“ప్రథమ ప్రసంగం”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 21

ఆ రోజు సాయంత్రం సభ. ముందు రోజు రాత్రి “నన్నయ – ధార్మికత” అంశంపై వేంకటరామశాస్త్రి గారికీ,నాకూ దొరికిన దారి ” తైత్తిరీయ ఉపనిషత్”! దానిలో పదకొండవ అనువాకం. ఆ అనువాకంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొన్న శిష్యుడికి గురువు చేసే చివరి బోధన ఉంటుంది. ” ఏష ఆదేశః, ఏష ఉపదేశః, ఏవముపాసితవ్యమ్” అని ఉంటుంది. ” ఇది ఆదేశం, ఇది ఉపదేశం, దీనినే ఆచరించాలి” అని భావం. మనం అందరం చెప్పుకునే ”  మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ” ఇందులోనివే. అలాగే ” సత్యం వద, ధర్మం చర” కూడా ఇక్కడివే.

అప్పటికే “నన్నయ నవశతి ఉత్సవాలు” అనే ప్రకటన రాగానే వేంకట రామశాస్త్రి గారూ, నేనూ ఒక పని చేశాం. నన్నయ భారత భాగం ” శ్రీ వాణీ” తో ప్రారంభించి ” శారద రాత్రులు” వరకూ మధ్య మధ్య ఉన్న వచనాలతో సహా మొత్తం కంఠస్థం చేసేశాం! కనుక ఉపనిషత్తులో 11 వ అనువాకం చదువుతూ ఉంటే మాకు  ఆశ్చర్యకరమైన అంశం స్ఫురించింది. అది అంతకు ముందు ఎవరైనా చెప్పారో, లేదో మాకు తెలియదు. “వ్యాస మహా భారతము – నన్నయ పరిష్కారము” అని డాక్టర్ జొన్నలగడ్డ మృత్యుంజయ రావు గారు చేసిన పరిశోధనలో మాత్రం లేదు. సమస్య ఏమిటి అంటే పరిశోధకులు అందరినీ నన్నయ భట్టారకుడు ఒక మాయలో ముంచేశాడు. ఆ మాయ “త్రిపది”! 1. ప్రసన్న కథాకలితార్థ యుక్తి,

2. నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము,

3. అక్షర రమ్యత.

ఈ మూడు అంశాలలో పడి “ధర్మ తత్వజ్ఞులు ధర్మ శాస్త్రము” అని కూడా అన్నాడు నన్నయ వ్యాస భారతం గురించి అనే విషయాన్ని విస్మరించారు పరిశోధకులు. నన్నయ కూడా వ్యాసుని కోవలోని వాడే. అందుకే విశ్వనాథ వారు ” ఋషి వంటి నన్నయ రెండవ వాల్మీకి” అన్నాడు. “వాల్మీకి అన్నారు కానీ వ్యాసుడు అనలేదు కదా” అనకండి. నన్నయ కూడా ఋషి పరంపరకు చెందినవాడే అని అభిప్రాయం.

” ధర్మకామాకులులైన వారు ఎలా ప్రవర్తిస్తారో నువ్వు కూడా అలాగే ప్రవర్తించాలి, మరొక విధంగా కూడదు” అని ఆ అనువాకంలోని ఆదేశం. నన్నయ ” అవిరత జప హోమ తత్పరుడు, సంహితాభ్యాసుడు, నిత్య సత్య వచనుడు”. ఇవే కదా ఋషి లక్షణాలు.

ఆ రోజు సాయంత్రం సభ… నేను సిద్ధంగా ఉన్నాను. ఆ సభకు మా నాన్న సీతారామాచారి గారు, మా చిన్నాన్న అనంత తులసీ వేంకటాచార్యులు గారు, ఆయన స్నేహితుడు దేవరకొండ సూర్య ప్రకాశరావు గారు కూడా వచ్చారు. సభలో చివర కూర్చున్నారు ముగ్గురూ. అందులో మా నాన్నను చూడగానే నాకు గుర్తు వచ్చింది ఒకటే… పద్యాలు వ్రాస్తున్న క్రొత్తలో ” పద్యాలు వ్రాసుకుంటున్నాడా? ఏం చేస్తాట్ట? ఉపన్యాసాలు చెబుతాడా? శాలువాలు కప్పించుకుంటాడా? సన్మానాలు చేయించుకుంటాడా?” అని వెటకారంగా ఆయన అన్న మాటలు. అవే గుర్తుకు వచ్చాయి. సభ ప్రారంభం అయింది. నా ప్రసంగం మొదలు పెట్టాను. ఆ సభలో నాకు ఎవరూ కనపడలేదు… ముందు వరుసలో ఎదురుగా కూర్చున్న మా మాష్టారు శరభయ్య గారితో సహా…ఎవరూ కనపడటం లేదు… ఒక్క చివర కూర్చున్న మా నాన్న సీతారామాచారి గారు తప్ప. ఆయన అప్పట్లో మెజిస్ట్రేట్ గా పని చేస్తున్నారు.

ముందు రోజు వేంకట రామశాస్త్రి గారు, నేనూ నిర్ణయించుకున్న ఉపనిషత్ అనువాకంతో పాటుగా గతంలో ఒక సందర్భంలో అధ్యయనం చేసిన హిందూ మ్యారేజెస్ ఏక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఏక్ట్, మితాక్షరి కూడా ఆ ప్రసంగంలో చేరిపోయాయి. అవన్నీ కలసి “నన్నయ – ధార్మికత” సార్వకాలికం అనే నిర్థారణతో నా ప్రసంగం ముగించాను.

ముందు వరుసలో కూర్చున్న మా మాష్టారు శరభయ్య గారు లేచి వచ్చి భుజం తట్టి ” బాగుంది” అన్నారు. ఆయన చేతులతో శాలువా కప్పి సన్మానించారు. “చాలు” అనిపించింది. “ఒకప్పటి వెటకారపు ఎత్తిపొడుపులకు సమాధానం చెప్పాను, చాలు” అనిపించింది. “మా మాష్టారు భుజం తట్టి బాగుంది అన్నారు, చాలు” అనిపించింది.

మాష్టారు నాకు ఇచ్చిన మరొక “బహుమానం” కూడా ఉన్నది. మామూలుగా ఈ సభల “రిపోర్ట్” సమాచారం పత్రిక సంపాదకుడు, మిత్రుడు గంధం నాగ సుబ్రహ్మణ్యం స్వయంగా వ్రాసి ప్రచురించేవాడు. మాష్టారు అతడిని దగ్గరకు పిలిచి, ” ఈ రోజు ప్రసంగం గురించి మీరు వ్రాయకండి… నేనే వ్రాసి ఇస్తాను” అన్నారు! నా మొట్టమొదటి ప్రసంగం! దానికి “రిపోర్టర్” మా మాష్టారు శరభయ్య గారే! కొద్ది సేపటి ముందు ఆయన చేతులతో కప్పిన శాలువా కన్నా ఆయన చేతితో స్వయంగా వ్రాసిన రిపోర్ట్ కొన్ని కోట్ల రేట్ల సన్మానం కాదూ నాకు?!

“మాష్టారు చెప్పిన రహస్యం!”…


One response

  1. prof. T. Patanjali

    ” ఆయన చేతితో స్వయంగా వ్రాసిన రిపోర్ట్ కొన్ని కోట్ల రేట్ల సన్మానం కాదూ నాకు?!” మీ అదృష్టానికి అభినందనలు. నమః

    Like

Leave a reply to prof. T. Patanjali Cancel reply