స్వీయ అన్వేషణ – 4
గత పోస్టులో ఈ రంగాచార్యులు గారి గురించి ప్రస్తావించాను. ఈయన నిత్య మహా మృత్యుంజయ మంత్ర అనుష్ఠాత. అంతే కాదు ఈయన “దాన వీరుడు” కూడా.
ఆ దాన వీరత్వం గురించి తెలియాలి అంటే ముందుగా మా ఇంటి గురించి తెలియాలి.
రాజమహేంద్రవరంలో మెయిన్ రోడ్ లో 2370 చదరపుటడుగుల స్థలంలో ఇల్లు. వెనుక మెట్ల బావి, దానికి నీటి సరఫరా కోసం దానిని ఆనుకుని ప్రక్కనే ఒక చేదబావి. ఈ చేదబావికి మెట్లబావికి అనుసంధానంగా ఒక చిన్న కిటికీలాంటి నిర్మాణం.
వెనుక పెరట్లో రెండు పెద్ద పొగడ పూల చెట్లు. తెల్లారేసరికి వెనుక పెరడు అంతా వెన్నెల పరచినట్లు పొగడ పూల తివాచీ. ఆ పొగడ చెట్లకు ముందు ఒక పెద్ద మామిడి చెట్టు. అది డిసెంబర్లో ఒకసారి, ఉగాది కాలంలో ఒకసారి పూసి, కాచేది. ప్రతిసారీ దాదాపు 500 కాయల దిగుబడి. చిన్న ముక్క కొరికినా నాలుక చిల్లు పడిపోయేది ఎంత ఉప్పూ , కారం దట్టించినా!
ఆ మామిడి చెట్టుకు ఒక ప్రక్కగా పెద్ద సున్నం కుండీ. దానిలో గుల్ల సున్నం మూడొంతులు నింపి, నీళ్ళు పోస్తే సున్నం కుత కుత ఉడుకుతూ పొగలు, సెగలు వచ్చేవి. ఆ సున్నంతోనే ఇంటి అంతకీ వెల్ల పూత.
దక్షిణం వైపు పెరట్లో ఒక సింహాచలం సంపంగి చెట్టు. ఎన్ని అడుగుల ఎత్తు పెరిగిందో లెక్క తెలియదు కానీ పొడుగైన గడ కర్రకు ఒక కొక్కెం కట్టి పూలు తెంపుతూ ఉంటే జబ్బలు లాగేసేవి. కనీసం 300 సంపంగి పూలు వచ్చేవి ప్రతి మూడు నాలుగు రోజులకూ!
ఇక లోపలికి వెడితే ఎనిమిది అడుగుల ఎత్తైన బర్మా టేకు సింహద్వారం, దానికి ఇత్తడి గుబ్బలు. దానికి ముందు చిన్న కటకటాల గది. సింహద్వారం మూయటానికి లోపలివైపు అడ్డంగా రెండు అంగుళాల మందంతో స్టీలు గడియ. అది దాటి లోపలికి పది అడుగులు వేశాక ఒక మెట్టు. ఆ మెట్టు దిగి అడుగు పెడితే కచేరి చావడి, అది ఒక పెద్ద మండువా. దానికి అటూ ఇటూ ఏడు విశాలమైన గదులు, ఆ గదులు అన్నిటికీ మళ్ళీ ఒక్కొక్క పెరటి గది. ఆ చావడిలో నాలుగు పెద్ద పెద్ద గుండ్రని సిమెంట్ స్థంభాలు, పై కప్పుకు వ్రేలాడే షాండిలియర్లు.
ఆ పెద్ద చావడి దాటి లోపలికి అడుగు పెడితే చిన్న చావడి, అది కూడా మండువానే. దానిలో చతురస్రాకారంలో బర్మా టేకు స్థంభాలు నాలుగు. పై కప్పును నిలబెడుతూ దూలాలు, వాసాలు అన్నీ బర్మా టేకువే. ఆ మండువాలోనే ఒక విశాలమైన అటక. మండువా మధ్యలో పై కప్పులో స్టీలు చువ్వలతో ఒక ఫ్రేము. వాన పడినప్పుడు ఆ చావడి అంతా తడి కాకుండా ఆ ఫ్రేము క్రింద ఒక పెద్ద తొట్టె వంటి నిర్మాణం. దానికి ఒక వైపు నీరు పెరటిలోకి పోవడానికి సిమెంటు కాలువ.
ఆ చిన్న మండువా నుంచి లోపలికి వెడితే పడమటిల్లు అనే పెద్ద గది, దానికి ఆనుకొని కటకటాల పెరటి గది. దానికి ఎడమవైపు చిన్న వంటిల్లు. దానిలో మట్టి పొయ్యిలు. ఆ పెరటి గడికి కుడి వైపు “పాల కొట్టు”. దానిలో ఎనిమిది మట్టి పొయ్యిలు.
మా ముత్తాత కాలంలోనూ, మా తాతల కాలంలో కొన్నాళ్ళు ఇంటిలో ఆవులు, గేదెలు ఉండేవి. రోజూ దాదాపు 100 లీటర్ల పాలు. మట్టి కుండలలో పోసి, ఈ పొయ్యిల మీద కాచేవారుట! ఆ వైభవం నేను చూడక పోయినా, ఆ పాలకొట్టు, ఆ మట్టి పొయ్యిలు మాత్రమే చూడ గలిగాను.
ఈ ఇల్లు కాక పొలాలు, తోటలు. తోటల నుంచి ప్రతి రోజూ గంపలతో కూరగాయలు, ఆకుకూరలు. ముఖ్యంగా ప్రతి రోజూ తోటకూర, వంకాయలు వచ్చేవి. చిన్నప్పుడు ఆ వంకాయ తిని తిని విసుగు, వెగటు వచ్చేసి వంకాయను స్వచ్ఛందంగా త్యజించేశాను. అది “వంకాయ వైరాగ్యం”. ఆ వైరాగ్యాన్ని మా ఎన్ సి సి క్యాంప్ వదలగొట్టేసింది. పొద్దున్నే లేపి మైళ్ళకు మైళ్ళు పరుగులు తీయించి, నాలుగిడ్లీలు పడేసి, కాసిని టీ నీళ్ళు పోసి, డ్రిల్. ఆ తరువాత లంచ్ లో మొదటి రోజే ప్రత్యక్షం “వంకాయ కూర”. ఎంత వైరాగ్యం వచ్చినా కడుపు కాలితే ఏం చేస్తాం? ఆ వంకాయ ముక్కను పట్టుకుంటే “ఆయ్! హన్నా! ఇన్నేళ్లు నన్ను వదలేసి, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని తింటావ్?” అంటూ చేతి వ్రేళ్ళ సందు నుంచి ఎగిరిపోయేది. ఇంతకీ అది రబ్బరు ముక్కా? వంకాయ ముక్కా? అన్నది ఇన్నేళ్ళ తరువాత కూడా ఇప్పటికీ అర్థం కాలేదు.
సరే, ఈ వంకాయ కథ ప్రక్కన పెట్టి అసలు విషయంలోకి వద్దాం.
మా ఇల్లు చెప్పాను కదా? ఆ ఇంటి నిర్వహణ బాధ్యత అంతా రంగాచార్యులు గారి మరొక తమ్ముడు భాష్యకారాచార్యులు గారిది. జాగ్రత మనిషి. అయినా రంగాచార్యులు గారు పట్టించుకునే వారు కాదు. ఎవరు వచ్చి సహాయం అడిగినా చేతిలో ఎంత ఉంటే అంతా ఇచ్చేయటమే. చేతిలో లేకపోతే ఎక్కడికైనా అప్పు చేసి తెచ్చి ఇచ్చేయడమే. అలా అప్పులు పెరిగి వాటిని తీర్చడానికి పొలమో, తోటో అమ్మేసి అప్పులు తీర్చేయటమే!
అలా పొలాలు, తోటలు ఖర్చై పోయాయి. ఆయన కొడుకులు ముగ్గురిలో ఇద్దరు ఊరి నుంచి వచ్చి సంతకాలు చేసి పోవటమే. మరో కొడుకు వామాచార స్మశాన కాళీ సాధన చేస్తూ, కొన్ని సందర్భాలలో తగువులు వచ్చి, ఆస్తిలో ఆయనకు రావలసిన వాటా ఇచ్చి, బయటకు పంపేశారు.
రంగాచార్యులు గారి తరువాతి వారు వేంకట వల్లభాచార్యులు గారు. మద్రాసు హైకోర్టులో ప్రముఖ న్యాయవాది. అన్నగారి దాన వీరత్వం చూసి ఇల్లు కూడా మొత్తం గుల్ల అయిపోతుందని భయపడి, వచ్చి ఇల్లు వాటాలు వేసేశారు. రంగాచార్యులు గారి అప్పులు అన్నీ తీర్చటానికి ఆయనకు వచ్చిన వాటా అమ్మేశారు. 2370 చదరపు టడుగుల ఇల్లు 960 చదరపు టడగులకు వచ్చేసింది. ( ఇప్పుడు అదీ లేదు… అది వేరే సంగతి) రంగాచార్యులు గారికి ఆస్తి లేదు. ఆయనకంటూ ఇల్లూ లేదు.
అలా ఆయన వాటా అమ్మి, అప్పులు తీర్చగా మిగిలినది 20 వేలు. ఆరున్నర అడుగుల మనిషి, మొకాళ్ళ వరకూ ఉండే ఒక అంగవస్త్రం, ఎడమ భుజాన ఒక కండువా, చేతిలో ఆరడుగుల కర్ర. అదీ ఆయన స్వరూపం. మిగిలిన 20 వేలు పై కండువాలో కట్టుకుని బయలుదేరారు. అప్పుడు నాకు ఏడెనిమిదేళ్ళు ఉంటాయి. “ఏరా! కూడా వస్తావా?” అన్నారు. ఆయన వెంటే వెళ్ళాను. ఒక మిత్రుడు ఇంటికి వెళ్లి, పై కండువాలో కట్టిన 20 వేలు తీసి బల్ల మీద పెట్టారు. “ఆ మధ్య ఓ 20 అవసరం అన్నావ్ కదా? ఇవిగో, తీసుకో!” అన్నారు. ఆ మిత్రుడి నోట మాట రాలేదు, తెప్పరిల్లి “రంగా! అన్నీ అయిపోయాయా? కాస్తైనా మిగిల్చావా?” అని అడిగారు. ” కావుడూ! ఇదే ఆఖరుది. దీని మీద నీ పేరు రాసేశాను” అంటూ లేచి, “పదరా” అంటూ నన్ను తీసుకుని బయటకు నడిచారు.
“అన్నయ్యా! ఇల్లు నిలబడాలి అని చేశాను. అంతే. నువ్వు ఉన్నన్నాళ్ళూ కలిసే ఉందాం” అన్నారు వల్లభాచార్యులు గారు. అలా ఆ “దాన వీరుడు” రంగాచార్యులు గారు జీవించి ఉన్నంత కాలం తమ్ముడి ఇంటిలోనే గడిపారు. ఇందాక చెప్పిన పడమటి ఇల్లు, దాని పెరటి గది, చిన్న వంటిల్లు ఆయన నివాసం.
ఇది రంగాచార్యులు గారి ఒక పార్శ్వం. మరొక పార్శ్వం… ఆయన “దివ్య దృష్టి”!
అది రేపు..
Leave a reply to Prof. T. Patanjali Cancel reply