” దేవుడు లేడు!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ -58

దీపావళి నవలల పోటీ బహుమతి ప్రదానం సభకు ముఖ్య అతిథి ” చాసో” ( చాగంటి సోమయాజులు). ఆయనను స్టేషన్లో రిసీవ్ చేసుకుని తీసుకువచ్చాం. సభకు రెండు రోజుల సమయం ఉంది.

మరునాడు వాకాటి వారు అమరావతి వెడదామని అన్నారు. వాకాటి వారూ, “చాసో”, నేనూ, మా ఫోటోగ్రాఫర్ జనార్దన్ కారులో బయలుదేరాం. బయలుదేరే ముందు “చాసో” ఒక మాట అన్నారు. ” మీతో వస్తా, కానీ… గుడిలోకి రాను!”

సరే! మా ప్రయాణం సాగుతోంది. త్రోవలో ఏవో ” స్వస్థత సభలు” జరుగుతున్నట్టున్నాయ్. చాలా మంది స్త్రీలు చేతిలో నల్లని అట్ట ఉన్న పుస్తకంతో తండోపతండాలుగా నడుస్తూ వెడుతున్నారు. “చాసో” అది చూసి ” ఇదో వేలంవెర్రి అయిపోయింది. మా ఇంట్లో పనిమనిషి కూడా ఇంతే” అన్నారు. “చాసో” సైద్ధాంతిక భావజాలం తెలిసిన వాకాటి వారు నవ్వుతూ ” మీ ఇంట్లో ‘ పని మనిషి ‘ ఉందా?” అని అడిగారు. ” చాసో” కి ఆ చిరునవ్వు వెనుక వ్యంగ్యం చురుక్కుమని తగిలింది. ” పనిమనిషి అంటే అలా కాదు. ‘ హెల్పర్ ” అన్నారు. ” సరే లెండి! ఏదైతేనేం? ఇంట్లో పనికి హెల్పర్. అంతేగా?” అన్నారు వాకాటి వారు.

” చాసో” మళ్ళీ ” ఏవిటో? అర్థం కాదు… మీ వివేకానందుడు కూడా ‘ దేవుడు లేడు ‘ అన్నాడు. అయినా అందరూ దేవుడి వెనుక పడతారు” అన్నారు. వాకాటి వారు నవ్వుతూ ” అవును! వివేకానందుడు ఆ మాట అన్నాడు. ఆ మాట తరువాత అన్న మాట కూడా చెప్పండి మరి!” అన్నారు. ” చాసో” మాట్లాడలేదు. అప్పుడు వాకాటి వారు ” దేవుడు లేడు… ‘నీ అనుభవంలోకి వచ్చే వరకు ‘. ఆయన అన్నది అదీ. ఎవరికైనా దేవుడు అనే అనుభవం కలిగే వరకు ఆ వ్యక్తికి “నిజంగా” దేవుడు లేనట్టే. ఆ అనుభవం పొందిన వారికి దేవుడు అంటే తెలుస్తుంది… ఆయన గురువు రామకృష్ణ పరమహంస లాగ. అదీ వివేకానందుని ఉద్దేశ్యం. అంతేకాని దేవుడు అసలే లేడు అని కాదు” అన్నారు. ఇక అమరావతి చేరే వరకూ ” చాసో” మౌనంగా ఉండిపోయారు.

అమరావతి గుడి దగ్గరకు చేరాం. కారు దిగగానే ” చాసో” అక్కడ ఉన్న పెద్ద రాతి బండ దగ్గరకు నడిచి జేబులో నుంచి చుట్ట తీసి ఆ బండ మీద కూర్చుని ” నేను లోపలకి రానని చెప్పాను కదా? ఇక్కడే కూచుంటాను. మీరు వెళ్లి రండి!” అని అన్నారు.

” సరే! వెళ్లి వచ్చేస్తాం” అని వాకాటి వారూ, నేనూ లోపలికి వెళ్లాం. ఇద్దరమూ శంకరమంచి సత్యం గారి ” అమరావతి కథలు” చదివిన వాళ్ళమే. ఆ కథల పరిమళం నేపథ్యంలో ఆలయం అంతా అణువణువు చూస్తూ, ఆ ఆలయ విశేషాల గురించి మాట్లాడుకుంటూ తిరుగుతున్నాం. కాస్సేపటికి ” చాసో” మా వెనుక వస్తూ కనిపించారు. వాకాటి వారు నవ్వు దాచుకుంటూ ” లోపలికి రానన్నారు” అని అడిగారు. ” ఏం తోచలేదు అక్కడ. స్కల్ప్చర్ చూద్దామని వచ్చా. అంతే!” అన్నారు ” చాసో”. “పోనీలెండి! ఎలాగోలా వచ్చారు!” అన్నారు వాకాటి వారు. ఆలయం అంతా చూసి తిరిగి వచ్చాం. ఆలయంలోకి వెళ్ళేముందు ” చాసో” బండ మీద కూర్చున్న దృశ్యాన్ని మా ఫోటోగ్రాఫర్ జనార్దన్ తన కెమెరాలో బంధించాడు. అదే ఇక్కడ అందరికీ అందిస్తున్నా.

అమరావతి ప్రయాణం పూర్తి అయింది. తిరిగి వచ్చాం. బహుమతి ప్రదానం కూడా అయిపోయాక ఆ మరునాడు హైదారాబాద్ కు తిరిగి వచ్చేశాం.

ఆ చిన్న అమరావతి ప్రయాణంలో వాకాటి వారు మెత్తని చురుకుతో  ” చాసో” తో ఆడుకోవటం తలచుకున్నప్పుడల్లా నవ్వుకోకుండా ఉండలేను.

“జయ ప్రభా? వద్దు” రేపు…

అమరావతి బండ మీద ” చాసో”
మరొక సభలో  “చాసో”తో ” వాయిలీనం” పై చర్చ!

Leave a comment