స్వీయ అన్వేషణ – 56
దినపత్రికలకు రోజూ ఏదో ఒక మసాలా దొరుకుతూనే ఉంటుంది. దానికి పులిమే రంగులూ, ఆ మసాలాలోకి దట్టించి రకరకాల రుచులు డైలీని జనాల్లోకి తీసుకుపోతాయి.
వీక్లీ అలా కాదు. ప్రారంభం అయిన నాటి నుంచీ ఏదో ఒక పాటర్న్ ఉంటుంది. ఆ పాటర్న్ కి భంగం రాకుండా క్రొత్తదనం తీసుకురావాలి. ఫిక్షన్, నాన్ ఫిక్షన్ సమపాళ్లలో నడవాలి. మళ్ళీ ఆ రెండూ సగం సగం అయితే అదొక ప్రమాదం. అంతేకాదు… ఎప్పటికప్పుడు పాఠకుల నాడి తెలుసుకుంటూ మార్పులూ చేర్పులతో నడిపించాలి. అలా అని… పాఠకుల అభిరుచి అంటూ… ఏది పడితే అది వేయటానికీీ లేదు. (అలా పాఠకుల ఇంద్రియోద్వేగాలను పెంచి, పోషించి పబ్బం గడుపుకొన్న వారూ లేకపోలేదు.) “పాఠకుడు మన పత్రిక చదివాక ఒక ‘ ఇంచ్’ ఎదగాలి” అనేవారు వాకాటి వారు. అయితే… ఎంత గొప్ప ఆశయాలు ఉన్నా… సంపాదకుడు అనే జీవి మార్కెటింగ్ విభాగానికి “బందీ”యే!
ఆ క్రమంలో…
ఆంధ్రప్రభ వీక్లీకి ఒక ” సర్వే” నిర్వహించాం. కొన్ని ప్రశ్నలు రూపొందించి దానిలో ప్రచురించాం. అలాగే మరికొన్ని మార్కెటింగ్ విభాగానికి ఇచ్చి జనాలకు చేరేటట్టు చేశాం. ఈ ప్రశ్నల రూపకల్పనలో వాకాటి వారు, నేనూ ఇద్దరమే ఉన్నాం.
“మహిళలకు క్విజ్”
సాధారణంగా వీక్లీ పాఠకులలో మహిళలే ఎక్కువ. వారి కోసం ఒక క్విజ్ తయారు చేశారు వాకాటి వారు. బహుమతి పట్టు చీర! మామూలుగా అయితే ఇలాటి క్విజ్ లలో సినిమా అంశాల వంటివి ప్రధానంగా ఉంటాయి. అదే పని చేస్తే… ఆయన వాకాటి వారు ఎందుకు అవుతారు?
ఆయన తయారు చేసిన ప్రశ్నలు పాఠకురాండ్ర పరిజ్ఞానాన్ని పెంచేవి! ” మదర్ థెరీసా అసలు పేరేమిటి?”, ” నిత్యాన్నదానం చేసిన ఆంధ్ర మహిళ ఎవరు?”, ” ఇందిరాగాంధీ పూర్తి పేరు ఏమిటి?”… ఇలాటివి ఎన్నో ప్రశ్నలు! వీటి ద్వారా ఏం జరిగింది? కథలూ కాకరకాయల్లో మునిగి పోయిన పాఠకురాండ్రను వివిధ అంశాలు తెలుసుకునేటట్లు చేయటం! తద్వారా ఆయన అన్నట్టు ” ఒక ఇంచ్” పెంచటం!
” ఎవరూ పట్టించుకోనిది!”
అప్పటికి పెద్దగా ఏ పత్రికా పట్టించుకోని అంశం… పర్యావరణం. ఆ అంశంలో అవగాహన పెంచాలి. అలా అని ఊకదంపుడు వ్యాసాలు గుప్పించ కూడదు. అందుకే వచ్చింది ” పర్యావరణం బహుపరాక్!”. చిన్న బిట్! అంతే. ఆ బాధ్యత నాకు ఒప్పచెప్పి నన్నూ ఒక “ఇంచ్” పెంచారు!
“అదే ఫుల్ స్టాప్ కాదు!”
మనిషి దేనికి అత్యధికంగా భయపడతాడు? చావుకి! అంతే కదా? నిజానికి మృత్యువుకు భయపడవలసిన అవసరం లేదు. అది ఫుల్ స్టాప్ కాదు, మళ్ళీ జన్మ ఉంటుంది! ఈ జన్మ అనుభవాలు, స్మృతులు అన్నీ మరు జన్మకు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి! నిజమా? నిజమే అని పాశ్చాత్య దేశాలలో జరిగిన పరిశోధనలు తెలుపుతున్నాయి. ” పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థియరీ!”. ఒక మనిషి ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు వెనుకటి జన్మలలో మూలాలు ఉన్నాయి అనీ, వాటిని సరిదిద్దితే ఈ జన్మలో ఆ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆ మార్గం నిరూపించింది. వాకాటి వారు ఆ అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేశారు. ఆ అధ్యయనంలో నుంచి పుట్టిన శీర్షిక ” మరణం ఒక కామా!”. ఈ శీర్షిక ఎంతమందిని ప్రభావితం చేసిందో నేను ప్రత్యక్షంగా చూశాను. సన్నిహిత బంధువులను, తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఎందరో స్వయంగా ఆయనను కలిసీ, ఉత్తరాల ద్వారా తాము ఆ శీర్షిక వల్ల దుఃఖం నుంచి బయట పడ్డామని చెప్పటం నేను ఎరుగుదును.
” ధర్మం – సంస్కృతి – సంప్రదాయాల విభజన రేఖ”
ఆంధ్ర ప్రభ వీక్లీలో ఒక శీర్షిక ” ధర్మ పీఠం”. చాలా ప్రాచుర్యం పొందిన శీర్షిక. ఒకసారి ఈ శీర్షిక గురించి వాకాటి వారికీ, నాకూ ఒక చర్చ జరిగింది. ఈ శీర్షికకు ప్రశ్నలు వచ్చేవి. వాటికి సమాధానాలు అందించటం దీనిలోని అంశం. అయితే ఆ ప్రశ్నలు అన్నీ “ధర్మా “నికి సంబంధించినవేనా? ” తులసి మొక్క ఏ వైపు ఉంచాలి?”, ” గడపకు పసుపు ఏ రోజు రాయాలి?” ఇలాటి ప్రశ్నలకూ, “ధర్మా”నికీ ఏమిటి సంబంధం? ఇదీ మా చర్చ. ” సంబంధం లేదు” అని మా తీర్మానం. మరి ఇది ” ధర్మ పీఠం” ఎలా అవుతుంది? అలా అని ఈ ప్రశ్నలను వదలివేయటం కుదరదు. ఎందుకంటే చాలా మందికి వచ్చే సాధారణ సందేహాలు ఇవి. కనుక వాటిని కొనసాగించాలి. ఏమి చేయాలి? ధర్మ పీఠం లో కేవలం ధర్మ సంబంధమైన ప్రశ్నలకే జవాబులు అందిస్తూ, ఇలాటి సందేహాలకు మరొక శీర్షిక మొదలు పెట్టాలి. అలా వచ్చినదే ” సంస్కృతి – సంప్రదాయం” శీర్షిక. ధర్మ – సంస్కృతి – సంప్రదాయాల మధ్య విభజన రేఖను గుర్తించి, దానికి పరిష్కారం చెప్పిన సంపాదకుడు వాకాటి వారు!
” మెత్తగా వాతలు పెట్టాలి!”
ప్రజా సమస్యలు ఉంటాయి. వాటి గురించి కూడా చెప్పాలి. ఉన్నదున్నట్లు వ్రాస్తే అది డైలీలో వచ్చే రిపోర్ట్ అవుతుంది. అలా ఉండకూడదు. కొంత హాస్యం, కొంత వ్యంగ్యం జోడించి తయారు చేయాలి. గుచ్చుకోవాలి, చురుక్కుమనాలి, చదివే వారికి గిలిగిలిగింతలు పెడుతూ, సమస్యను ఫోకస్ చేయాలి. అలా పుట్టినదే ” భాగ్యనగర్ బాతాఖానీ”. అదీ నా చేతికే ఇచ్చారు.
“మాటలతో కార్టూన్!”
రకరకాల కార్టూన్లు చూశాం. ఒక బొమ్మ, ఒక జోక్. బొమ్మ లేకుండా కార్టూన్ ప్రయోజనాన్ని నెరవేర్చాలి! ఒక వ్యంగ్య పద చిత్రం కావాలి. అది కూడా సగం పేజీ మాత్రమే ఉండాలి. అది కూడా రాజకీయ నాయకుల గురించి ఉండాలి. ఇదీ వాకాటి వారి ప్రణాళిక. మళ్ళీ అదీ నాకే ఒప్పగించారు. అదే ” జయహే!”.
ఒకసారి అది అరపేజీ దాటి పోయి పూర్తి పేజీకి వచ్చింది. అద్వానీ రథయాత్ర గురించి. అది చూసి బాపూ – రమణలు ఒక హెచ్చరిక చేశారు నాకు వాకాటి వారి ద్వారా! ” అలా పెంచోద్దు. ఇప్పటిదాకా అరపేజీలో క్రిస్ప్ గా, బాగా వస్తోంది. పెంచితే పలచబడి పోతుంది”. ఆ హెచ్చరిక విన్నాక మళ్ళీ చదివితే ” నిజమే కదా?” అనిపించింది. అయినా బాపూ – రమణలు చెప్పాక దానికి తిరుగేముంటుంది కనుక? అప్పటి నుంచీ జాగ్రత్త పడ్డాను.
” నా వల్ల కాలేదు!”
ఆంధ్ర ప్రభ వీక్లీలో శ్రీ లక్ష్మణ యతీంద్రుల ” తిరుప్పావై” అనువాదం ప్రచురించాలని వాకాటి వారు నిర్ణయించారు. రెండు పేజీలు. ఒక పేజీ అంతా బాపూ గారి బొమ్మ. ఒక పేజీలో శీర్షిక పోను మిగిలిన దానిలో శ్రీ లక్ష్మణ యతీంద్రుల తిరుప్పావై తెలుగు గీతం, దాని అర్థం. అంతే. యతీంద్రులు స్క్రిప్ట్ పంపారు. రామ జన్మ భూమి ఉద్యమం ఉద్ధృతంగా జరుగుతోంది. కరసేవకులు అయోధ్యకు తరలి వెడుతున్నారు. శ్రీ లక్ష్మణ యతీంద్రులు కూడా అయోధ్యకు బయలుదేరారు. అప్పుడు వాకాటి వారు ఆ శీర్షిక చూస్తున్న డాక్టర్ నీరజా చక్రవర్తిని ( తిరుమల రామచంద్ర గారి కుమార్తె) అడిగారు ” స్క్రిప్ట్ మొత్తం వచ్చిందా?” అని. ” వచ్చింది” అని ఆమె చెప్పారు. సరే అనుకుని భరోసాగా ఉన్నాం. యతీంద్రులు అయోధ్యకు వెళ్ళిపోయారు. ఇక్కడ తిరుప్పావై ప్రచురణ జరుగుతోంది. యతీంద్రులు తిరిగి వచ్చారు కానీ, కొద్ది రోజులకే పరమపదించారు. అప్పటికి కానీ మాకు అసలు చిక్కు ఎదురుపడ లేదు. తరువాతి వారం తిరుప్పావై ప్రచురణ కావాలి. స్క్రిప్ట్ లేదు! అంతే కాదు… చివరి మూడు పాశురాలకు స్క్రిప్ట్ లేదు! ఎలా?
ధనుర్మాసం ప్రారంభం అయింది. తిరుప్పావై కాలక్షేపాలు జరుగుతున్నాయి. వాకాటి వారూ, నేనూ హైదారాబాద్ లో జరిగే ఈ కార్యక్రమాలకు వెళ్లాం విడి విడిగా. ఆలోచన ఒకటే… ఆ ప్రవచనకర్తలలో ఏ ఒక్కరైనా మాకు పనికి వస్తారా? వారి చేత ఆ శీర్షిక పూర్తి చేయించ గలమా? కానీ మాకు నిరాశే ఎదురైంది. వీక్లీ పాఠకులకు అందే విధంగా వ్రాసేవారు కనపడ లేదు. పాండిత్యం వేరు. అది వారందరికీ పుష్కలంగా ఉంది సందేహం లేదు. కానీ మీడియా ఇది. సామాన్య పాఠకులు వీళ్ళు. వారికి అర్థం అయ్యేలా పరమ సరళంగా యతీంద్రులలాగ వ్రాసేవారు కనపడ లేదు!
ఏమి చేయాలి? ఆ శీర్షిక ఆగకూడదు. బాపూ గారి బొమ్మలు రెడీగా ఉన్నాయి. స్క్రిప్ట్ లేదు. వాకాటి వారూ, నేనూ నాలుగైదు రోజులు తిరిగీ ఒక్కరినీ ఎంపిక చేయలేకపోయాము. వాకాటి వారు ఒక్కటే మాట అన్నారు ” ప్రమాదావనం ప్రశ్నలూ, జవాబులు రాయటం కాదు. ఇప్పుడు యతీంద్రుల తిరుప్పావై పూర్తి చేయ్!”
నేనా? అసలే తమిళం అంటే ద్వేషం! ఎందుకు? నన్ను పెంచిన వేంకట వల్లభాచార్యులు గారు మద్రాసులో చదువుకున్నారు కాబట్టి తమిళం బాగా ఒంట బట్టింది. ఇక ఆయన భార్య కనకమ్మ గారు తమిళనాట అదీ శ్రీ రామానుజులు అవతరించిన శ్రీ పెరంబుదూరులో జన్మించింది. ఇద్దరికీ తమిళం కొట్టిన పిండి. చిన్నప్పుడు నాకు చెప్పకూడని, తెలియకూడని విషయాలు ఏవైనా అంటే భార్యాభర్తలు ఇద్దరూ గడగడా తమిళంలో మాట్లాడేసుకునే వాళ్ళు. అది చూసి నాకు ఆ భాష మీద ద్వేషం పుట్టింది. తమిళంలో “ఓ అంటే ఢం” రాదు మనకి. ఈ తిరుప్పావై అంతా అదే భాషాయే! ఇదొక సవాలు అయిపోయింది నాకు. మార్కెట్లో పడి దాని తెలుగు వ్యాఖ్యానాలు వెతికాను. అదృష్టం కొద్దీ శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి వ్యాఖ్యానం దొరికింది. చివరి మూడు పాశురాల వ్యాఖ్యానం పదే పదే చదివాను. అర్థం చేసుకున్నాను. ” తెలియ వచ్చినంత” చెయ్యి చేసుకున్నాను. కానీ యతీంద్రులు సగం పేజీలో రెండు కాలమ్స్ లో అర్థం చెప్పారు. నా వల్ల కాలేదు. ఎంత ప్రయత్నించినా దాటిపోయి తరువాతి పేజీలోకి ప్రాకేసింది. ఒక్కటే తృప్తి, అదృష్టం… బాపూ – రమణలు “ఫరవాలేదు… బాగానే లాగేశాడు” అని వాకాటి వారికి చెప్పారు. చాలదూ అది? నా జీవితంలో ఆ శీర్షిక పూర్తి చేయటం ఒక గొప్ప వరం! ఆ తరువాత తిరుప్పావైకి శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి వ్యాఖ్యానం పూర్తిగా చదివాను.
” రాజకీయ విమర్శకు శ్రీకారం”
అప్పటి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆంధ్రప్రభ డైలీ డిప్యూటీ ఎడిటర్ ఎం. వి. ఆర్. శాస్త్రి గారు డైలీ జర్నలిజంలో, రాష్ట్ర – దేశ రాజకీయ చిత్రంలో అపార అనుభవం ఉన్నవారు. వాకాటి వారు ఆయనతో చర్చించారు. ఇద్దరూ ఒక అవగాహనకు వచ్చారు. అలా ఆంధ్రప్రభ వీక్లీలో మొదలైంది శాస్త్రి గారి ” రాష్ట్రాయణం” శీర్షిక. ఒక రకంగా … శాస్త్రి గారు అంగీకరిస్తారో, లేదో నాకు తెలియదు కానీ… వాకాటి వారు శాస్త్రిగారికి ” మెంటర్”. ఆయన వ్రాసిన మొట్టమొదటి వ్యాసం శీర్షిక నాకు ఇంకా గుర్తు…” సున్నా మీద ఒకటి వచ్చినా లాభమే!”… బి జె పి గురించి.
“మంచితనం బ్రతికే ఉంది!’
ఏ సమాజంలో అయినా కుళ్ళూ కుతంత్రాలు మాత్రమే కాదు ఏదో ఒక మోతాదులో మంచితనమూ ఉంటుంది. దానిని బయటకు తీస్తే మరింత మందికి ప్రేరణగా ఉంటుంది. అది బాధ్యత కూడా. ఆ బాధ్యత తలకెత్తుకున్నారు వాకాటి వారు. అలా మొదలైంది ” మంచితనానికి మరో పేరు” శీర్షిక. ఎంతో మంది తన జీవితాలలో జరిగిన సంఘటనలు, ఆ సంఘటనలలో తమకు అండగా నిలబడిన వ్యక్తుల గురించీ వ్రాశారు. ఇక్కడ ఒక తమాషా చెప్పాలి. ఆ శీర్షికకు బెంగలూరు నుంచి భట్టర్ లక్ష్మీదేవి అనే ఆమె తన జీవితంలోని విషాదాన్ని, ఆ సమయంలో తనకు, తన పిల్లలకూ సహాయం చేసిన వ్యక్తుల గురించి వ్రాశారు. జీవితం ఎప్పుడు, ఎవరిని, ఎలా కలుపుతుంది అనేది తెలియదు! అనంతర కాలంలో దాదాపు మూడేళ్ళ తరువాత ఆ భట్టర్ లక్ష్మీదేవి నాకు అత్తగారు, ఆ పిల్లలలో ఒకరు నాకు భార్య అయ్యారు!
” ఇది క్రొత్త ఒరవడి” రేపు…
Leave a comment