స్వీయ అన్వేషణ – 89
ఒకడికి ఒక సిద్ధాంతం మీద అభిమానం, నిష్ఠ ఉంటాయి. అది రాజకీయం కావచ్చు, సామాజికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు. తప్పు లేనే లేదు. ఆ నిష్ఠ ఉండాలి కూడా!
శ్రీ వైష్ణవులలో ఒక మాట ఉన్నది… ” పులి తరుముకొని వచ్చినా శివాలయం లోనికి పోకూడదు” అని. తత్వం అర్థం కాని వాళ్ళు ఈ మాటను ” శివ ద్వేషం” గా చిత్రీకరిస్తారు. కానీ… తత్వం ఏమిటి?
శ్రీ వైష్ణవునికి సర్వమూ శ్రీమన్నారాయణుడే. రక్షకుడు ఆయనే! ఒక్క మాటలో చెప్పాలి అంటే… పోతన గారి గజేంద్రుడు అన్నట్టు… ” నీవే తప్ప నితః పరం బెరుగ” … అదీ సిద్ధాంతం. పులి తరుముకొని వచ్చినా ఆ శ్రీమన్నారాయణుడే రక్షిస్తాడు అనే విశ్వాసం… ఆయన నాకు రక్షకునిగా ఉండగా ఇతరులను ఆశ్రయించ వలసిన అవసరం లేదు… అనే నిష్ఠ మాత్రమే. దానికి ” శివ ద్వేషం” గా చిత్రీకరించే వారు అజ్ఞులు, సిద్ధాంత రహస్య వివేక శూన్యులు. అంతే.
ఇంతకీ ఎవరి సంప్రదాయం వారిది. దానిలో వారికి ఎంత నిష్ఠ అయినా ఉండవచ్చు. కానీ ఇతర సిద్ధాంతములను, సంప్రదాయములను నిరసించటం, హేళన చేయటం తగదు. అందులోనూ సాహిత్య ప్రసంగాలలో అటువంటి ” అధిక ప్రసంగం” చేయటం క్షంతవ్యం కానే కాదు. ఇంతకీ ఈ ఉపోద్ఘాతం ఎందుకయ్యా అంటే అలాటి పండితులు ఉన్నారు కాబట్టి.
భక్తి టీవీ లో కొన్ని భక్తిరస ప్రధాన కావ్యాలపై కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అనుకున్నాం. ఎవరి చేత చెప్పించాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు గరికిపాటి నరసింహా రావు ప్రస్తావన వచ్చింది. ఆయన చేత చెప్పించాలని నిర్ణయమైంది. శ్రీ కాళహస్తి మాహాత్మ్యం, ఆముక్త మాల్యద, పాండురంగ మాహాత్మ్యం… ఇలా సాగింది. వీటిలో శ్రీ కాళహస్తి మాహాత్మ్యము శివ సంబంధమైనది కాగా, మిగిలిన రెండూ విష్ణు సంబంధమైనవి. వీటిలో భక్తి ప్రధానం. కార్యక్రమాలు మొదలయ్యాయి.
ఆముక్త మాల్యద శ్రీ కృష్ణదేవరాయల కావ్యం. దీనిలో ప్రధాన కథ శ్రీవైష్ణవ సంప్రదాయంలో ప్రధానులు అయిన ఆళ్వార్ లలో ఏకైక మహిళ గోదాదేవి గాథ. ఆమెను పెంచిన తండ్రి విష్ణు చిత్తులు … పెరియాల్వార్… ఒక పాత్ర. కాగా ఇతర గాథలూ ఉన్నాయి. అన్నీ శ్రీమహావిష్ణు పారమ్యాన్ని నిర్ధారించేవే.
ఆ కావ్యం గురించి ప్రసంగించేటప్పుడు ఆ వక్త ఆ కావ్య విషయానికి పరిమితం కావాలి. ఆ విషయం వ్యక్తిగత జీవితంలో ఆ వ్యక్తి నమ్మే సిద్ధాంతానికి విరుద్ధం కావచ్చు. అయినా కావ్యంలోని సిద్ధాంతానికి మాత్రమే పరిమితం కావాలి. తాను నమ్మే దానితో పోల్చి, ఇది తప్పు అనే అభిప్రాయంతో మాట్లాడకూడదు. కావ్యం రచించిన కవి అభిప్రాయాన్ని వివరంగా చెప్పటం మాత్రమే ఆ వక్త కర్తవ్యం. అంతకుమించి ఏమి మాట్లాడినా అది ” అధిక ప్రసంగం” మాత్రమే!
ఆముక్త మాల్యద కార్యక్రమం నడుస్తోంది. ఒక సందర్భంలో మోక్షం గురించిన ప్రస్తావన వచ్చింది.
అద్వైత సిద్ధాంతంలో జీవుడు పరబ్రహ్మంలో ఐక్యం అయిపోవటం మోక్షం. శ్రీ విశిష్టాద్వైత సిద్ధాంతంలో జీవుడు పరబ్రహ్మం అయిన శ్రీమన్నారాయణుని లో ఐక్యం కాడు. శ్రీ వైకుంఠం లో ఆ స్వామి ఎదుట ఆయన కళ్యాణ గుణముల వైభవాన్ని అనుభవిస్తూ ఉండిపోతాడు. అది ఈ రెండు సిద్ధాంతాల మధ్య తేడా. అంటే జీవుడు ఆయనను చూస్తూ, ఆ అనుభవంలో ఓలలాడుతూ ఉండిపోతాడు.
ఆముక్త మాల్యద లో ఈ మోక్ష ప్రస్తావన వచ్చింది. వక్త నరసింహారావుకు వ్యక్తిగతంగా అద్వైత సిద్ధాంతంలో నిష్ఠ ఉన్నది. అది ఆయన వ్యక్తిగతం. ఈ కావ్యం రాయల వారిది. ఆయనకు శ్రీ వైష్ణవ సిద్ధాంతంలో నిష్ఠ ఉన్నది.
ఈ సందర్భంలో నరసింహారావు ఒక మాట అన్నారు… ” ఎంతకాలం అలా చూస్తూ కూర్చుంటారుట? చివరికి గర్ల్ ఫ్రెండ్ మొహం అయినా ఎంత సేపు చూడగలరు? విసుగెత్తదా?” అన్నారు. హేళన! సిద్ధాంత ద్వేషం! కాక మరేమిటి? భగవద్గుణ గణానుభవ స్థాయిని చివరికి గర్ల్ ఫ్రెండ్ మొహం చూడటం తో పోల్చటమా? నీకు ఆ సిద్ధాంతం ఇష్టం లేకపోతే, ఆ కావ్యం వైష్ణవ కావ్యం అని తెలుసు కనుక ఏమి చేయాలి? ” నేను ఆ కావ్యం గురించి మాట్లాడను!” అని చెప్పాలి. నీ నిజాయితీకి పాదాభివందనం చేసే వాడిని. అక్కడితో అయిపోతుంది. ఊహూ! ప్రోగ్రామ్స్ కావాలి, వాటి వల్ల వచ్చే పారితోషికం కావాలి, కానీ ఆ కావ్యంలోని సిద్ధాంతాన్ని హేళన చేయాలి. ఇదా ఒక “పండితుడు” అనుకునే వాడు చెయ్యాల్సిన పని.
నాకు ఈ వ్యాఖ్య నచ్చలేదు… నేను శ్రీ వైష్ణవుడను కావటం వల్ల కాదు… “కావ్య ధర్మా”న్ని అవమానించడం వల్ల మాత్రమే నచ్చలేదు.
ఈ విషయం నేను ప్రోగ్రామింగ్ హెడ్ రామలక్ష్మి గారి దగ్గర ప్రస్తావించాను. ఇలాటి వ్యాఖ్యలు తప్పని వివరించాను. ఆవిడ ” నేను మాట్లాడుతాను” అన్నారు.
తరువాత ఆవిడ ఆయనతో ” ఇలాటి కంప్లయింట్స్ వస్తున్నాయి” అని చెప్పారు.
దానికి నరసింహారావు చెప్పిన సమాధానం అత్యంత అహంకారపూరితం! ” ఎవరు? చిన జీయరా? నా దగ్గరకు రమ్మనండి. నాతో మాట్లాడమనండి!” ఇదీ సమాధానం!
ఈ విషయం తెలిశాక నాకు ఒళ్ళు మండిపోయింది. ఇంతోటి “వక్త”తో మాట్లాడటానికి చిన జీయర్ రావాలా? అహంకారం కాక మరేమిటి? ఈ సాహిత్య జీవితో వాదానికి ఒక ఆచార్యుడు దిగి రావాలా? మన స్థాయి ఏమిటి? ఇవేవీ తెలియవా?
అప్పుడు నేను రామలక్ష్మి గారితో ” ఈ మనిషితో మాట్లాడటానికి చిన జీయర్ రావాలా? ముందు నన్ను దాటమనండి” అన్నాను.
ఆమె ” మీరు మాట్లాడకండి ఈ విషయం ఆయనతో ” అని అన్నారు ( పరోక్షంగా ఆదేశించారు!)
కొంత కాలం గడిచింది. నేను తిరుమలకు సంబంధించిన ” నిత్యోత్సవం” కార్యక్రమం చేసేవాడిని. ఆ ఒక్క ఆలయమే కాక అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం వంటి ఆలయాలలో జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించినవి కూడా చేసేవాడిని. అలాటి సందర్భం వచ్చింది.
రామలక్ష్మి గారు ఛానల్ పని మీదే విశాఖపట్నం వెళ్లారు. శ్రీనివాస మంగాపురం బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఆ ఊరేగింపుల ఫుటేజ్ వచ్చింది. స్క్రిప్ట్ రాయాలి. అప్పుడు రాసిన స్క్రిప్ట్ లో నరసింహారావు చేసిన వ్యాఖ్యలకు సమాధానం గట్టిగానే చెప్పాను.
రామలక్ష్మి గారు విశాఖలో వుండగానే ఇది జరిగింది. ఆవిడ ఆ ప్రోగ్రాం అక్కడే చూసినట్టున్నారు. మరునాడు ఫోన్ చేశారు… ” గరికిపాటి వారికి సమాధానం చెబుతున్నారా?” అని అడిగారు. ” అవును” అని నిజం చెప్పాను.
ఆమె తిరిగి వచ్చాక ” సమాధానాలు సాఫ్ట్ గా కూడా చెప్పవచ్చు” అన్నారు. నేనేమీ మాట్లాడలేదు. ” ఎవరికి ఏ భాషలో చెబితే అర్థం అవుతుందో ఆ భాషలోనే చెప్పాలి” అన్నది నా సూత్రం! అంతే!
” ఆ స్లాట్ ఖాళీ… ఏం చేస్తారో చేయండి!” రేపు…
Leave a comment