స్వీయ అన్వేషణ – 19
రాజకీయాలు ఎక్కడ లేవు? ఒక కుటుంబంలోనే ఎన్నెన్నో రాజకీయాలు నడుస్తూ ఉంటే ఇక ఇతర విషయాలలో ఉండటంలో ఆశ్చర్యం ఏముంటుంది? అలాగే సాహిత్యంలోనూ రాజకీయాలు ఉంటాయి, ఉన్నాయి. ఉద్యమాల రాజకీయాల మాట అలా ఉంచితే, ఒకే సాహిత్య సంప్రదాయంలో ఉండే వారి మధ్యా రాజకీయాలు ఉంటాయి, ఉన్నాయి. రాజమహేంద్రవరం దానికి ఏమీ మినహాయింపు కాదు.
రాజమహేంద్రవరంలో ఇద్దరు ఉన్నారు. ఒకరు “కళా ప్రపూర్ణ” శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు, మరొకరు శ్రీ మల్లంపల్లి శరభయ్య గారు. శాస్త్రి గారు ” ఆంధ్ర పురాణం” అనే మహాకావ్యం రచించి ఆంధ్రుల చరిత్రను నిబంధించారు. శరభయ్య గారు కావ్యాలు అంటూ రచించలేదు. ఒకసారి నేను ఆయనను అడిగాను ” మీరెందుకు వ్రాయరు?” అని. ఆయన చెప్పిన సమాధానం ఇదీ… ” ఏమి వ్రాయమంటారు? మాష్టారు ( విశ్వనాథ వారు) వ్రాయ వలసింది అంతా వ్రాసేశారు. నాకు ఏమి మిగిల్చారు కనుక వ్రాయటానికి?” అన్నారు.
రాజమహేంద్రవరంలో వీరిద్దరికీ అభిమానులు ఉన్నారు… విడి విడిగానూ, ఉమ్మడిగానూ కూడా.
శాస్త్రి గారు సౌమ్యులు. మాట మెత్తన. ఎవరైనా వారి రచన వినిపిస్తే, అందులో ఏదైనా దోషం ఉంటే, ఆయన సౌమ్యంగా ” అక్కడ ఇలా సవరిస్తే బాగుంటుందేమో ఆలోచించండి” అనేవారు. అందువల్ల ఆయన అత్యధికులకు ఆప్తుడు, “అభిగమ్యుడు” అయ్యారు.
శరభయ్య గారు అలా కాదు. రచనలో దోషం కనిపిస్తే చీల్చి చెండాడేసే వారు. ఆ వ్యక్తి మళ్ళీ జన్మలో పద్యం వ్రాయడానికి కానీ, వ్రాసినా ఆయనకు వినిపించటానికి కానీ సాహసించేవాడు కాదు. అందువల్ల ఆయన చాలా మందికి ” అప్రధృష్యుడు, అనభిగమ్యుడు” అయారు. మీకు గుర్తు ఉంటే నేను కూడా మొదటిసారి ఆయన ఇంటికి వెళ్ళడానికి భయపడ్డాను అని చెప్పాను కదా! అది అంతా ఆయన గురించి ఆ ఊరిలో జరిగిన ప్రచారం ఫలితం. ” సరుకు” లేని వాడికి ” సామర్థ్యం” ఉన్నవాడు శత్రువుగానే కనిపిస్తాడు కదా?
అలా రాజమహేంద్రవరం లో రెండు ” గ్రూపులు” ఏర్పడ్డాయి. ఒకటి శాస్త్రి గారి గ్రూప్, రెండోది మాష్టారి గ్రూప్. అంటే ఇవి వాళ్ళు ఇద్దరూ తయారు చేసిన గ్రూపులు కావు. వారి అనుయాయులు, అభిమానుల వల్ల ఏర్పడినవి మాత్రమే.
మాష్టారు సునిశిత బుద్ధి ఎవరినీ లెక్క చేయదు. అది ఔత్సాహికుడు అయినా, లబ్ధ ప్రతిష్ఠుడు అయినా.
ఒక గొప్ప ప్రతిష్ఠ కల కవి పోతన కవిత్వం గురించి వ్రాస్తూ ” గంటాన్ని పంచదారలో అద్ది వ్రాశాడేమో?” అని అన్నారు. మాష్టారు ఒకసారి పోతన గురించి మాట్లాడుతూ ” ఆ కవి అలా వ్రాశాడు. పోతన గారికి గంటం పంచదారలో అద్ది వ్రాయవలసి కర్మ ఏముందండీ? ” అన్నారు. ఆ కవి ఎవరో కవితా ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
అలాగే మరొక మాట… ఒక కవి ” ఊహకు రెక్కలు వచ్చినట్టు” అన్నారు ఒక పద్యంలో. అది మామూలుగా అనేదే ఊహా వేగాన్ని చెప్పడానికి. మాష్టారు నవ్వేసి ” ఊహకు రెక్కలు వస్తే ఊహ వేగం తగ్గిపోదూ?” అన్నారు. ఆయన దృష్టి వేరు!
శాస్త్రి గారిని చాలామంది “అపర నన్నయ” అనేవారు. మాష్టారు ఒప్పుకునేవారు కాదు. ఆయన వివేచన ” వేరే లెవెల్”. ఇది వివరించటానికి ఒక సంఘటన చెప్పాలి. ఒకసారి నేను మాష్టారిని అడిగాను… ” మాష్టారూ! మీలాంటి వాడిని తయారు చేయకపోతే ఎలా? తరువాతి తరం తయారు కావద్దూ” అని. దానికి ఆయన నవ్వేసి ” ఆచార్యులు గారూ! ఈ సృష్టిలో ఒకరిలాంటి వాడు మరొకరు ఉండరు. అది అసంభవం! ఏ సాహిత్య విద్యార్థి అయినా పూర్వ కవులను అధ్యయనం చేసి, వారి వైదుష్యాన్ని సొంతం చేసుకోవాలి. ఆ పునాదికి తన ప్రతిభను జోడించాలి. మరొక మెట్టు ఎక్కాలి. అంతేకానీ, ఒకడి లాటి వాడు మరొకడు ఉండడు”. అదీ ఆయన నిశ్చితాభిప్రాయం. కనుక “అపర నన్నయ” కాన్సెప్ట్ ను ఆయన అంగీకరించేవారు కారు. ఇది కూడా ఆ గ్రూపు రాజకీయాలకు ఒక కారణం.
నన్నయ నవశతి ఉత్సవాలు జరుగబోతున్నాయి. ఒక రోజు ఉదయమే మాష్టారు మా ఇంటికి వచ్చారు. నన్నయపై వ్రాసిన పద్యాలు వినిపించారు. తరువాత ఇంటికి బయలుదేరారు. నేను కూడ ఆయన వెంట నడిచాను. నాళం వారి సత్రం వరకూ వెళ్ళాక ఆయన ” మీరు ఉండండి. నేను ఈ పద్యాలు ‘ నారాయణ భట్టు ‘ కు వినిపించి వెడతాను” అన్నారు. ఆ ” నారాయణ భట్టు” ఎవరో అర్ధం అయింది కదా?
” జాతీయ సాహిత్య పరిషత్ ప్రవేశం” రేపు..
Leave a reply to prof. T. Patanjali Cancel reply