స్వీయ అన్వేషణ – 31
ఆంధ్ర పత్రిక లో ఒక సబ్ ఎడిటర్ ప్రసాద్ గారు. నవలా సాహిత్యం మీద మంచి పట్టు ఉన్న వ్యక్తి. మరొక పార్శ్వం ఆయన ” రుచి ప్రధాన రసన!”. హైదారాబాద్ లో ఏ హోటల్ లో భోజనం బావుంటుంది? ఎక్కడ మంచి స్వీట్స్ దొరుకుతాయి? నమ్కిన్స్ ఎక్కడ నోరూరిస్తాయి? ఇవన్నీ ఆయన నాలుక కొస మీదే ఉంటాయి. ఆయనే నాకు చిక్కడపల్లి లో బందరు మిఠాయి షాప్ పరిచయం చేశారు. అబిడ్స్ నుంచి నాంపల్లి వెళ్ళే రోడ్డులో చివర మేడ మీద ఉన్న ఒక మెస్ లో రసం బావుంటుంది అని అక్కడకు తీసుకువెళ్ళారు.
ఆయనే అన్నారు ” దేవుడు చాలా అన్యాయం చేశాడు!” అని.
” ఏం చేశాడు?” అని అడిగాను.
” సీతాఫలం ఉంది కదా? తియ్యగా, బావుంటుంది. ఎన్నైనా తినైవచ్చు. కానీ మధ్య మధ్యలో నోటికి గింజ తగలగానే చప్పగా అయిపోతుంది నోరంతా!”
“అయితే… ఇందులో దేవుడు చేసిన అన్యాయం ఏముంది?” అని అడిగాను.
” అది కాదండీ! సీతాఫలాన్ని ఒక్క గింజ కూడా లేకుండా గుమ్మడి కాయంత చేసి ఇవ్వచ్చుగా? పిసినారి కాకపోతే … ఇంత పండు, దానిలో అన్ని గింజలు పెట్టడం ఏమిటి అన్యాయం కాకపోతే?” అని దబాయించారు!
దానికి కొనసాగింపుగా ” అంతటితో ఆగాడటండీ ఆ దేవుడు? చూడండి ఎంత పిసినారి కాకపోతే మామిడి పండులో అంత టెంక పెట్టాలా? ఈ సీతాఫలం గింజ ఏదో ఆ బంగినిపల్లి, రసాలలో పెట్టేసుండచ్చుగా? అంతేనండీ! నంబర్ వన్ పిసినారి ఈ దేవుడు!” అంటూ బాధ పడిపోయేవారు!
ఆయన ఆలోచనకు ఏమనాలో తోచలేదు కానీ, ” నిజమే కదా? దేవుడు అంత పిసినారి అయిపోయాడేమిటి?” అనుకోకుండా ఉండగలమా చెప్పండి. ఇప్పటి నుంచీ ఎప్పుడు సీతాఫలాన్ని , మామిడి పండును చూసినా, తింటున్నా, గింజ, టెంక తగలగానే మీకు ప్రసాద్ గారు గుర్తు రాకుండా ఉంటారా?
ప్రసాద్ గారికీ, నాకూ మధ్య చలం నవలల గురించి వాదం ఉండేది. చలంలో ” శశిరేఖ నుంచి మైదానం మీదుగా అరుణ వరకు ఒక పరిణామం ఉంద”ని నా వాదన. ఎమెస్కో ప్రచురించిన చలం నవలలు అన్నీ నేను రాజమండ్రిలో ఉన్నప్పుడే చదివాను. చలం తన “అరుణ” నవలలో తప్ప మరే నవలలోనూ చివర తేదీ వేయలేదు. “అరుణ” నవలలో చివరి వాక్యాలు ( దాదాపుగా) ” నాలో శారీరక సౌఖ్యాలకు స్వర్గ ద్వారాలు తెరచిన అరుణ నాలోని ఆధ్యాత్మిక సందేహాలకు ఏ ఆశ్రమ ద్వారాలో తెరువక పోదు”. మొదటి నవల “శశిరేఖ”లో నాయిక ముగ్గురికి ఆకర్షితురాలు అవుతుంది. ఒకరిలో శారీరక సౌందర్యం, ఇంకొకరిలో మానసిక సౌందర్యం, మరొకరిలో ఆత్మ సౌందర్యం! ఎవరితో బ్రతకాలి? ఇదీ శశిరేఖ డైలమా! కాదు… కాదు.. నిజానికి ఇది చలం డైలమా! ఆ డైలమా “మైదానం” నవలలో శారీరక సౌఖ్యం వైపు గట్టిగా నిలిచింది. ఆ తరువాత కాలంలో ” ఆధ్యాత్మిక సందేహాలు” ఏర్పడ్డాయా? ఆశ్రమాల వైపు దృష్టి మళ్ళిందా? లేకపోతే “అరుణ”లో ఆ చివరి వాక్యాలకు అర్థం ఏమిటి? ఇది చలంలో ఉన్న ఒక సంఘర్షణ, దానికి సంబంధించిన ” క్రమ పరిణామం” అనేది నా వాదన.
“అబ్బే! అదేం లేదు. చలం సీరియస్ రైటర్ కాదు. ఎప్పటికి ఏది తోస్తే అది రాసుకు పోయాడు. అంతే!” అనేవారు ప్రసాద్ గారు.
అయితే తరువాత బాలాంత్రపు రజనీకాంత రావు గారు చలంతో చేసిన సుదీర్ఘ ఇంటర్వ్యూ లో నా వాదం కరెక్ట్ అని తేలిపోయింది. చలం “నా పూర్వ రచనలు చూసి ఇప్పుడు నేను సిగ్గు పడుతున్నాను” అంటాడు ఆ ఇంటర్వ్యూలో. ఇప్పటికీ చలం ప్రేమికులు “మైదానం”, ” మ్యూజింగ్స్” దగ్గరే ఆగిపోతారు. చలం రవీంద్రుని ” గీతాంజలి” అనువాదంలో వ్రాసుకున్న ముందు మాటలో … ” నాలోని తర్కోష్ణతకు జంకి గత ముప్ఫై ఏళ్లుగా నాలోనే దాక్కున్న భక్తి భావనా విహంగాలు చిరంజీవి గారి ప్రోత్సహంతో రెక్కలు విప్పుకున్నాయి” అంటాడు. ఇది కూడా నా మాటకు ప్రోద్బలకం. ఇన్ని చెప్పినా ప్రసాద్ గారు ఒప్పుకునే వారు కారు. ” చెప్పానుగా? ఎప్పుడు ఏది అనిపిస్తే అది రాసేస్తాడు. అంతే!” అనేవారు.
నేను చలం గురించి చేసిన వాదానికి చలమే ప్రమాణం. బాలాంత్రపు రజనీకాంత రావు గారు చలంతో చేసిన ఇంటర్వ్యూ లింక్ ఇస్తున్నాను. వినండి…
“అత్తరు పరిమళం అఖ్తర్ ఖాన్!” రేపు…
Leave a reply to Phaniharam Vallabhacharya Cancel reply