స్వీయ అన్వేషణ – 9
వేంకట వల్లభాచార్యులు గారు, కనకమ్మ గారు మద్రాస్ లో నివసిస్తున్న కాలంలో తమ వద్ద ఉన్న వెండి, బంగారాలు షోలింగర్ లో ఉన్న శ్రీ యోగానంద నృసింహ స్వామి, శ్రీ అమృత వల్లి తాయారు ఆలయానికి ఇచ్చేశారు. ఆవిడ 22 తులాల బంగారు వడ్డాణం కరిగించి స్వామికి యజ్ఞోపవీతం చేయించారు. ఆమె వజ్రాల దుద్దులు అమ్మవారికి సమర్పించారు. అప్పుడు ఆలయ అధికారులు ఆ దంపతులకు “ఆలయ మర్యాదల అధికారిక పత్రం” ఇచ్చారు. ఆ అధికారం ఆ దంపతులకు మాత్రమే కాక వారి కుటుంబ సభ్యులు అందరికీ వంశ పారంపర్యంగా వర్తిస్తుంది. ఆ పత్రాన్ని నేను చూశాను. (దానిని ప్రస్తుత ఆస్తి నిర్వహణ చేస్తున్న వారు పోగొట్టడం ఒక దురదృష్టం. ఇదొక్కటేనా? తరతరాల దేవతార్చన, పూర్వీకుల అమూల్యమైన ఫోటోలు అన్నీ వారి నిర్లక్ష్యానికి బలై కనుమరుగు అయిపోయాయి. నేను ఎంత ప్రయత్నించినా వాటి జాడ తెలియలేదు.)
కనకమ్మ గారు ఆ ఆలయానికి సమర్పించిన ఈ ఆభరణాలు కాక ఆ వడ్డాణం లోని పచ్చల పతకం, 40 కిలోల వెండి , 18 తులాల బంగారం మిగిలాయి.
వాటిని రాజమహేంద్రవరం లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి సమర్పించాలి అనుకున్నారు ఆ దంపతులు. వాటిలో పచ్చల పతకాన్ని స్వామి వెండి కిరీటంలో పొదిగించారు. స్వామికి, ఆ ఆలయంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామికి వెండి కవచాలు ఉన్నాయి. కానీ అదే ఆలయంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి లేదు. అందుకని తమ దగ్గర ఉన్న 40 కిలోల వెండిలో 20 కిలోలతో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామికి వెండి కవచం చేయించారు. ( తరువాతి కాలంలో ఆలయంలో జరిగిన ఒక దొంగతనం లో ఆ కవచం పోయింది.)
ఇక మిగిలినది 18 తులాల బంగారం. దానితో ఒక నెక్లెస్ చేయించి శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి సమర్పించాలి అనుకున్నారు. చేయించారు. ఒక శ్రావణ శుక్రవారం… వరలక్ష్మీ వ్రతం రోజు ఆలయానికి వెళ్ళి దానిని సమర్పించి, అలంకరింప చేయాలి అని సంకల్పం.
ఆ వరలక్ష్మీ వ్రతం రోజుకు వారం రోజుల ముందు నుంచీ వేంకట వల్లభాచార్యులు గారి ఆరోగ్యం దెబ్బ తింది. క్రమంగా క్షీణించింది.
తెల్లవారితే శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం. ఆ ముందురోజు రాత్రి ఆయన పరిస్థితి విషమించింది. ఆయాసం పెరిగి పోయింది. ఆయన ఛాతీ ఆయాసంతో ఎగిరెగిరి పడుతోంది. గురక పెరుగుతోంది. ఆవిడ ఆయన గుండెల మీద చెయ్యి వేసి ప్రక్కనే కూర్చుని ఉంది. నేను ఒక ప్రక్కగా గోడకు ఆనుకుని నిలబడి చూస్తున్నాను. గంటలు గడుస్తున్నాయి. ఒక్కసారిగా ఆయన గొంతులో గురక ఆగిపోయింది…ఆయాసంతో ఎగిరెగిరి పడుతున్న ఆయన ఛాతీ నిశ్చలం అయిపోయింది. ఆవిడ ఏదో షాక్ కొట్టినట్టు ఎగిరి క్రింద పడిపోయింది. వేంకట వల్లభాచార్యులు గారు ఇక లేరు.
గురక ఆగిపోయి, ఛాతీ కదలిక ఆగిపోవటం చూశాను. అర్థం అయింది. ఆయన పోయారు. ఆ క్షణంలో నాలో కదలిన భావన ఒక్కటే… ” ఇంతేనా? చావు అంటే ఇంతేనా?” ఆ క్షణం నుంచీ “మృత్యువు అంటే ఇంతే కదా?” అనే భావన నాలో నిండిపోయింది. ఇప్పుడు ఏ వ్యక్తి మరణ వార్త విన్నా ” ఇంతే కదా?” అనిపిస్తుంది. లోపల ఏదీ కదలదు. కాళిదాస మహాకవి రఘువంశ కావ్యంలో వశిష్ఠ భగవానుని నోట ఒక మాట అనిపిస్తాడు. “జననమే వికృతి. మరణమే ప్రకృతి”. జననం యాదృచ్చికం. మరణం సత్యం. ఈ రహస్యం తెలిస్తే మరణ భయం ఉండదు. వేంకట వల్లభాచార్యులు గారు నాకు అనేక విషయాలలో గురువు. ఆయన ఎన్నో జీవిత పాఠాలు నేర్పారు. చివరికి ఆయన మరణం కూడా మరణ భయాన్ని పోగొట్టి గురువుగా నిలిచింది. ” పితామహ ఆచార్య పాద యుగళ మాశ్రయామి”
“నా చదువులు…” రేపటి నుంచి వరుసగా…
Leave a reply to prof. T. Patanjali Cancel reply