స్వీయ అన్వేషణ – 26
“శ్రీ శంకర విద్యా పీఠం” నిర్వహణలో ” శ్రీ భారత భారతీ విద్యాలయం ప్రారంభం అయింది. అది మా మాష్టారు శరభయ్య గారి ఆశీస్సులతో, ప్రముఖ రచయిత, సాహితీ విమర్శకులు శ్రీ ఆర్. ఎస్. సుదర్శనం గారి చేతుల మీదుగా ప్రారంభం అయింది. శ్రీ సుదర్శనం గారు అప్పుడు రాజమహేంద్రవరం లో ఉన్నత విద్యా శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
పాఠశాల ప్రార్థనలో ప్రధానమైన ఒక శ్లోకాన్ని ఉంచాం… ” ఓం సర్వ చైతన్యరూపాం తామాద్యామ్ విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్”! పాఠశాల విద్యా ప్రణాళిక అంతా రాష్ట్ర ప్రభుత్వ పాఠ్య పుస్తకాలే. వారం అంతా చివరి పీరియడ్ ఏ సబ్జెక్ట్ బోధన ఉండదు. నీతి కథలు, పురాణ కథలు ఉండేవి. ఈ కథలు చెప్పటంలో రజనీ టీచర్ చాలా ప్రభావం చూపేవారు పిల్లల మీద.
ఈ పాఠశాలలో చేరిన విద్యార్థులు హైందవులలోని అన్ని కులాల వారు మాత్రమే కాక క్రైస్తవ బాల బాలికలు కూడా ఉండేవారు. వారిలో ఇప్పటికీ గుర్తు ఉండి పోయే విద్యార్థి జయరాజ్… తమిళ క్రైస్తవ బాలుడు. ఒకసారి ఆలస్యంగా వచ్చాడు. ” ఎందుకు ఆలస్యం అయింది?” అని అడిగితే వాడు చెప్పిన జవాబు జన్మలో మర్చిపోలేం. ” తల నరుక్కుని వచ్చా టీచర్!” ఇదీ జవాబు. వాడు ఆ రోజు ” క్రాప్” చేయించుకుని రావటంలో ఆలస్యం. ” హెయిర్ కటింగ్” కి వాడు చేసిన అనువాదం ” తల నరుక్కుని రావటం!” ఎలా మరచిపోగలం?
పాఠశాల ప్రారంభం అయిన కొద్ది కాలానికి ఒక ఆదివారం ఆవరణలో ” శ్రీ గాయత్రీ హోమం” చేయాలని సంకల్పించాం. పాఠశాల ముందు ఒక బ్యానర్ కట్టాం. “ఫలానా రోజున శ్రీ గాయత్రీ హోమం చేస్తున్నాం. అందరూ దానిలో పాల్గొనవచ్చు” అని. చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ” మేము బ్రాహ్మణులము కాదు. మరి మేముకూడా పాల్గొన వచ్చునా?” ఇదీ ప్రశ్న. మేము అందరికీ చెప్పిన సమాధానం ఒక్కటే ” కుల, మత, స్త్రీ, పురుష భేదాలు ఏవీ లేవు. ఎవరైనా పాల్గొనవచ్చు”.
ఆదివారం… ఉదయం 8 గంటలు… మామూలుగా శ్రీ గాయత్రీ హోమం చేసే మేము ఉన్నాం. మాకు ఆశ్చర్యం కలిగేటట్లు 40 మంది విద్యార్థుల తల్లిదండ్రులలో సగం మంది వచ్చారు… సంప్రదాయ దుస్తులలో. మరి కొందరు పాఠశాల వెదురు ప్రహారీ బయటే నిలబడి చూస్తున్నారు. ఆ రోజు హోమం సంతృప్తికరంగా పూర్తి అయింది. పాల్గొన్నవారు అందరూ సంతోషించారు వారి చేత కూడా చేయించినందుకు. అప్పుడు వారు అడిగిన ప్రశ్న ” మేము వచ్చాం. సరే! మావాళ్ళు కూడా రావచ్చా? లేక ఇది పేరెంట్స్ కి మాత్రమేనా?” మాకు ఆనందం కలిగింది. ఇదే మేము కోరుకున్నది. దీనికి ఈ పాఠశాల ఒక సాధనం! ” ఎవరైనా సరే, ఎంతమంది అయినా సరే, పాల్గొన వచ్చు” అని చెప్పాం. ఈ మాట హోమ కుండం దగ్గర నిలబడి బయట నిలబడి చూస్తున్న వారికి కూడా వినబడేటట్టు ప్రకటించాం.
ఆ తరువాత విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కుల, మత, స్త్రీ, పురుష వివక్ష లేకుండా హోమాలలో పాల్గొన్నారు. మత భేదం లేకుండా అందరూ ప్రసాదం స్వీకరించారు!
పాఠశాల ప్రారంభించి ఏడాది అయింది. ప్రథమ వార్షికోత్సవం! అధ్యక్షులు ఆర్. ఎస్. సుదర్శనం గారు, ముఖ్య అతిథి మా మాష్టారు శరభయ్య గారు. ఆ రోజు వారిద్దరూ చేసిన ప్రసంగాల వల్ల మాకు మరింత ఉత్సాహాన్ని కలగటం మాత్రమే కాక, మరిన్ని బాధ్యతలకు మార్గదర్శనం లభించింది. ఆనాడు వారిద్దరూ చేసిన ప్రసంగాలు రికార్డు చేసిన టేప్ ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది.
శ్రీ శంకర జయంతి వచ్చింది. నిర్వహించాలి. మంగళ వాద్యాలతో పుష్ప మాలాలంకృతమైన శ్రీ ఆది శంకరుల చిత్రపటానికి వైభవంగా ఊరేగింపు జరిపాం ఆ కాలనీ, పరిసర ప్రాంతాలలో. విద్యార్థులు, తల్లిదండ్రులూ అందరూ పాల్గొన్నారు. ఆ ప్రాంతాలలో మత ప్రచారాలు సాగిస్తున్న సంస్థల ముందు నుంచి సాగింది ఆది శంకరుల ఊరేగింపు!
పాఠశాలలో బోధనా విధానం, శ్రీ గాయత్రీ హోమాలు, ఉత్సవాలు – పండుగలలో పిల్లలు అందరికీ స్వీట్స్ పంపిణీ చాలా మందిని ఆకర్షించాయి. రెండవ సంవత్సరం రెండవ తరగతి మొదలైంది. ఒకటవ తరగతిలో కొత్త విద్యార్థులు చేరారు. మేము అనుకున్న విధానంలో నడుస్తోంది ” శ్రీ భారత భారతీ విద్యాలయం”.
సరిగ్గా ఆ సమయంలోనే చిలుకూరి వేంకట రామశాస్త్రి గారికి కెనరా బ్యాంక్ హైదారాబాద్ శాఖకి బదిలీ అయిపోయింది. ఒక పెద్ద అండ చేజారిపోయినట్టు అయింది. ఏ పని అయినా, ఏ ఆలోచన అయినా మేము ఇద్దరమే పంచుకునే వాళ్ళం, లోతుగా చర్చించుకుని ఒక ప్రణాళిక తయారు చేసుకునే వాళ్ళం… ” ఫూల్ ప్రూఫ్” అంటారే అలాగ తయారయ్యేది ప్రణాళిక. దానిని మిగిలిన వారి ముందు పెడితే ” నో” అనే ప్రసక్తే ఉండేది కాదు. అలాటి వ్యక్తి దూరం వెడుతున్నారు. వ్యక్తిగతంగా కూడా చాలా సన్నిహితుడు. చేయగలిగినది ఏముంది? ఆయన హైదారాబాద్ కి వెళ్ళిన కొన్ని నెలలకు నేనూ రాజమహేంద్రవరాన్ని, ఆ పాఠశాలను వదలి అదే హైదారాబాద్ కు వెళ్ళిపోవలసి వచ్చింది! మేము ఇద్దరమూ అలా రాజమండ్రి వదలి వెళ్ళటం వల్ల పాఠశాల “కల చెదిరి పోతుంది” అని మేమిద్దరమూ ఊహించలేదు.
” రాజమండ్రికి వీడ్కోలు!” రేపు…
Leave a comment