స్వీయ అన్వేషణ – 57
వాకాటి వారి నేతృత్వంలో ఎన్నో క్రొత్త ఒరవళ్ళు వచ్చాయి ఆంధ్రప్రభ వీక్లీలో! వాటిలో ప్రధానమైనది ” మిత్ర వాక్యం”. ఇది సంపాదకీయం. పొత్తూరి వారు పదవీ విరమణ చేసే వరకూ వారే ఎడిటర్ కాబట్టి సంపాదకీయం వ్రాసేవారు. ఆయన తరువాత యాజమాన్యం వాకాటి వారిని ఎడిటర్ ను చేయకుండా, డిప్యూటీ ఎడిటర్ గా మాత్రమే ఉంచి, పూర్తి బాధ్యతలు ఒప్పగించింది. ఇంకో వైపు డైలీ కి మాత్రం వాసుదేవ దీక్షితులు గారిని మాత్రం డైలీకి ఎడిటర్ ను చేసింది. ఆయన ఆంధ్రప్రభ కు ” పాత కాపు” కదా? పైగా ఇండియన్ ఎక్స్ప్రెస్ సంపాదకుడు సుందరం కు సన్నిహితుడు. వాకాటి వారు మాత్రం”బయటి పక్షి!”
సరే… సంపాదకీయ బాధ్యతలు పూర్తిగా చేతికి వచ్చాక ఆయనే సంపాదకీయం వ్రాయాలి. దానికి ఒక నామకరణం చేయాలి అనుకున్నారు ఆయన. వీక్లీ స్టాఫ్ అందరినీ పేరు సూచించమని అడిగారు. ఏమో? ఏ పుట్టలో ఏ పాముందో? అందరూ రకరకాల పేర్లు సూచించారు. అలాగే నేను రెండు పేర్లు సూచించాను. 1. మిత్ర సూక్తం, 2. మిత్ర వాక్యం. రెండవది ఆయనకు నచ్చింది.
“ఎడిటర్ అనే వ్యక్తి పాఠకుల స్థాయి కన్నా పైన ఏదో సింహాసనం మీద కిరీటధారియై ఉద్బోధలు చేసేవాడుగా ఉండకూడదు. పాఠకులకు మిత్రుడుగా వ్యవహరించాలి. పాఠకులు సమాజంలోని వ్యక్తులే. వారి సుఖ దుఃఖాలు, జీవిత వైవిధ్యాలు, సామాజిక ప్రభావం వీటన్నిటితో సంపాదకుడు మమేకం అయినప్పుడే ఆ పత్రిక పాఠకునికి ఆత్మీయంగా రూపొందుతుంది” అనేవారు ఆయన. ఆ ఉద్దేశ్యంతోనే ” మిత్ర వాక్యం” ఎంపిక అయింది. ” మిత్ర సూక్తం” అనేసరికి అది మళ్ళీ ఎవరో ఒక గురువు బోధ అన్నట్టు అయిపోతుంది. వద్దు” అన్నారు.
నిజంగా వాకాటి వారి రచనలు అన్నీ ఒక ఎత్తు, ” మిత్ర వాక్యం” ఒక్కటీ ఒక ఎత్తు. ఆయన అధ్యయన విస్తృతికి, పరిశీలనా నైశిత్యానికీ అది ఒక ఋజువుగా నిలిచింది. దాదాపుగా ప్రతి “మిత్ర వాక్యం” చివరి ఏదో ఒక ” పొడుపు” ఉండేది. ఒకసారి నేను ఆయన్ని అడిగాను… ” సర్! అంత బాగా రాసి, చివర్లో అలా పొడుస్తారెందుకు?” అని. ” వృశ్చిక రాశి కదా? లక్షణం ఎక్కడికి పోతుంది?” అని నవ్వేశారు.
“ఆయన ఒక సాహసి”
మిత్రుడు వివేకానందం ఒకసారి డాక్టర్ నారాయణ్ దత్ శ్రీమాలీజీ పుస్తకం ఇచ్చాడు. దాని పేరు ” The Power of Tantra”!. దానిలో ఆయన మార్గదర్శనంలో వారి శిష్యులు చేసిన మంత్ర సాధనల అనుభవాలు ఉన్నాయి. అది చదివే సరికి ” ఈ రోజుల్లో ఇలాటి గురువులు ఉన్నారా? మంత్ర సిద్ధిని ప్రసాదించే వారున్నారా?” అనిపించింది. ఆ పుస్తకం వాకాటి వారికి ఇచ్చాను. ఆయనా చదివారు. నన్నూ, మిత్రుడు వివేకానందాన్ని పిలిచారు. ” ఈయనతో మనం ఒక ఇంటర్వ్యూ వేయాలి. ఇలాటి వారు ఈ రోజుల్లో కూడా ఉన్నారని చెప్పాలి” అన్నారు. శ్రీమాలిజీ స్వస్థలం జోధ్ పూర్. ఆయన స్థాపించిన ” సిద్ధాశ్రమ సాధక్ పరివార్” కు ఒక శాఖ ఢిల్లీలో ఉంది. మొత్తం మీద ఆయన అప్పుడు ఢిల్లీలో ఉన్నారని తెలుసుకున్నాం. మిత్రుడు వివేకానందం హిందీలో అనర్గళంగా మాట్లాడగలడు. అందుకని అతడిని పంపాలని నిర్ణయమైంది. తీరా అతడు ఢిల్లీ చేరేసరికి ఆయన జోధ్ పూర్ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. “వదలకూడదు” అనుకున్నాం. అతడు జోధ్ పూర్ బయలుదేరాడు అక్కడి నుంచే. మొత్తం మీద శ్రీమాలీజీ ఇంటర్వ్యూ సంపాదించుకు వచ్చాడు. అది ఆంధ్ర ప్రభ వీక్లీలో ప్రచురించాం. నిజానికి సమకాలీన సంపాదకుడు ఎవరూ ఆ పని చేయరు మంత్ర తంత్రాలు అనగానే ఒక నెగిటివ్ దృష్టితో. కానీ వాకాటి వారు అలాటి శషభిషలు పెట్టుకోలేదు. ఆయన సాహసి కదా!
అలాగే అద్దంకిలో ఉండే కృష్ణమూర్తి గారు. అసలు పేరు చెన్నూరు కృష్ణమూర్తి. కానీ అందరూ అద్దంకి కృష్ణమూర్తి గారు అనే పిలుస్తారు. ఆయన ఒక మహామంత్ర సిద్ధుడు. ఆయన గురించి కూడా వీక్లీలో ప్రచురించారు. అనంతర కాలంలో ఈ కృష్ణమూర్తి గారు నాకు మంత్రోపదేశం చేసి గురువు అయ్యారు. ఆ అనుభవాలు తరువాత.
అంతే కాదు… ఒకసారి వినాయక చవితి ప్రత్యేక సంచిక ప్రచురించేటప్పుడు ముఖచిత్రం ఏమి వేయాలి అనే చర్చ వచ్చింది. నేను “ఉచ్చిష్ట గణపతి’ బొమ్మ వేద్దాం” అన్నాను. ఉచ్ఛిష్ట గణపతి అంటే అందరికీ కాకపోయినా నూటికి తొంభై మందికి భయం. అదేదో ” క్షుద్ర వామాచార తాంత్రిక విద్య” అని లోకంలో అభిప్రాయం. దాని గురించి చర్చ జరిగింది. ఆ గణపతి తత్వం గురించి చర్చ జరిగింది. నిజానికి నేను ఆ బొమ్మ చెప్పటానికి ఒక కారణం లేకపోలేదు. గతంలో ఒక మాట చెప్పాను… అది గుర్తు చేస్తాను… డాక్టర్ ప్రసాదరాయ కులపతి నాకు ఒక గణపతి మంత్రం ఉపదేశించారు అని చెప్పాను కదా? అది ” ఉచ్చిష్ట గణపతి” మంత్రమే! అయితే ఆయన చెప్పింది వామాచార విధానం. అది తెలిశాక దానిని నేను వదలివేశాను. అది వేరే కథ. తరువాత చెబుతాను. నేను ఆంధ్ర ప్రభ సమ్మె కాలంలో మద్రాసులో ఉన్న మూడు నెలలూ జపించిన మంత్రం అదే! దానివల్లనే అప్పట్లో నేను చెప్పినవి జరిగాయి!
సరే… మొత్తం మీద ఆ బొమ్మ ఖాయం అయింది. రూపం కావాలి. వాకాటి వారు ప్రభ లైబ్రరీకి రెండు గొప్ప పుస్తకాలు తెప్పించారు. 1. కల్పతరు ఎకాడమీ ప్రచురించిన ” ప్రతిమా కోశ”, 2. దేవదాయ శాఖ ప్రచురించిన ” రూప ధ్యాన రత్నావళి”. ఇవి దేవతా మూర్తుల శిల్ప నిర్మాణ విధానాలకు సంబంధించినవి. వాటిలో ఆ బొమ్మ దొరికింది. అలాగే సికింద్రాబాద్ గణపతి ఆలయంలో గోడ పైన ఉన్న గణపతి శిల్పాలలోనూ దొరికింది. ఈ గణపతికి రెండు రూపాలు ఉన్నాయి. ఒకటి వామాచార విధానంలో ఒక స్త్రీ మూర్తితో కలసి ఉంటుంది. ఈ రూపాన్నే మన ” సంగీత రత్న త్రయం” లో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు ఒక కీర్తనలో స్తుతించారు! రెండవది అయిన దక్షిణాచార మార్గంలో స్త్రీ మూర్తి ఉండదు. రెండవదే ఎంచుకున్నాం.
వీక్లీలో సెల్వరాజ్ తో పాటు” శ్వేత” అని ఒక ఆర్టిస్టు ఉన్నాడు. అతడు ఆ బొమ్మ వేయాలని ఉత్సాహ పడ్డాడు. ఒక చార్ట్ తెచ్చి ఫుల్ సైజ్ లో వేశాడు. దీనిలో నా స్వార్థం కూడా ఉంది. ప్రచురణ అయాక ఆ చార్ట్ నేను తీసేసుకుని ఫ్రేం కట్టించుకున్నా.
” అయ్యప్ప మనకి ముందే తెలుసు!”
ఆంధ్రప్రభ వీక్లీలో నేను చేరిన క్రొత్తలో దీపావళి నవలల స్క్రిప్ట్స్ చదివించారని చెప్పాను కదా! ఆ నవలల పోటీ బహుమతి ప్రదానం విజయవాడలో జరిగింది. దానికి ముఖ్య అతిథి ప్రముఖ రచయిత ” చాసో” అని పిలువబడే చాగంటి సోమయాజులు. ఆయనను రిసీవ్ చేసుకోవడానికి వాకాటి వారూ, నేనూ విజయవాడ రైల్వే స్టేషన్ కి వెళ్ళాం. ప్లాట్ ఫామ్ అంతా అయ్యప్పల సందడి. అది చూసి అయ్యప్ప గురించి చర్చ మొదలైంది ఇద్దరికీ. ” అయ్యప్ప అనే దైవం శ్రీనాథుని కాలంలోనే తెలుగు వాళ్లకు తెలుసు” అన్నాను. ” అవునా? ఎలా?” అని అడిగారు.
ఈ విషయం నాకు ఎలా తెలిసిందో ముందు చెప్పాను. వీక్లీలో పని చేస్తున్న డాక్టర్ నీరజా చక్రవర్తి జక్కన ” విక్రమార్క చరిత్ర” కావ్యం పై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. జక్కన ఆ కావ్యంలో ఇష్ట దేవతా ప్రార్థనలో బెల్లంకొండ లో ఉన్న భైరవుడిని ప్రార్థిస్తాడు. ఆ భైరవుని రూపం, ఆయుధాలు, ఆవిర్భావ రహస్యం అన్నీ అయ్యప్ప తో సరిగ్గా సరిపోతాయి. ఈ విషయాలు ఆయనకు వివరించాను. ” రాసేయ్! వేసేద్దాం!” అన్నారు వాకాటి వారు. ” సర్! ఈ విషయం నాకు నీరజ గారి అముద్రిత సిద్ధాంత వ్యాసం చదివాక తెలిసింది. ఆవిడ వ్రాయటం న్యాయం” అన్నాను. ” అడుగుదాం. నీరజ రాయకపోతే నువ్వు రాయ్” అన్నారు. వీక్లీ యాజమాన్యం అయ్యప్ప ప్రత్యేక సంచిక వేసినప్పుడు చివరికి నేనే ఆ విషయం వ్రాశాను. మాకు ఆనందం కలిగిన విషయం ఏమిటంటే ఆ వ్యాసాన్ని తమిళ, మళయాల పత్రికలు ” ఆంధ్ర ప్రభ వీక్లీ సౌజన్యంతో” అని అనువదించి ప్రచురించుకోవటం!
” దేవుడు లేడు!” రేపు…
Leave a comment