స్వీయ అన్వేషణ – 17
మా మాష్టారు శరభయ్య గారు రాజమహేంద్రవరంలోని గోదావరి గట్టున ఉన్న ఆర్య వైశ్య మహిళా సంస్కృత కళాశాలలో అధ్యాపకులుగా పని చేసేవారు.
మొదట్లో వారానికి ఒకటి రెండు సార్లు ఆయనను ఇంటి దగ్గర కలిసేవాడిని. తరువాత ఆయనతో సాన్నిహిత్యం ఎంత పెరిగింది అంటే ఆయన కాలేజ్ క్లాసెస్ టైమ్ టేబుల్ నా దగ్గర వుండేది…. ఇప్పటికీ ఉంది. ఆయన బోధించే పీరియడ్ల మధ్య విరామంలో కూడా ఆయనను ఆ కాలేజ్ లోనే కలిసేవాడిని.
కృష్ణశాస్త్రి ” నాకుగాదులు లేవు, ఉషస్సులు లేవు” అంటాడు. నా మటుకు నాకు ఉగాదులు ఉన్నాయి కానీ ఉషస్సులు లేవు అప్పటికీ… ఇప్పటికీ! రాత్రి కనీసం ఒంటి గంట రెండు వరకూ ఏదో కావ్యం పట్టుకుని కూర్చోవటం, తెల్లగా తెల్లారిపోయాక 7 – 8 మధ్యలో లేవడం!
ఒక్కోసారి మాష్టారు పొద్దున్నే మా ఇంటికి వచ్చేసేవారు. నేను నిద్రలో ఉంటే మా అమ్మ లేపేది. నేను బద్దకంగా లేచి దంత ధావనం పూర్తి చేసుకునే వరకు వేచి ఉండేవారు. నేను వచ్చాక ” మీకు నేను ‘ సౌఖ శాయనికుడిని ‘ అయ్యాను” అనేవారు నవ్వుతూ. “సౌఖ శాయనికుడు” మహారాజుల వద్ద ఉద్యోగి. మహారాజు నిద్ర లేచి శయనాగారం నుంచి బయటకు రాగానే ” మహారాజా! శుభోదయం. రాత్రి సుఖంగా నిద్ర పట్టిందా? స్వప్నాలు ఏవైనా వచ్చాయా?” అని తెలుసుకుని ఆయన నిద్రా విశేషాలు, స్వప్నాలు “స్వాప్నికు”లకు చెప్పేవారు. వారు ఆ స్వప్నాలను విశ్లేషించి వివరించేవారు. మహారాజుకు మొట్టమొదట ” శుభోదయం” చెప్పేవాడు “సౌఖ శాయనికుడు”! నాకు మా మాష్టరే ” సౌఖ శాయనికుడు!” మాస్టారితో అనుబంధం, ఆయనకు నాపై ఉన్న ఆప్యాయత అలాంటివి! అలాటి గురువును ఎలా మరచిపోగలను? ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? శిరసా గురు చరణాలకు నమస్కరించడం తప్ప?
మాష్టారు ఎప్పుడూ ఒక కావ్యం పట్టుకుని పాఠం చెప్పింది లేదు నాకు! సాయంత్రం ఆయన ఇంటికి వెడితే స్నానం చేసి సిద్ధంగా ఉండేవారు. ఇద్దరం బయటకు వచ్చి, మార్కండేయస్వామి గుడి దగ్గర గోదావరి రేవు మెట్ల మీద ఒక ప్రక్కగా కూర్చొనేవాళ్ళం. నేను అంతకుముందు రోజు రాత్రి చదివిన కావ్యంలో ఏదో ఒక పద్యం గురించి అడిగేవాడిని. ఆయన ఆ ఒక్క పద్యం ఏమిటి? ఆ కావ్యంలో అనేక పద్యాలు, వాటిలో విశేషాలు, ఇతర కవుల ప్రభావం ఆ కావ్యంపై ఎలా ఉంది, ఈ కావ్య ప్రభావం అనంతర కవులపై ఎలా ప్రసరించింది… ఇలా గంటల తరబడి మాట్లాడేవారు. సాయంత్రం ఐదున్నర, ఆరు గంటలకు అక్కడ కూర్చుంటే రాత్రి ఎనిమిదిన్నర, తొమ్మిదికి లేచేవాళ్ళం ఆయనను ఇంటి దగ్గర దిగబెట్టి నేను వెళ్ళిపోయేవాడిని. ఒక్కో రోజు ఆయన ఇంటి దగ్గర నుంచి మాట్లాడుకుంటూ నడక మొదలు పెడితే కోటి లింగాల రేవులో తేలేవాళ్ళం.
అలా ఒకసారి కోటిలింగాల రేవు దగ్గరకు వెళ్ళినప్పుడు “గుడిలోకి వస్తారా?” అని అడిగారు. అది శ్రీ కోటి లింగేశ్వర స్వామి గుడి. నేను శ్రీవైష్ణవుడను. “వస్తాను!” అన్నాను. ” ఔను లెండి. ఎందుకు రారు? నేను భ్రష్ఠ శైవుడను! మీరేమో భ్రష్ఠ వైష్ణవులు! నేను వేణుగోపాల శతకం వ్రాశాను, మీరు శివ స్తుతి వ్రాశారు!” అంటూ గుడిలోనికి నడిచారు. నేనూ ఆయన వెంట వెళ్ళాను.
తిరిగి వస్తూ ఉంటే ఆయన ” ఆచార్యులు గారూ! ఒక విచిత్రం చూశారా? శివ స్తుతులు వ్రాసిన వారిలో అధికులు వైష్ణవులు! విష్ణు స్తుతులు వ్రాసిన వారిలో అధికులు శైవులు! అదీ విచిత్రం!” అన్నారు. అనంతర కాలంలో ఆ మాట నిజం అనే “తెలివిడి” కలిగింది నాకు. అయినా అంతటి అధ్యయనం కల మా మాష్టారు చెప్పాక అది సత్యం కాకుండా ఎలా పోతుంది?
” ఆచార్యులుగారూ! తెలుగు కవులలో చాలా మంది కవులది ‘ ఫెమినైన్ వాయిస్. ‘మాస్క్యులైన్ వాయిస్ ‘ ఉన్నవాళ్లు కొద్దిమందే! ఒక నాచన సోముడు, ఒక కృష్ణ దేవరాయలు, ఒక తెనాలి రామలింగడు మాత్రమే కనిపిస్తారు నాకు” అన్నారు ఒకసారి. ఆ రోజు ఆదివారం. ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళాను ఇంటికి. అప్పుడు మొదలు పెట్టిన ఆ వివరణ మధ్యాహ్నం ఒంటి గంట దాకా గోదావరి వరదలా సాగుతూనే ఉంది. డజన్ల కొద్దీ పద్యాలు దొర్లిపోతున్నాయ్. చివరికి మాస్టారి అమ్మాయి వచ్చి ” భోజనం లేదా?” అని గద్ధించేసరికి టైమ్ చూశారు. ” అయ్యో! మిమ్మల్ని కూడా కూర్చో పెట్టేశాను ఇంతసేపూ. సాయంత్రం కలుద్దాం!” అంటూ లేచారు.
పద్యం అంటే చాలు ఆకలిదప్పులు ఉండవు, నిద్ర ఉండదు, అలసట ఉండదు, విరామం ఉండదు, ఎవరో ఒకరు హెచ్చరిస్తేనే కానీ మళ్ళీ ఈ లోకంలోకి వచ్చేవారు కారు మాష్టారు! ఆ ” రసోన్మత్తత ” అలాటిది.
” కావ్యాత్మను పట్టుకోవటం అంటే?” రేపు…
Leave a reply to prof. T. Patanjali Cancel reply