” మాష్టారు చెప్పిన రహస్యం!’

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 22

నన్నయ నవశతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాలకు భరతుని నాట్య శాస్త్రాన్ని కూలంకషంగా తెలుగు వారికి అందించిన శ్రీ పోణంగి శ్రీరామ అప్పారావు గారు కూడా వచ్చారు. ఆయన మాస్టారి ఇంటిలోనే విడిది చేశారు. ఒకరోజు ఉదయం నేను వెళ్ళాను. వారి మధ్య విశ్వనాథ వారి ఒక గ్రంథం గురించి చర్చ జరుగుతోంది. ఆ గ్రంథం ” నన్నయ గారి ప్రసన్న కథాకలితార్థ యుక్తి”!

అప్పారావుగారు ” మాష్టారూ! అది సరే… ప్రసన్న కథాకలితార్థ యుక్తి అనేదానికి ‘ ప్రసన్న కథాకవితార్థ యుక్తి ‘ అనేది కూడా మరొకటి ఉంది కదా?” అన్నారు.

దానికి మాష్టారు ” అది నిజమే!” అన్నారు. అప్పారావు గారు ఆశ్చర్యంగా ” అదేమిటి? మరి విశ్వనాథ వారు ప్రసన్న కథా కలితార్థ యుక్తిని సమర్థించారు కదా?” అని ప్రశ్నించారు.

అప్పుడు మాష్టారు ” ఇప్పటి వరకూ నాలోనే దాచుకున్న రహస్యం ఒకటి ఉంది. అది మీ ప్రశ్నకు సమాధానం ఇస్తుంది” అన్నారు. “రహస్యం” అనగానే అందరికీ ఆసక్తియే కదా? అందులోనూ నన్నయ రచన గురించి  మాష్టారు లోలోపలే దాచుకున్న రహస్యం! అందరమూ కుతూహలంగా ఎదురు చూస్తున్నాం.

మాష్టారు మౌనంగా ఉండిపోయారు. అప్పారావుగారు ” చెప్పండి మాష్టారూ!” అని అడిగారు.

మాష్టారు కుర్చీలో ఇబ్బందిగా కదులుతూ ” ఇది చెప్పటం అంటే గురువు ( విశ్వనాథ వారు) గారికి ఇచ్చిన మాట తప్పటం అవుతుందేమో!” అన్నారు.

అప్పారావుగారు ” ఏమని మాట ఇచ్చారు?” అని అడిగారు.

” గురువుగారు జీవించి ఉన్నంత కాలం ఈ విషయం బయటకు చెప్పను అని మాట ఇచ్చాను” అన్నారు.

” ఇందులో మాట తప్పటం ఏముంది మాష్టారూ? గురువు గారు జీవించి ఉన్నంత కాలమూ చెప్పను అన్నారు. మాట నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన లేరు. ఇంకా మాట తప్పటం ఏముంటుంది?” అని ఓ లా పాయింట్ లాగారు. అక్కడ ఉన్న అందరమూ ఆ మాటను బలపరచాం.

” అయినా గురువు గారి ప్రసన్న కథా కలితార్థ యుక్తి వాదాన్ని ఖండించడం అవుతుంది కదా?” అన్నారు మాష్టారు.

అప్పారావు గారు ” మాష్టారూ!  గురువుగారి వాదాన్ని ఖండించడం ఎందుకు అవుతుంది? మీ పరిశీలన వివరించటం అవుతుంది కానీ. అయినా మీరు ఇలా చెప్పకుండా మీలోనే దాచుకుంటే నన్నయ గారికి సంబంధించిన ఒక కోణం మరుగున పడిపోతుంది కదా? గురువు గారికి ఖండన అనుకుంటున్నారు కానీ, నన్నయ గారికి అన్యాయం అని అనుకోవటం లేదు మీరు!” అంటూ కొంచెం ఆక్షేపణగానే అన్నారు. మాష్టారు కన్విన్స్ అయారు. చెప్పటం మొదలు పెట్టారు.

” ఆంధ్ర సారస్వత పరిషత్ / తెలుగు సాహిత్య అకాడమీ ( ఏదో నాకు సరిగా గుర్తు లేదు. బహుశః మొదటిదే అని గుర్తు) వాళ్ళు తెలుగు సాహిత్యంలో వచన వైభవాన్ని గురించి ఒక గ్రంథం వెలువరించాలని సంకల్పించారు. దానికి గురువుగారు సంపాదకులు. నేనూ, జమదగ్ని శర్మ, ( మరొకరి పేరు చెప్పారు కానీ నాకు ఇప్పుడు గుర్తు లేదు) ఉప సంపాదకులం. నాకు నన్నయ గారి భారత భాగం ఇచ్చారు…

“నన్నయ గారు పద్యాలలో మధ్య మధ్యలో వచనాలు వ్రాశారు. ఆ వచనాలు అన్నీ వరుసగా చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కలిగింది. పద్యాలను ప్రక్కన పెట్టేసి కేవలం వచనాలు వరుసగా చదువుకుంటూ పోతుంటే భారత కథ వచ్చేస్తోంది! విశేషంగా చెప్పవలసిన చోట పద్యం వ్రాసినా దాని భావం దానికి ముందో, వెనుకో వచనంలో కూడా వస్తోంది. అంటే నన్నయ గారి భారతం పద్యాలు తీసేసి కేవలం వచనాలు వరుసగా చదువుతూ ఉంటే ‘ కథ ‘, వచనాలు తీసేసి పద్యాలు వరుసగా చదివినా కూడా  ‘ కవిత ‘ రూపంలో భారతం వస్తోంది. అంటే ‘కథ + కవిత + అర్థ యుక్తి ‘ అనేది సిద్ధిస్తుంది. కనుక “ప్రసన్న కథా కవితార్థ యుక్తి” అనేది నిజం!

“ఈ మాటనే నేను గురువుగారి దగ్గర ప్రస్తావించాను. ఆయన జాగ్రత్తగా విన్నారు. “నిజమే! నీ వాదం సరైనదే! మరి నేను వ్రాసిన “ప్రసన్న కథాకలితార్థ యుక్తి” ఏమైపోవాలి?” అని అడిగారు. అంతే కాదు ‘ నేను బ్రతికి ఉన్నంత కాలం నువ్వు ఈ సంగతి ఎక్కడా మాట్లాడకూడదు. మాట ఇయ్యి” అన్నారు. నేను మరో ఆలోచన లేకుండా “సరే” అని గురువుగారికి మాట ఇచ్చాను” అంటూ ముగించారు మాష్టారు!

మాలో ఎవరికీ నోట మాట రాలేదు. నన్నయ గారి రచనకు సంబంధించి ఇంత గొప్ప పరిశీలన చేయటం, దానిని గురువుగారు ఒప్పుకోవటం, ఒప్పుకొన్నా తన విమర్శకు విఘాతం అని ఎక్కడా చెప్పవద్దు అని ఆదేశించటం, ఈ శిష్యుడు నిస్సంకోచంగా అంగీకరించటం! ఆ పరిశీలన అప్పుడే బయటపెట్టి ఉంటే? గురువు వాదాన్ని శిష్యుడు ఖండిచినట్టే కదా? విశ్వనాథ వారి వాదానికి ఎదురు నిలిచి, ఖండిస్తే వచ్చే కీర్తి ఎంతటిది? అది వదలి వేసుకున్న శిష్యుడి ” గురు భక్తి” కి శిరసా నమస్కరించడం తప్ప ఏమి చేయగలం?

అప్పారావు గారు ఊరుకోలేదు… ” మాష్టారూ! గురువుగారు తాను ఉన్నంత కాలం చెప్పవద్దు అన్నారు. అంతేగా? ఇపుడు చెప్పవచ్చు… కాదు కాదు… మీరు చెప్పి తీరాలి… ఈ రోజు సభలో చెబుతున్నారు… అంతే! ఇంకేమీ మాట్లాడకండి!” అని ఖండితంగా చెప్పేశారు. అక్కడ ఉన్న అందరమూ అదే అన్నాం.

ఆ రోజు సభలో మాష్టారు అద్భుతమైన ప్రసంగం చేశారు. ” నన్నయ గారి ప్రసన్న కథా కవితార్థ యుక్తి” అనే అంశంపై సోదాహరణంగా ఆయన చేసిన ఆనాటి ప్రసంగం “వరద గోదావరి ” లా సాగింది. ఎన్నో ఏళ్లుగా తనలోనే దాచుకున్న “రహస్యం” ఒక్కసారిగా బయట పెట్టడంలో ఎంత ఉత్సాహం, ఉద్వేగం ఉంటుందో ఆ రోజు అందరం చూసాం. రేపు..

“గాయత్రీ పరివారం లోనికి” రేపు..


One response

  1. prof. T. Patanjali

    “ఎంత గొప్పరహస్యం”!. ధన్యవాదాలు. నమః

    Like

Leave a comment