” అలా మొదలైంది!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 25

రాజమండ్రి కోటిలింగాల పేట సంఘటన తరువాత శాస్త్రి గారికి, నాకూ ఏమి చేయాలో తోచలేదు. ఏదో చేయాలి? కానీ ఏమి చేయాలి? తెలియదు. ఎక్కడో ఒకచోట  మొదలు పెట్టాలి. అది ఏమిటి? ఎక్కడ మొదలు పెట్టాలి? తెలియదు, తోచదు. అప్పుడు ఒకసారి మేమిద్దరం అలా నడుచుకుంటూ వీవర్స్ కాలనీ వైపు వెడుతున్నాం. ఒకచోట రోడ్డుకు కుడి వైపున దాదాపు 200 – 250 గజాల ఖాళీ స్థలం కనిపించింది. ఆ ప్రాంతంలో కూడా అన్యమత ప్రచారం ఎక్కువే. ఇక్కడ మొదలు పెడితే? ఆ స్థలం మన చేతిలో ఉంటే? అక్కడ ఒక పాఠశాల మొదలు పెడితే? మా ఇద్దరికీ వచ్చిన ఆలోచన ఇదీ!

ఆ రోజు సాయంత్రమే అందరం కూర్చుని మాట్లాడుకున్నాం. అందరం  వెళ్లి ఆ స్థలం కూడా చూశాం. అందరూ మా ఆలోచనకు ఆమోదముద్ర వేశారు. అక్కడి వరకూ సరే! ఆ స్థలం మా చేతికి ఎలా వస్తుంది? అందరం కలసినా దానిని కొనే స్థోమత లేదు. కొనాలన్నా యజమాని అంత “ప్రైమ్ సైట్” అమ్ముతాడా? “కనుక్కుంటే పోలా?” అనుకున్నాం. వాకబు చేస్తే అది ఒక బ్రాహ్మణ కుటుంబం వారిదని, వారికి అమ్మే ఉద్దేశ్యం ఏ మాత్రమూ లేదని తెలిసింది.

వారి దగ్గరకు వెళ్లాం. పరిస్థితి వివరించి చెప్పాం. మా పాఠశాల ప్రతిపాదన చెప్పాం. మేము ఆ స్థలం  కొనలేమనీ చెప్పాం. ఆ కుటుంబం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా “సరే” అన్నారు. ” మంచి పని తలపెట్టారు. ఆ స్థలం మీకు ఇస్తాం. ఎన్నేళ్లు కావాలంటే అన్నేళ్ళు వాడుకోండి. ఒక్క రూపాయి అద్దె కూడా వద్దు. మీరు దానిని కొనే పరిస్థితి వచ్చినప్పుడు చెప్పండి. మీకే అమ్ముతాం” అన్నారు. ఆ కుటుంబానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియలేదు.

స్థలం సమస్య తీరింది. మరి పాఠశాల నిర్మాణం? దానికి పెట్టుబడి? ఆషామాషీ వ్యవహారం కాదుకదా? పెట్టుబడి ఎలా సంపాదించాలి?

రాజమండ్రిలో ఎన్ జి ఓ హోమ్ ఎదురుగా ఒక హాస్పిటల్ ఉండేది ( పేరు ఇప్పుడు గుర్తు లేదు). ఆ హాస్పిటల్ యజమాని ఒక డాక్టర్. ఆయన కుమార్తె భరత నాట్యం లో శిక్షణ పొందిన నర్తకి. అది గుర్తుకు వచ్చాక మా ప్రణాళిక కార్యరూపం పొందింది. ఆ డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళి విషయం అంతా వివరించాం. పాఠశాల నిర్మాణానికి అవసరం అయిన డబ్బు సమకూర్చుకోవటానికి వారి కుమార్తె ఉచిత నృత్య ప్రదర్శన చేయాలని కోరాం. అదృష్టవశాత్తూ ఆయనా  అంగీకరించారు. రెండవ పని పూర్తి అయింది. నృత్య ప్రదర్శన ఆనం కళా కేంద్రం లో. టికెట్స్ ముద్రించాం. ముద్రించిన టికెట్స్ అన్నీ అమ్మగలిగాం. మేము అనుకున్న రూపంలో పాఠశాల నిర్మాణానికి మాత్రమే కాక కావలసిన కుర్చీలు, టేబుల్స్, పిల్లలు కూర్చోవడానికి బల్లలకు కావలసినంత సొమ్ము సమకూడింది.

మా పాఠశాల రూపం ఒక సిమెంట్ కాంక్రీట్ భవనం కాదు… పర్ణశాల. అంతా కలపతోనే నిర్మాణం. నాలుగు వైపులా గోడలు ఉండవు. వెదురు తడికెలు. స్థలం చుట్టూ వెదురు, తడికెలతో ప్రహారీ .  పాఠశాల ముందు చాలా ఖాళీ స్థలం ఉంది. దానిలో ఒక హోమ గుండం ఏర్పాటు చేసుకున్నాం. అంతా దాదాపు నెల రోజులలో తయారై పోయింది. కుర్చీలు, బల్లలు అన్నీ వచ్చేశాయి.

పాఠశాలకు పేరు కావాలి… ఆ పాఠశాలను నిర్వహించటానికి ఒక సంస్థ కావాలి… దానికీ ఒక పేరు కావాలి. అందరం కూర్చున్నాం. కొన్ని గంటల చర్చల తరువాత నిర్ణయం అయింది.

పాఠశాలను నిర్వహించే సంస్థ పేరు ” శ్రీ శంకర విద్యా పీఠం”!

అది నిర్వహించే పాఠశాల పేరు ” శ్రీ భారత భారతీ విద్యాలయం”!

ఇక పాఠాలు బోధించే ఉపాద్యాయులు కావాలి. మా చిన్నాన్న గారి స్నేహితుడు దేవరకొండ సూర్యప్రకాశ

రావు గారి ఇద్దరు చెల్లెళ్ళు ఉపాధ్యాయ శిక్షణ పొందినవారు. మరొకరు కావాలి. మా చెల్లెలు రజనీ కాంత ముందుకు వచ్చింది. అలా ఉపాధ్యాయుల సమస్య తీరింది. మరి ప్రతి రోజూ పాఠశాల నిర్వహణ ఎవరు చూస్తారు? మాలో అందరూ … నేను తప్ప… ఉద్యోగులే. పూర్తి కాలం వారు చూడలేరు. ఖాళీగా ఉన్న నాకే ఆ బాధ్యత అప్పజెప్పారు. విద్యాసంవత్సరం ప్రారంభ సమయానికి అంతా సిద్ధమైంది. కరపత్రాలు ప్రచురించి ఇంటింటికీ వెళ్లి పంచాం. పాఠశాల ఒకటవ తరగతిలో 40 మంది విద్యార్థులతో ప్రారంభం అయింది!

” చెదిరిన కల!” రేపు


Leave a comment