స్వీయ అన్వేషణ – 186
రాజమహేంద్రవరం… గోదారి గట్టు… గణేష్ చౌక్… దేవీ చౌక్… సీతంపేట లోని ప్రాచ్య భాషా కళాశాల, గోదారి గట్టున మా మాష్టారు శరభయ్య గారు పని చేసిన “సదనం” అనబడే ఆర్యవైశ్య యువతీ సంస్కృత కళాశాల…ఒకప్పటి నాళం వారి సత్రం… ఒకటే సందడి! ఒక్కొక్క చోట ఒక్కొక్క సందర్భం.
ఇవాళ ఇప్పుడు నేనుంటున్న భాగ్యనగరంలో గణేశ ఉత్సవాలు ముగుస్తున్నాయి. ఇప్పటివరకూ అంగరంగ వైభవంగా అర్చించిన అనేకమంది గణేశులను నిమజ్జనం పేరిట ఎక్కడెక్కడో ముంచేస్తారు!
ఈ నిమజ్జనం అనేదాన్ని ఒక భారీ స్థాయిలో నా జీవితంలో మొట్టమొదటి సారి చూసింది 1985లో. ఆ తరువాత మళ్ళీ దాని జోలికి పోలేదు! కారణాలు రెండు… ఒకటి నన్ను పెంచిన మా చిన్న తాత వేంకట వల్లభాచార్యులు గారు 1971లో ఆప్యాయంగా బహూకరించిన “పార్కర్ పెన్” ను పద్నాలుగేళ్ల తరువాత ఆ సందట్లో ఎవడో చేజిక్కించుకోవటం (ఇప్పటిదాకా మళ్ళీ నేను “పార్కర్ పెన్” కొనుక్కోలేదు అది అంటే ఎంత ఇష్టం అయినా!) కాగా రెండవది “నిమజ్జనం” పేరిట ఆ రోజు జరిగిన “అరాచకం!”. పెద్ద పెద్ద విగ్రహాలను ఆ ట్యాంక్ బండ్ లో పడేసి అవి మునగకపోతే పెద్ద “సుత్తి”తో కొట్టి ముక్కలు ముక్కలు చేసి మరీ ముంచేయడం! నాకు గణేశుడు అంటే ఇష్టం… మా చిన్న తాత నేర్పిన “ముదాకరాత్త మోదకం…” స్తోత్రంలోని లయ వల్ల! ఆ గణేశుని అలా ముక్కలు ముక్కలు చేయటం చూసిన నాటి నుంచీ మళ్ళీ ఆ “అరాచకం” చూడలేదు!
ప్రతి ఏడాదీ గణేశ నవరాత్రులు మొదలు అవుతున్నాయి అంటే మొట్టమొదట నాకు గుర్తుకి వచ్చేది “నా” రాజమహేంద్రవరం! మా చిన్న తాత వినాయక చవితి అయ్యేదాకా మొక్కజొన్న పొత్తులు, సీతాఫలాలు, వెలగపళ్ళు ముట్టుకోనిచ్చేవాడు కాదు! “ముందు వినాయకుడి పాలవెల్లికి కట్టాలి. ఆ తరువాతే మనకి!” అనేవాడు ఆ “పరమ వైష్ణవుడు!” అప్పటి నుంచీ ఇప్పుడు 67 ఏళ్లు వచ్చినా ఆయన మాట పాటిస్తూనే ఉన్నాను.
సరే… రాజమహేంద్రవరం ఎందుకు గుర్తుకు వస్తుంది ఈ రోజుల్లో?
ఆ ఊళ్లో ఇన్నీసుపేటలో (ఇప్పుడది త్యాగరాజ నగర అయింది) మెయిన్ రోడ్ మీద మా ఇల్లు. ఎదురుగా డీలక్స్ హోటల్, దానికి ప్రక్కన వరదరావు హోటల్, దాని ప్రక్కన విజయా టాకీస్ . ఆ విజయా టాకీస్ కి ఎదురుగా గోదారి గట్టుకు వెళ్ళే రోడ్డు. మా ముత్తాత తండ్రి పేరు మీద ఆ రోడ్డుకు ఇప్పటికీ “రంగాచారి రోడ్” అనే పేరు.
ఆ రోడ్డుకు ఆ చివర గోదారి గట్టు. సరిగ్గా ఆ గట్టుకు అడ్డంగా ఒక పెద్ద వేదిక. ఆ వేదిక గణేశోత్సవాలకు “అడ్డా”. (అప్పటి) విశాఖ జిల్లా దార్లపూడిలో ఆరవ తరగతి చదువుతున్న రోజులలో మొట్టమొదటి సారి స్టేజి నాటకం చూశాను. అదీ “దేవదాసు!”. అక్కడే మొట్టమొదటి సారి “తోలుబొమ్మలాట” కూడా చూశాను.
నేను ఏడవ తరగతి చదువుతున్న రోజులలో… అప్పుడే… ఈ గోదారి గట్టు వేదికే మొట్టమొదటి సారి నాకు భరతనాట్యం, కూచిపూడి నృత్య వైభవాన్ని పరిచయం చేసింది. తరువాతి కాలంలో కాళిదాసు నృత్య ప్రదర్శనను “చాక్షుష క్రతువు” అని ఎందుకు అన్నాడో అర్ధం అయింది. పౌరాణిక నాటకాల విస్తృతిని చూపించినదీ ఆ వేదికే. పెద్దగా అర్థం కాకపోయినా అదో లోకంలోకి తీసుకుపోయేవి.
అంతకన్నా ముందు నాకు ఇంకా చిన్నతనంలో నాళం వారి సత్రం ఎదురుగా పెద్ద రావిచెట్టు, దాన్ని దాటితే బాలరాజు హోటల్. ఆ రావిచెట్టు కింద ఒక వేదిక… అక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు. అక్కడే మొదట జిత్ మోహన్ మిత్రా సినిమా పాటల “ఆర్కెస్ట్రా” విన్నది.
ఇంతకీ ఆ గోదారి గట్టు వేదిక ఒక్కటే కాదు… వినాయక చవితి ఉత్సవాలకు మూడు వేదికలు… ఒకటి గోదారి గట్టున ప్రధాన వేదిక కాగా అడవికొలను వారి వీధిలో ఒక పందిరి, దాని ఎదురు వీధిలో మరొక పందిరి. అడవికొలను వారి వీధిలో ఉన్న పందిరిలో హరికథ, అక్కడంతా వృద్ధులు! ఆ మరో వీధిలో ” మేజువాణి!” ఇక్కడంతా యువకులు! దేని ప్రేక్షకులు, శ్రోతలు దానికే.
అయితే గోదారి గట్టు వేదిక ప్రధాన ఆకర్షణ! నృత్యప్రదర్శనలు, పౌరాణిక నాటకాలు, సంగీత కచేరీలు… ఆ తొమ్మిది రోజుల కార్యక్రమాలకు ఊరంతా పోస్టర్లు… ఆ కార్యక్రమాలలో ప్రధానులైన వారి ఫోటోలతో సహా! ఆ పోస్టర్ క్రింద “సమయానుకూలముగా ప్రోగ్రాములు మార్చబడును” అనే “సున్నితమైన హెచ్చరిక!”
నేను అక్కడ చూసిన మొట్టమొదటి పౌరాణిక నాటకం “లంకేశ్వర”. ఆ లంకేశ్వరుడు సినిమా నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి! అంత పొడగరి ఏమీ కాదు… అలా అని పొట్టివాడనీ అనలేం. కానీ ఆహార్యాన్ని ధరించి, గద భుజాన పెట్టుకొని స్టేజ్ మీదకు వచ్చేసరికి తన అభినయంతో ఆకాశమంత ఎత్తు కనిపించేవాడు! నిజంగా ఆ లంకేశ్వరుడే వచ్చాడా అనిపించేసేది. అభినయం ఎంత ప్రభావవంతం అనేది అప్పుడు కాదు కానీ చాలా ఏళ్ల తరువాత సాహిత్య పరిచయం ఏర్పడ్డాక ఆ లంకేశ్వరుడు గుర్తుకు వచ్చినప్పుడల్లా తెలుస్తూ ఉండేది. ఇన్ని పదుల ఏళ్ల తరువాత ఇప్పుడు ఇది వ్రాస్తున్నప్పుడు కూడా ఆ ధూళిపాళ లంకేశ్వరుడు కళ్లలో మెదులుతున్నాడు. కొన్ని దశాబ్దాల తరువాత గుంటూరులో ఏదో సందర్భంలో ఆయనను కలిసినప్పుడు ఆ నాటకం గురించి ప్రస్తావిస్తే “ఎప్పుడు చూశావ్? ఎక్కడ చూశావ్?” అని అడిగారు. చెప్పాను. “ఎప్పటి మాటయ్యా? ఇరవై ఏళ్ళయి పోయింది. ఇంకా గుర్తుందా నీకు? ఇది చాలదటయ్యా వేషం కట్టినవాడికి?” అంటూ మురిసిపోయారు.
ఆ వేదిక నాకు కూచిపూడి నృత్యాన్ని చూపించింది. కళాకారిణి మరెవరో కాదు… అప్పటి సినీ నటి చంద్రకళ. వరుసగా మూడేళ్లు ఆమె నృత్య ప్రదర్శన చూశాను. ఒక్క రూపాయి తీసుకోకుండా ఆమె కూచిపూడి నృత్య ప్రదర్శనకు వచ్చేవారు! ఆమె అభినయ కౌశలం గురించి ఎంతమాత్రమూ తెలియదు అప్పుడు… కానీ ఆ లలిత లలిత పద చాలనం, నేత్ర సౌందర్యం కట్టి పడేశాయి. తరువాతి కాలంలో సినిమా “పిచ్చి” ముదిరిన రోజుల్లో ఆ పాద, నేత్ర దర్శన లాలసతోనే ఆమె నటించిన సినిమాలు అన్నీ వదలకుండా చూసేవాణ్ణి! బాపూ గారి “సంపూర్ణ రామాయణం” లో ఒక సీన్ లో రామచంద్రుడు సీతాదేవి పాదాలకు పారాణి అలంకరిస్తుంటాడు. సీతాదేవి పెళ్ళి కూతురు కూచున్నట్టు కూచుని, రెండు అరచేతులు ఒకదానిపై మరొకటిగా మోకాలిపై ఉంచి, తలను వంచి, చెక్కిలి ఆ చేతులపై ఆన్చి, ఓరగా, తదేకంగా రామచంద్రుడిని చూస్తూ వుంటుంది. బాపు మాత్రమే తీయగలిగిన కేవలం ఆ ఒక్క సీన్ కోసమే ఆ సినిమాని కొన్ని డజన్లసార్లు చూశాను. అవే పాదాలు, అవే నేత్రాలు కదా మరి!
అనంతర కాలంలో రాజమహేంద్రవరం లో గణేశోత్సవం గోదారి గట్టు నుంచి గణేష్ చౌక్ కి తరలివెళ్ళిపోయింది. అక్కడ అన్నీ నాటకాలే. పౌరాణిక నాటకాలతో పాటు సినీ నటుడు నాగభూషణం “రక్తకన్నీరు” లాంటి సాంఘిక నాటకాలు కూడా. అక్కడ నృత్య, సంగీత ప్రదర్శనలకు చోటు లేదు. వాటి బదులు కనీసం ఒక్క “రికార్డింగ్ డ్యాన్స్” అయినా ఉండేది. అప్పుడే ఎన్టీఆర్, ఎఎన్నార్, కృష్ణ, శోభన్ బాబుల లాగ (దూరం నుంచే సుమండీ!) కనిపించే “డూప్ ” లను చూడటం! ఎన్టీఆర్ ఫేం, ఎఎన్నార్ ఫేం , కృష్ణ ఫేం, శోభన్ బాబు ఫేం వంటి “బిరుదులు” కూడాను వాళ్ళకి ఆ ప్రోగ్రాం పోస్టర్లలో! కాలం ముందుకు కదిలింది. అభిరుచి “షిఫ్ట్” అయింది! అయినా నాటకాల పిచ్చి అప్పటికే ఎక్కేసింది కాబట్టి అక్కడా హాజరే!
కాలంతో పాటు గణేశ్ చౌక్ వైభవం మసకబారింది! దేవీ నవరాత్రులు మొదలయ్యాయి! వేదిక దేవీ చౌక్ కు మారింది! అక్కడ కూడా పౌరాణిక, సాంఘిక నాటకాల హడావిడి! రాత్రి తొమ్మిది గంటలకు నాటకం మొదలైతే అర్ధరాత్రి దాటాక ఒంటి గంటకో, రెండింటికో ముగిసేది. అక్కడే మొదటిసారి నాటకాల స్టేజ్ మీద “ఎఫెక్ట్స్” చూశాను.
“మోహినీ భస్మాసుర” నాటకం… స్టేజ్ మీద లైట్లు లేవు… అంతా చీకటి… ఉన్నట్టుండి స్టేజ్ ముందు భాగంలో అటూ ఇటూ మధ్యలో పెద్ద శబ్దంతో ఔట్ల పేలుడు… వెనుక నుంచి భయంకర అట్టహాసం… స్టేజ్ మీద పొగలు… ఆ పొగల మధ్యలో ప్రత్యక్షం అయ్యాడు భస్మాసురుడు! నేనూ, మా వెంకన్న మామ, ఆయన కొడుకు పవన్ కుమార్… ఆరో క్లాసు చదువుతున్నాడప్పుడు వాడు … వరుసగా ఒక చివరగా కుర్చీల్లో కూచున్నాము. ఆ పేలుడు, పొగలు,అట్టహాసం విని వాడికి భయం వేసేసింది… ఏడుపు మొదలెట్టేశాడు… వెళ్ళిపోదాం… అంటూ ఒకటే గోల! చివరికి వాడి ఏడుపు భరించలేక మా వెంకన్న మామ “ఏరా పోదామా వీడు కూచోనివ్వటం లేదు?” అన్నాడు. “నువ్వు వెళ్ళు మావా!” అంటూ కుర్చీల వరుసల మధ్య వాళ్ళు వెళ్ళటానికి చోటిచ్చాను. “నీకు నాటకాలు బాగా ఎక్కేశాయ్రా?” అంటూ కొడుకును తీసుకొని ఇంటికి వెళ్లిపోయాడు వెంకన్న మామ. ఇప్పుడు ఇది వ్రాస్తున్న వేళ ఆ వెంకన్న మామా లేడు, ఆయన కొడుకు పవన్ కుమారూ లేడు! జీవిత “నాటకం”లో తమ తమ పాత్రలను అభినయించి, లోకంతో సంభాషణలను ముగించుకొని వెళ్ళిపోయారు!
ఇక సీతంపేట ప్రాచ్య భాషా కళాశాలలో, సదనంలో సాహిత్య ప్రసంగాలు, అష్టావధానాలు! మా మాష్టారు శరభయ్య గారితో పాటు నేనూను!
ఎన్ని నాటకాలు! ఎన్ని నృత్యాలు! ఎన్ని సంగీత కచేరీలు! ఎన్ని సాహిత్య ప్రసంగాలు! ఆ గణేశ నవరాత్రుల వైభవమే వేరు!
ఇవన్నీ ఒక ఎత్తు… వినాయక చవితి నాడు వినాయకుని బొమ్మ కొన్నప్పుడల్లా తప్పనిసరిగా గుర్తుకు వచ్చే మనిషి ఒకడు ఉన్నాడు… ఇన్నేళ్ల తరువాత పేరు గుర్తుకు రావడం లేదు కానీ… తలుచుకోకుండా ఏ ఏడూ గడవదు బొమ్మ కొనేటప్పుడు!
కడియపు లంక నుంచి వచ్చేవాడు చవితి ముందు రోజు పొద్దున్న విగ్రహాలతో. మా ఇంటికి ఎదురుగానే ఆ మెయిన్ రోడ్డు మీదే బొమ్మలు, పత్రి, గొడుగులు, వ్రతకల్పాలు అన్నీ దొరికేవి. పత్రి అంటే ఇప్పటిలా దొరికిన ఆకులన్నీ అమ్మేయడం కాదు… పేరు పేరున పేరు చెప్పి మరీ ఇచ్చేవారు. ఆ పత్ర విజ్ఞానం ఇప్పుడేదీ? అమ్మేవాళ్ళకీ లేదు, కొనే నాలాంటి వాళ్ళకీ లేదు!
ఇక కడియపు లంక నుంచి బొమ్మలు ముందు రోజే తెచ్చేస్తే రాత్రి ఎక్కడ పెట్టుకోవాలి? మా ఇంటిలో ఒక చిన్న గది ఖాళీగా ఉండేది. ఆ మనిషి నన్ను అడిగాడు… “మీ ఇంట్లో ఎక్కడైనా ఓ మూల పెట్టుకోవచ్చా రాత్రికి ఈ బొమ్మల్ని?” అని. మా తాతతో చెప్పాను. “ఆ గది ఖాళీగానే ఉందిగా అక్కడ పెట్టుకోమను” అన్నాడాయన. అప్పటి నుంచీ ఏటా ఆ గదిలో బోల్డు మంది వినాయకులు “రాత్రి నిద్ర” చేసేవారు! తాతతో మాట్లాడి ఆ గది ఇప్పించినందుకు ఆ బొమ్మల్లో నాకు నచ్చిన బొమ్మ “ఫ్రీ”! అసలు ఆ కడియపు లంక బొమ్మల అందచందాలే వేరు! ఎంత చిన్న బొమ్మలో అయినా ప్రతి “డీటెయిల్” స్పష్టంగా ఉండేది! అప్పట్లో ఆ బొమ్మలు తయారు చేసేవారు నిజంగా “కళాకారులు!”.
ఇన్ని జ్ఞాపకాలు ఒక్కసారిగా గుండె లోతుల్లో నుంచి తొంగి చూస్తాయి ఈ గణేశ నవరాత్రులలో ప్రతి ఏటా!
ఇప్పుడు ఏమి వుంది? ఇంటికో వినాయకుడు, అపార్ట్మెంట్ కి ఓ వినాయకుడు, కాలనీకి మరొకడు, ఒక్క మా అపార్ట్మెంట్ లోనే సెల్లార్ లో ఒక వినాయకుడు, ప్రతి ఫ్లాట్ లో ఒక వినాయకుడు… దాదాపు మా ఒక్క అపార్ట్మెంట్ లోనే అరవై మంది వినాయకులు! సాయంకాలం పూజ అయాక సినిమా పాటలు, మ్యూజికల్ చైర్స్, హౌస్ ఫుల్ గేమ్స్, బొడ్డూడని పిల్లల సినిమా పాటల డ్యాన్సులు!
ఇక నిమజ్జనం అంటే అదో హడావిడి! రోజంతా బయలుదేరి రాత్రి ఒంటిగంట, రెండు, మూడు… అలా వెడుతూనే ఉంటాయి వాహనాలు. వాటి ముందు డీజేలు, ఆ చుట్టుపక్కల ఎవడికీ రెండు మూడు రోజులు నిద్ర ఉండదు!
ఒకనాడు ఈ గణేశ నవరాత్రులు జాతిని సంఘటితం చేసేవి!
ఇప్పుడు అవే గణేశ నవరాత్రులు ఎవడి అపార్ట్మెంట్ సెల్లార్ లో వాడికిగా విడదీస్తున్నాయి!
ఒకనాడు గణేశ నవరాత్రులు సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలతో ఈ జాతి సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేవి!
ఇప్పుడు అవే గణేశ నవరాత్రులు మనిషిలోని “వికృతి”కి అద్దం పడుతున్నాయి!
ఆయనెవరో ప్రాచీన కవి అన్నాడట…”గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్” అని!
నిజమేగా అనిపిస్తూ ఇన్ని జ్ఞాపకాలను మోసుకువస్తాయి ఈ గణేశ నవరాత్రులు ప్రతి ఏటా నాలో!
Leave a comment