర ఉన్న నందినీ ధేనువును సేవించి కామధేను శాపాన్ని నివృత్తి చేసుకోమని ఆదేశించాడు.

దిలీపుడు, ఆయన భార్య సుదక్షిణ ఇద్దరూ ఆ నందినీ ధేనువును సేవించటం మొదలుపెట్టారు. “ఆ ధేనువు నిలిస్తే నువ్వూ నిలవాలి, అది నీళ్ళు త్రాగితే నువ్వూ త్రాగాలి, అది ఏమి చేస్తే అదే నువ్వు చేయాలి” అని మహర్షి ఆదేశం. ఇక సుదక్షిణా దేవికి ఆ ధేనువును అలంకరించటం, పూజించటం, వనం వరకూ కూడా వెళ్లి సాగనంపటం, తిరిగి వచ్చాక పూజించటం ఇదీ పద్ధతి. ఆ దంపతులు నందినీ ధేనువును అలాగే సేవిస్తున్నారు.

ఇక్కడి వరకూ నాకు వచ్చిన ప్రశ్నలో మొదటి భాగానికి నాకు తోచిన సమాధానం. ఇదేం సమాధానం?

దిలీపునికి ముందున్న చక్రవర్తులు అందరూ ధార్మికులే… సందేహం లేదు. కానీ కాళిదాసు దిలీపుని కథతో ప్రారంభించటానికి కారణం ఇదే! “గో సేవ!”

సనాతన ధర్మ మూలకమైన కర్మకాండకు గోవే ఆధారం! అంతే కాదు… కారణం ఏదైనా “పూజింప వలసిన వారిని పూజించక పోవటం” అనే దోషం. ఈ రెండూ దిలీపుని చరిత్రలోనే ఉన్నాయి. ధర్మ స్వరూపం కూలంకషంగా తెలిసిన మహోపాసకుడైన కాళిదాసు అందుకే దిలీపుని చరిత్రతో రఘువంశ “ధార్మిక” మహాకావ్యాన్ని ప్రారంభించాడని నా నిర్ణయం.

గో సేవ మాత్రమే కాదు… గో సంరక్షణ కూడా ధర్మ విహితం. అది తరువాతి పోస్ట్ లో వివరిస్తాను. గో సేవ, గోసంరక్షణ అనే రెండు అంశాలను జాతికి గుర్తు చేయటం కాళిదాసు ఉద్దేశ్యం!

ఈ వ్యాఖ్యానాన్ని కాదనే వారూ ఉండవచ్చు… ఖచ్చితంగా ఉంటారు కూడా! కానీ నాకు భవభూతి వాక్యం ప్రమాణం… ఈ అనంత కాలంలో, ఈ విశాల పృథ్వీలో నాతో సమాన ధర్ముడు ఎవరో ఒకరు ఉండరా? ఇప్పుడు లేకపోతేనేమి? భవిష్యత్తులో పుట్టడా? ఒక కావ్యాన్ని ఇలా కూడా చూడవచ్చు, ప్రాచీన కావ్యాలను “ధార్మిక కావ్య” దృష్టితో తిరిగి వ్యాఖ్యానించుకో వలసిన అవసరం, సమయం ఆసన్నమైంది అని గుర్తిస్తే చాలు!


Leave a comment