” ఎరక్కపోయి వెళ్లి…”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 24

“ఎరక్కపోయి వెళ్ళాను, ఇరుక్కుపోయాను” అనే పాటకు అర్థం మాకు అప్పుడు తెలిసింది.

“రాజమహేంద్రవరంలోని కోటిలింగాల పేట లో శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న గోదావరి రేవులో మూడు నాలుగు రోజుల నుంచీ కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవి మత మార్పిడి కార్యక్రమాలు. వాటిని ఆపాలి. ఆ పేటలో ఒకతనికి పలుకుబడి ఉంది. అతనితో మాట్లాడి, ఈ కార్యక్రమాలు ఆపాలి. మాతోపాటు మీరు కూడా వస్తే బాగుంటుంది” అని కొందరు ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు విశ్వ హిందూ పరిషత్ రాజమహేంద్రవరం శాఖ కార్యదర్శి చిలుకూరి వేంకట రామశాస్త్రి గారిని అడిగారు. నేను సహాయ కార్యదర్శిని.

ఈ “సహాయ కార్యదర్శి” వెనుక ఒక కథ ఉంది. తమిళనాడు లోని మీనాక్షిపురంలో పెద్ద ఎత్తున మత మార్పిడులు జరిగాయి. దేశం అంతా ఆ వార్త కార్చిచ్చులా వ్యాపించింది. నిరసనలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో విశ్వ హిందూ పరిషత్ జాతీయ నాయకులు కరెడ్ల సత్యనారాయణ గారు దేశం అంతా పర్యటిస్తూ రాజమండ్రి వచ్చారు. ఒక విస్తృత సమావేశం జరిగింది. ఆ సమావేశానికి శాస్త్రి గారు నన్ను కూడా రమ్మన్నారు. వెళ్ళాను. సమావేశానికి ముందు ఇంకా అందరూ రాకముందు శాస్త్రి గారు నన్ను సత్యనారాయణ గారికి పరిచయం చేశారు. నా పేరు విని ” రాజమండ్రిలో కూడా వల్లభాచార్య సంప్రదాయంలో ఉన్న తెలుగువాళ్ళు ఉన్నారా?” అని ఆయన ఆశ్చర్యంగా అడిగారు. దానికి నేను ” కాదండీ! మాది భగవద్రామానుజ సంప్రదాయం” అన్నాను. శాస్త్రిగారు కల్పించుకుని ” అది నిజమే కానీ శంకర సాహిత్యం గట్టిగా చదివాడు మనవాడు” అన్నారు. సత్యనారాయణ గారు ” పేరేమో వల్లభాచార్యులు, సంప్రదాయం శ్రీవైష్ణవం, చదివింది శంకర సాహిత్యం! బాగుంది. చాలా బాగుంది. అవును శాస్త్రీ! ఇక్కడ నువ్వు కార్యదర్శివి. సహాయ కార్యదర్శి ఎవరూ లేరు కదా? ఇవాల్టి నుంచీ ఈ వల్లభాచార్యులు గారు సహాయ కార్యదర్శి. సభలో ప్రకటిస్తాను” అన్నారు. ఆయనకు అడ్డు పడుతూ “విశ్వ హిందూ పరిషత్ గురించి, దాని సిద్ధాంతాలు, కార్యక్రమాల గురించి నాకేమీ తెలియదు” అన్నాను. ” నీకెందుకు? అవన్నీ నేను చూసుకుంటాను కదా ” అన్నారు సత్యనారాయణ గారు. సభలో ప్రకటన జరిగిపోయింది. నేను విశ్వ హిందూ పరిషత్ సహాయ కార్యదర్శిని అయిపోయాను. తరువాత వారం, పది రోజులకు నాలుగు పెద్ద పెద్ద కార్టూన్ల పుస్తకాలు వచ్చాయి. అన్నీ వి హెచ్ పి ప్రచురణలు.

అలా నేను సహాయ కార్యదర్శిని ఆయాను కనుక శాస్త్రిగారు ఈ కోటిలింగాల పేట వ్యవహారం, ఆర్ ఎస్ ఎస్ సభ్యులు అడిగిన మాట చెప్పారు. సరే అనుకున్నాం. ఒకరోజు రాత్రి 8 గంటలకు కోటిలింగాల పేటలో ఆ పెద్దమనిషిని కలవాలి అని నిర్ణయం అయింది. ఆ అడ్రస్ మాకు చెప్పి ” మీరు ఆయన ఇంటికి వెళ్ళండి. మేమూ వచ్చేస్తాము” అన్నారు ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు.

అనుకున్న సమయానికి శాస్త్రి గారు, నేనూ, కె .వి. రామారావు గారు ఆ పెద్ద మనిషి ఇంటికి వెళ్ళాం. పావుగంట, అరగంట,  ముప్పావు గంట గడచి పోతున్నాయి. ఆ కార్యకర్తల జాడ లేదు. పిచ్చాపాటీ తో కాలం వృధా అయిపోతోంది. ఇక లాభం లేదని ఆ పెద్ద మనిషితో అసలు విషయం ప్రస్తావించాం.

ఆ పెద్దమనిషి చెప్పిన విషయాలు మాలో మిగిలిన ఇద్దరికీ పరిచితమే కావచ్చు కానీ నాకు మాత్రం అప్పటికి చాలా ” షాకింగ్”!

” సరేనండీ! జరుగుతున్నాయి అవి. ఈ మధ్య కాస్త ఎక్కువ ఆయాయి కూడా. ఏం చేద్దాం అంటారూ?” అని అడిగాడు ఆయన.

” ఆపాలండీ! అలా మారకుండా మనవాళ్ళకి అర్థం అయ్యేట్టు చెప్పాలి” అన్నారు శాస్త్రిగారు.

” లాభం లేదండీ! మాటలతో అయే పనులు కావండీ!” అన్నాడు ఆయన.

” మరి?” అని అడిగారు రామారావు గారు.

” సార్! క్లియర్ గా చెబుతాను వినండి. వాళ్ళు ప్రతినెలా బియ్యం, సరుకులు, డబ్బు ఇస్తాం అంటున్నారు. వీళ్ళు వాళ్ళ వెంట పోతున్నారు. క్లియర్ గా చెబుతున్నాను సార్! వాళ్ళ కన్నా ఎక్కువ మీరేమి ఇస్తారో చెప్పండి. ట్రై చేద్దాం” అనేశాడు.

మేము ఏమీ చెప్పలేక పోయాం. “సరే సార్! ఆలోచించుకుని చెప్పండి. మళ్ళీ కలుద్దాం” అంటూ లేచాడు ఆయన. అప్పటికప్పుడు చేసేదీ, చెప్పేదీ ఏమీ లేక మేమూ లేచి వచ్చేశాం. ఆ తరువాత మూడు నాలుగు రోజులకు మమ్మల్ని అక్కడికి పంపిన ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తల్లో ఒకరు అనుకోకుండా శాస్త్రిగారికి తారస పడ్డారు. ” సారీ అండీ! ఆ రోజు రాలేకపోయాం. మా లీడర్ ఒకాయన వస్తున్నారని రైల్వే స్టేషన్ కు వెళ్లాం” అన్నారుట.

” ముందుగా చెబితే మరొక రోజు అందరం కలిసే వెళ్ళేవాళ్ళం కదా?” అంటూ శాస్త్రిగారు ఆ రోజు జరిగింది అంతా చెప్పారు. ” అవన్నీ మనం ఎక్కడ చేస్తామండీ?” అంటూ జారుకున్నాట్ట ఆ పెద్ద మనిషి. ఆ రోజు సాయంత్రం శాస్త్రి గారు వి హెచ్ పి సమావేశం లో జరిగినది అంతా చెప్పారు. మేము అందరమూ కలిసినా నెల నెలా బియ్యం, సరుకులు, డబ్బు వాళ్ళకి ఇవ్వలేం. చప్పబడిపోయాం అందరం.

ఆ టైమ్ లోనే కుర్తాళం పీఠాధిపతులు శ్రీ త్రివిక్రమ రామానంద భారతి రాజమండ్రి వచ్చారు. మేము వారి దగ్గరకు వెళ్లాం. విషయం చెప్పాము. ” రేపు మనం అందరం ఆ పేటకు వెదదాం” అన్నారు స్వామివారు. మేము వెళ్లి ఆ పేటలో పెద్దమనిషిని కలిసి చెప్పాం. ” ఈ సన్యాసులు వచ్చి ఏం లాభమండీ? సరేలెండి, ఆ పెద్దాయన వస్తాను అంటే వద్దు అనటం ఏం బాగుంటుంది?” అన్నాడు.

ఆయన వస్తాను అన్నారు సరే, సమావేశం ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఆ పేటలో ఒక శ్రీరామాలయం ఉంది. చిన్న గర్భాలయం, దానికి ముందు నాలుగు స్థంభాల మంటపం. అంతే. కానీ ఆ గర్భాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు లేవు. పీఠం  మాత్రమే ఉంది. ” ఇదేమిటి?” అని అడిగితే ” ఎప్పుడో తీసేశారు సార్! ఎవరు తీసేశారో తెలియదు. విగ్రహాలు మాత్రమే కాదు సార్! ముందు మంటపంలో నాలుగు ఫ్యాన్లు ఉండాలి. ఎవరో  పట్టుకుపోయి అమ్మేసుకున్నారు!” అన్నాడు ఆ పెద్ద మనిషి. “ఇదే కరెక్ట్ ప్లేస్ మీటింగ్ కి” అన్నాను నేను.

మరునాడు ఉదయం ఆ స్థలం అంతా శుభ్రం చేశారు. పీఠాధిపతులు వచ్చారు. ఒక గంట సేపు హైందవ ధర్మం గురించి ప్రసంగించి వెళ్ళిపోయారు. గుడిలో ప్రతిష్ఠించటానికి విగ్రహాలు ఇస్తామని కూడా అన్నారు. అంతే! ఆ విగ్రహాలూ రాలేదు. ఆ గుడి అలాగే మిగిలిపోయింది. అక్కడి కుర్రాళ్ళ పేకాటలకు ఆ మంటపం నిలయం అయిపోయింది ఎప్పటిలాగే.

ఈ పరిస్థితులలో నుంచి ఆవిర్భవించింది ” శ్రీ శంకర విద్యా పీఠం – శ్రీ భారత భారతీ విద్యాలయం”

ఆ కథ రేపు…


Leave a comment