స్వీయ అన్వేషణ – 3
ఫణిహారం వేంకట రంగాచార్యులు గారు …
కడు పేద మనిషి. ఇంటికి పెద్దవాడు. తండ్రి పోయాడు. తల్లి, నలుగురు తమ్ముళ్లు. పోషణ బాధ్యత ఆయనదే. అక్షరాలు చదవగలడు కానీ వ్రాయలేడు. వ్రాయటం వచ్చినవి మూడే అక్షరాలు… ఫ. వెం. రం. సంతకానికి అవసరం కాబట్టి అవి అయినా నేర్చుకున్నాడు.
తనతో కలిపి ఆరుగురి పోషణ. ఏమి చేయాలి? దొరికిన పనల్లా చేశాడు. రైలు ఇంజన్ లో బొగ్గు వేసే పని చేశాడు… జిలేబీలు తట్టలో పెట్టుకుని వీధి వీధీ తిరిగి అమ్మాడు… అలా మొదలైన జీవితం రాజమహేంద్రవరం తహశీల్దార్ వరకు సాగింది. గుర్రం ఎక్కి తిరిగాడు, పల్లకిలో ఆఫీసుకి వెళ్ళాడు. వైభవం ఏర్పడింది. ఆస్తి సంపాదించాడు. సంపాదించిన ఆస్తిలో చాలా వరకూ బ్రాహ్మణ, వైశ్య కుటుంబాలకు ఇచ్చి ఇన్నిసుపేటను విస్తరించాడు. అప్పటి వరకు ఆ ఊరిలో ఆల్కట్ గార్డెన్స్ తరువాత పెద్ద మసీదు వరకు పెద్దగా ఏమీ లేదు. అప్పటి నుంచి క్రమంగా పెద్దాడ వారు, అడవికొలను వారు, మలపాక వారు, ముళ్ళపూడి వారు వచ్చారు. వైగ్రాం రోడ్ లో కోమలి వారి కుటుంబాలు వచ్చాయి. “కోమలి వారి నూనె గానుగ పరిశ్రమ” ఆనాడు స్వచ్చమైన గానుగ నూనెలకు ప్రసిద్ధి!
ఆయన కాలంలోనే ఆయన తల్లి ఈ వంశానికి ఆరాధ్యంగా “దేవతార్చన” మొదలు పెట్టింది. దానిలో 3X3 అంగుళాల శ్రీమహాలక్ష్మీ బంగారు యంత్రం, రెండు అంగుళాల బంగారు శ్రీమహాలక్ష్మీ విగ్రహం, వెండి వెన్నముద్ద కృష్ణుడు విగ్రహం వున్నాయి. తరువాత కాలంలో సాలగ్రామాలు, పన్నెండు మంది ఆళ్వారుల పంచలోహ విగ్రహాలు, శ్రీ పెరంబుదూరు శ్రీ రామానుజుల వెండి పాదుకలు, శేష వస్త్రం చేరాయి.
ఇక ఆయన తమ్ముళ్లు నలుగురు… ఇంటికి ఎదురుగా ఒకప్పుడు ఉండే డీలక్స్ హోటల్, వరదరావు హోటల్ స్థలాలు కూడా ఆయన సంపాదించినవే. తమ్ముళ్లు “మహాత్ములు”… ఆ స్థలంలో సారాయి దుకాణం పెట్టారు. పోలీసు కేసులు పడ్డాయి. అప్పుడు ఆయన తమ్ముళ్ళతో తెగదెంపులు చేసుకుని, ఆ స్థలాలు వారికి వ్రాసి ఇచ్చేశాడు. వారు వాటిని అమ్మేసుకుని దేశాలు పట్టిపోయారు. వారి ఊరూ పేరూ లేకుండా పోయాయి. వారి వంశాలు ఆనవాలు లేకుండా పోయాయి. నా ముత్తాతకు తండ్రి అయిన
ఫణిహారం వేంకట రంగాచార్యులు గారికి ఒకడే కుమారుడు…
ఫణిహారం వేంకటాచార్యులు గారు
(నా ముత్తాత)
ఫణిహారం వేంకట రంగాచార్యులు, వెంకాయమ్మ గార్ల ఏకైక కుమారుడు. ఆయన ఏమి చేసేవారు అనే వివరాలు నాకు తెలియవు. ఆయన గురించి నాకు తెలిసినవి నాలుగు విషయాలు. 1. స్థానిక న్యాయస్థానాలలో జ్యూరీ సభ్యులుగా ఉండేవారు. 2. ఆయన 8 పేజీల చిన్న పత్రిక కొన్ని నెలలు నడిపారు. 3. ధర్మ శాస్త్ర వేత్త. 4. మహాయోగి.
నాలుగవ విషయం కొంత వివరంగా చెప్పాలి.
మొదటి విషయం గురించి చెప్పవలసింది ఏమీ పెద్దగా లేదు. అప్పట్లో సమాజంలో పెద్దలుగా ఉన్నవారు జ్యూరీ సభ్యులుగా నియమితులు కావడం మామూలే.
ఇప్పుడు రాజమహేంద్రవరం లో ఇన్నీసుపేటలో (ప్రస్తుతం త్యాగరాజ నగర్) మెయిన్ రోడ్ నుంచి గోదావరి గట్టుకు వెళ్ళే ఒక వీధికి ఆయన తండ్రి గారి పేర “రంగాచారి రోడ్” అనే నామకరణం ఈయన కాలంలోనే జరిగింది.
పత్రికా నిర్వహణ: ఒకసారి రాజమహేంద్రవరం పండితులలో ఒక వివాదం వచ్చింది. ఆ వివాదం స్థూలంగా ఇదీ… “అవివాహితుడు అయిన బ్రహ్మచారి మరణిస్తే దహనం చేయాలా? ఖననం ( పూడ్చి పెట్టడం) చేయాలా?”.
దీనిపై రెండు వర్గాలుగా చీలిపోయారు ధర్మ శాస్త్ర పండితులు. వేంకటాచార్యుల వారి నిర్ణయం కోరారు. వారు “ఉపనయనం అయిన వారు ఎవరికైనా దహనమే విధాయకం” అని నిర్ణయించారు. దానికి అనేక ధర్మ శాస్త్ర ప్రమాణాలు చూపించడం తో ఆ నిర్ణయమే అందరూ అంగీకరించారు.
అప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన “పత్రిక”. ధర్మ శాస్త్ర విషయంలో వున్న అనేక సందేహాలకు ప్రమాణాలతో సహా సమాధానాలు అందిస్తూ కొన్ని నెలల పాటు 8 పేజీల పత్రిక నడిపారు. ఆ పత్రిక పేరు “ధర్మ దీప్తి“. ఈ పేరు విషయం నాకు చెప్పిన వారు నన్ను పెంచిన చిన్న నాయనమ్మ కనకమ్మ గారు. మేము “ధర్మ దీప్తి” పత్రిక ప్రారంభించినప్పుడు ఆమె ఈ విషయం నాకు చెప్పారు. మేము ప్రారంభించినప్పుడు ఆ పేరు సూచించిన వారు మా తండ్రి సీతారామాచారి గారు. తెలిసి చేసిన సూచన కానే కాదు. ఎవరు నిర్దేశించిన ఏనాటి స్ఫురణయో మరి!
ఇక నాలుగవ విషయం… ప్రధాన విషయం. ఆయన శ్రీకృష్ణ మంత్ర ఉపాసకుడు. ఈయన నుంచి మాత్రమే ఈ కుటుంబంలో మంత్ర ఉపాసన మొదలు అయింది. ఆయన ఎంతటి వాడు అని తెలుసుకోవడానికి ఆయన రెండవ కుమారుడు వేంకట వల్లభాచార్యులు గారు ( నన్ను పెంచిన చిన్న తాతగారు) చెప్పిన రెండు విషయాలు చెప్పటం అవసరం.
- ఆయన మరణ శయ్య పై ఉన్నారు. గదిలో జీరో బల్బ్ వెలుగుతోంది. అప్పటి జీరో బల్బ్ ల వెలుగు ఒక విధమైన పసుపు, లేత ఎరుపు కలిసిన రంగులో ఉండేది కదా! ఆయన చివరి క్షణాలలో ఆ గది అంతా నీల కాంతి తో నిండి పోయింది. ఆయన ఒక్కసారి కళ్ళు తెరచి మంచం ప్రక్కనే ఉన్న రెండవ కుమారుడు వల్లభాచార్యులు గారిని చూసి చిరునవ్వుతో “ఒరేయ్! కృష్ణుడు వచ్చాడు. వెడుతున్నాను” అని కళ్ళు మూసుకున్నారు. అంతే!
ఈ మహత్తర సంఘటన గురించి నాకు వల్లభాచార్యులు గారు, కనకమ్మ గారు ఇద్దరూ ఎన్నో సార్లు చెప్పారు. శ్రీకృష్ణ కృప పరిపూర్ణంగా పొందిన మహాయోగి, ధర్మ శాస్త్రవేత్త శ్రీమాన్ ఫణిహారం వేంకటాచార్యులు గారు. - ఆయనే ఈ కుటుంబానికి శ్రీరామరక్ష! ఎలా? ఈ విషయం చదివితే తెలుస్తుంది. ఆయన పెద్ద కుమారుడు ఫణిహారం వేంకట రంగాచార్యులు గారు.( నాకు తాత గారు). ఆయనకు తమిళనాడు లోని శోలింగర్ లో ఒక గురువు ఉండేవారు. ఆయనను “రెడ్డి గారు” అనే వారు. రంగాచార్యులు గారికి ఆయన “మహా మృత్యుంజయ మంత్రం” ఉపదేశించారు. దానిని ఆయన జీవితాంతం అనుష్ఠానం చేశారు. బంగారు తొడుగు ఉన్న రుద్రాక్ష పూసల మాల ఆయన జపమాల. (దాని మీద నాకు చాలా వ్యామోహం ఉండేది. ఆయన పోయాక ఆ మాల నాకు ఇమ్మంటే ఆయన భార్య తాయారమ్మ గారు ఒప్పుకోలేదు. ఒకరు జపం చేసిన మాలను ఇంకొకరు వాడ కూడదు అని, దానిని గోదావరిలో వదలి వేయమని చెప్పారు. నా చేతుల తోనే దానిని గోదావరికి అర్పించాను. ఇక అసలు కథ లోకి వెడదాం) రంగాచార్యులు గారి గురువు గారు అయిన రెడ్డి గారు చాలాసార్లు రాజమహేంద్రవరం లోని ఇంటికి వచ్చే వారట. వచ్చినప్పుడల్లా వేంకటాచార్యుల గారికి స్నానానికి నీళ్ళు సిద్ధం చేసేవారుట. ” మీరు మా అబ్బాయికి గురువు. ఇలాటి పనులు చేయకూడదు” అంటే “మీ అబ్బాయికే గురువును. మీకు కాదు. అయినా మీరు సంకల్పించక పోతే నేను అతనికి గురువును కాగలిగే వాడినా?” అన్నారుట రెడ్డి గారు.
వేంకటచార్యులు గారు దేవతార్చన, జపం చేసుకుంటున్నంత సేపు అక్కడే కూర్చుని జపం చేసుకునే వారుట. పూర్తి అయాక ఆయన పాదాలకు నమస్కరించే వారట రెడ్డిగారు.
ఒకసారి రెడ్డిగారు రంగాచార్యులు గారికి, వల్లభాచార్యులు గారికి ఒక మాట చెప్పారుట… ” మీ నాన్నగారు మరణిస్తే దహనం చేయవద్దు. మీ ఇంటిలోనే పెరటిలో ఖననం చేసి, సమాధి మందిరం నిర్మించి రోజూ పూజించండి. అలా చేస్తే మీ కుటుంబం 15 తరాల వరకు సంపన్నంగా, సుఖంగా వర్ధిల్లుతుంది” అని.
చివరికి ఆ పని జరగలేదు… అది వేరే విషయం.
నా జీవితంలో పాత్రికేయ రంగ సంబంధం, సాధనా ప్రపంచ ప్రవేశం అనే రెండు అంశాలకు శ్రీమాన్ ఫణిహారం వేంకటాచార్యులు గారు అనే “మహాయోగి” ఆశీర్వాద బీజాలు మూలం అని భావిస్తాను నేను.
Leave a reply to Prof. T. Patanjali Cancel reply