” గురు దర్శనం!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 15

ఆ రోజు జువ్వాడి గౌతమరావు గారు విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్ష పఠనం రికార్డు చేసుకోవటానికి అని బయలుదేరాం కదా! ఇక్కడ ఒక విషయం చెప్పాలి.

నేను చదువు మానేశాక 1974 -75 (సంవత్సరం సరిగా గుర్తు లేదు) లో నేను (కొన్ని నెలలు మాత్రమే) టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగం చేశాను. ఆ ఉద్యోగానికి మూడు నెలల శిక్షణ హైదారాబాద్ లో. అప్పుడు మా చివరి మేనమామ (తరువాత బావగారు అయాడు) తిరుమల కాండూరి విజయకుమార్ గదిలోనే ఉన్నాను. ఆయన ప్రసిద్ధ సాహితీ సంస్థ “యువభారతి” సభ్యుడు, కార్యకర్త. 

యువభారతి అనేక పుస్తకాలు ప్రచురించింది. వాటిలో “కవితా వైభవం” అనే పరంపర ఒకటి. ఆ పరంపరలో ” విశ్వనాథ కవితా వైభవం” ఈ జువ్వాడి గౌతమరావు గారే వ్రాశారు. మేనమామ దగ్గర ఉన్న గ్రంథాలలో చాలా వరకూ ఆ మూడు నెలల్లో చదివాను. దానిలో “విశ్వనాథ కవితా వైభవం” ఒకటి. అది చదివాక “ఈ విశ్వనాథ మన బ్యాచ్ కాదు. ఎవడికీ అర్థం కాదు. ఏం రాస్తున్నాడో తెలియదు” అనుకుని ఆ తరువాతి కాలంలో విశ్వనాథ రచన ఒక్కటి కూడా ముట్టుకోలేదు. ఆధునిక కవుల్లో శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, కరుణశ్రీ మాయలో పడ్డాను. అదే గౌతమరావు గారు అదే విశ్వనాథ రామాయణం చదువుతారు ఇప్పుడు. నిజానికి మనకు సంబంధం లేదు. అయినా శేషయ్య శాస్త్రి గారు, రామారావు గారు రమ్మన్నారు. అందుకని వెళ్ళాను.

సమాచారం పత్రిక ప్రక్కన శరభయ్య ఇల్లు. లోపలికి వెళ్లాం. ఎదురుగా ఒక కుర్చీలో గౌతమరావు గారు కూర్చుని ఉన్నారు. ఒక ప్రక్కగా మరొక కుర్చీలో ఒక నల్లని, బక్కపలచని వ్యక్తి, ఎర్రని పంచ, ఉత్తరీయం. నుదుట, ఛాతీపై, భుజాలకు, మోచేతులకు, మణికట్లకు విభూతి రేఖలతో పరమశివ సన్నిభునిగా కూర్చుని ఉన్నారు. శేషయ్య శాస్త్రి గారు, రామారావు గారు ముందు ఆయనకు, తరువాత గౌతమ రావు గారికి నమస్కరించారు. ఇద్దరికీ నన్ను పరిచయం  చేశారు.

విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్ష పఠనం మొదలైంది. అహల్య ఖండం సాగుతోంది. ప్రతి పద్యానికి శరభయ్య గారు, గౌతమ రావు గారు వివరణ ఇస్తున్నారు. గౌతమరావు గారి కంఠంలో ఏదో “మ్యాజిక్” ఉంది. ఆ పఠన విధానంలో ఏదో “సమ్మోహన శక్తి” ఉంది. ఇక శరభయ్య గారి లోతైన విశ్లేషణ ఆయన “రస సిధ్ధి” ని ఆవిష్కరిస్తున్నది. నాకు చుట్టు ప్రక్కల ఎవరు ఉన్నారో తెలియటం లేదు, నేను ఎక్కడ ఉన్నానో తెలియటం లేదు. ఆ పఠనం పూర్తి అయేసరికి నాలో నుంచి శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, కరుణశ్రీ అందరూ మాయమై పోయారు. నా మనసును విశ్వనాథ వారు పరిపూర్ణంగా ఆక్రమించేశారు. అలా గౌతమరావు గారి ” విశ్వనాథ కవితా వైభవం” చదివి విశ్వనాథ వారిని ప్రక్కన పెట్టేసిన నాలో విశ్వనాథను నింపేసినవాడు ఆయనే. సమస్య, సమాధానం రెండూ ఆయనే!

ఆ రోజు సాయంత్రం వరకూ నాలో విశ్వనాథ వారు నిండిపోయారు, పిచ్చి పట్టినట్టు అయింది. రోడ్డున పడ్డాను “రామాయణ కల్పవృక్షం” కొని తెచ్చుకోవటానికి. ఎక్కడా దొరకలేదు రాజమండ్రిలో! చీకటి పడిపోయింది. ఇక షాపులూ ఉండవు. లాభం లేదు.

రాత్రి 9 గంటలకు బస్ ఎక్కి కొవ్వూరు వెళ్ళాను. అక్కడి ప్రాచ్య కళాశాల అధ్యాపకులు శ్రీమాన్ సముద్రాల రంగ రామానుజాచార్యుల వారి ఇంటి తలుపు తట్టాను. తలుపు తెరవగానే ” మాష్టారూ! రామాయణ కల్పవృక్షం కావాలి” అన్నాను. ” ఇంత రాత్రి ఏమిటండీ?” అన్నారు ఆయన ఆశ్చర్యంగా. ఆ రోజు ఉదయం నుంచీ జరిగింది అంతా చెప్పాను. ఆయన ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళి “రామాయణ కల్పవృక్షం – బాల కాండము” తెచ్చి ఇచ్చారు. ” థ్యాంక్స్ మాష్టారూ!” అంటూ వచ్చేసి, బస్సెక్కి రాజమండ్రి చేరాను. రాత్రి 11 అయింది. కల్పవృక్షం పట్టుకుని కూర్చున్నాను రాత్రి అంతా.

“వస్తూ ఉండండి!”

ఆ రోజు ఉదయం  పఠనం మధ్యలో చిన్న విరామ సమయంలో శేషయ్య శాస్త్రి గారు శరభయ్య గారితో ” మన వాడు కూడా పద్యం బాగా వ్రాస్తాడు మాష్టారూ!” అన్నారు. నా గుండె గుభేలుమంది. ఇప్పుడు చదవాలంటే నా గతేమిటి? విశ్వనాథ ప్రపంచంలో ఓలలాడుతూ ఉన్న ఆ సమయంలో నా పద్యాలా? సంశయిస్తూ ఉంటే గౌతమరావు గారు ” చదవండి, విందాం” అన్నారు. శరభయ్య గారు ఏమీ మాట్లాడకుండా “సరే” అన్నట్టు తల ఊపారు. ఒకప్రక్క ఆయన “అయిష్టం” తెలుస్తూనే ఉంది. శేషయ్యశాస్త్రి గారు ” కానివ్వండి” అన్నారు.

ఎలాగో ధైర్యం కూడదీసుకుని జేబులో నుంచి కాగితం బయటకు తీశాను. శరభయ్య గారు “ఒకటో,రెండో చదవండి” అంటూ గౌతమరావు గారితో ” అన్నం అంతా చూడాలా? ఒక్క మెతుకు చూస్తే చాలదూ?” అన్నారు.

రెండు  పద్యాలు చదివి ఆపాను. “ఆపారేం? చదవండి!” అన్నారు గౌతమరావు గారు. ” ఎన్ని పద్యాలు?” అన్నారు శరభయ్య గారు. “పన్నెండు” అన్నాను. “అన్నీ మళ్ళీ మొదటి నుంచీ చదవండి” అన్నారు శరభయ్య గారు. పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్టు అయింది. ధైర్యం వచ్చింది. అన్నీ వరుసగా చదివాను.

“పద్యం బ్రతికే ఉంటుంది. తరువాతి తరం తయారవుతోంది” అన్నారు గౌతమరావు గారు. “బాగుంది” అన్నారు శరభయ్య గారు.

రికార్డింగ్ పూర్తి చేసుకుని బయటకు వస్తుంటే శరభయ్య గారు ” మీ పేరేమిటన్నారు?” అని అడిగారు. ” వల్లభాచార్యులు మాష్టారూ!” అన్నాను. ” అప్పుడప్పుడు, వీలైనప్పుడల్లా సాయంత్రం 5 తరువాత వస్తూ ఉండండి” అన్నారు మాష్టారు.

అంతే… ఆ క్షణం నుంచి ఆయన నాకు సాహిత్య గురువు. ఇప్పటికీ, ఎప్పటికీ నేను పద్యం వ్రాసినా, విమర్శ వ్రాసినా, కథ వ్రాసినా అన్నీ మా మాష్టారు శరభయ్య గారు పెట్టిన “భిక్ష” యే.

” కావ్యజ్ఞ శిక్ష” రేపు…


One response

  1. prof. T. Patanjali

    ” గౌతమరావు గారి ” విశ్వనాథ కవితా వైభవం” చదివి విశ్వనాథ వారిని ప్రక్కన పెట్టేసిన నాలో విశ్వనాథను నింపేసినవాడు ఆయనే. సమస్య, సమాధానం రెండూ ఆయనే! ” చక్కని వాక్య నిర్మాణం. నమః

    Like

Leave a comment