“ఆ స్లాట్ ఖాళీ…”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 90

భక్తి టీవీ నా మటుకు నాకు గొప్ప అవకాశం. అప్పటివరకూ ప్రింట్ మీడియాలో డెస్క్ జాబ్. తరువాత “వెలుగు” తో నేరుగా జనాలతో కలిసి పని చేసే అవకాశం. ఇప్పుడు భక్తి టీవీ … ఎలక్ట్రానిక్ మీడియా… ఇక్కడ పాండిత్యాలు పనికి రావు. సాధారణ ప్రేక్షకుడికి అందాలి, అర్థం కావాలి. పాండిత్యం పనికి రాదు అంటే ఎందుకూ పనికిరాదని కాదు. భక్తి సంబంధమైన విషయాలలో లోతైన అవగాహన ఉండి తీరాలి. ఆ విషయంలో పాండిత్యం తప్పనిసరి. అయితే ఇక్కడి రచన పాండిత్య ప్రదర్శన కోసం కాదు. ఆ బలంతో, ఆ విషయాలను అత్యంత సరళంగా ప్రేక్షకుడికి అందించే నైపుణ్యం అవసరం. ఆ విషయం భక్తి టీవీలో నేను నేర్చుకున్న పాఠం.

అలాగే మరొక అంశం ” స్క్రీన్ ప్రెజెన్స్”. సాహిత్యంలో నుంచి వచ్చిన నాకు “వక్త ఎలా ఉంటే ఏం? అతడు చెప్పే విషయం ముఖ్యం” అనే అభిప్రాయం బలంగా ఉండేది. అది ఈ వేదిక లో తప్పు అని గుర్తించేటట్టు చేశారు ప్రోగ్రామింగ్ హెడ్ రామలక్ష్మి గారు.

ఒక కార్యక్రమం విషయంలో ఈ “జ్ఞానం” బోధించారు ఆమె. భక్తి లోని ఒక అంశంపై కార్యక్రమం. ఒక మంచి పండితుడు వక్త. ఆయన అలా చెప్పుకుంటూ పోవచ్చు. కానీ రామలక్ష్మి గారు ఒక ఆకర్షణీయమైన  ఏంకర్ని పెట్టారు. ” మధ్యలో ఆవిడ ఎందుకు?” అని అడిగాను. ” అది అరగంట కార్యక్రమం. అంతసేపు స్క్రీన్ మీద ఆయన ఒక్కడినీ చూడరు,  జనం ఛానల్ తిప్పేస్తారు” అన్నారు ఆమె. అలా ఎంత ” సరుకు” ఉన్న పండితుడు అయినా జనాన్ని స్క్రీన్ కి కట్టిపడేసే స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలనే సూత్రం ఆమె బోధించారు నాకు.

భక్తి టీవీ లో నేను చేసిన కార్యక్రమాలలో కొన్ని నాకు చిరస్మరణీయాలు. విజయవాడ సమీపంలోని శ్రీకాకుళం లో ఉన్న ” ఆంధ్ర మహావిష్ణువు ఆలయం” పై చేసిన కార్యక్రమం ఒకటి. ఆ క్షేత్రం తెలుగు పంచ కావ్యాలలో ఒకటైన ఆముక్తమాల్యద ఆవిర్భావ స్థలం. స్వామి స్వయంగా శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి కి స్వప్నంలో దర్శనమిచ్చి అడిగి మరీ వ్రాయించుకున్న కావ్యం అది.

ఆ స్వామికి ” ఆంధ్ర మహావిష్ణువు”, ” తెలుగు వల్లభుడు”, ” ఆంధ్ర వల్లభుడు” అనే నామాంతరాలు కూడా ఉన్నాయి. ఆ కార్యక్రమం విషయంలో నేను మరచిపోలేని రెండు అంశాలు ఉన్నాయి. ఆ కార్యక్రమం ప్రసారం అయిన కొద్దిసేపటికి నాకు ఒక ఫోన్ వచ్చింది. భక్తి టీవీలో ఉన్న మరొక స్క్రిప్ట్ రైటర్ భార్య ఫోన్ చేశారు. ” ఇప్పుడే చూశాను సార్! చాలా బావుంది. మా ఆయనకి కూడా మీ లాగ రాయటం నేర్పకూడదూ!” అన్నారు ఆవిడ!

భక్తి టీవీలో వరదరాజు అని వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఒకాయన ఉండేవారు. ఈ కార్యక్రమం ప్రసారం అయిన కొద్ది రోజులకు ఒకరోజు మధ్యాహ్నం ఆయన వచ్చి ” మీ కోసం వేటూరి సుందరరామ్మూర్తి గారు వచ్చారు. బయట కారుకి వెయిట్ చేస్తున్నారు, రండి” అన్నారు. వేటూరి వేరు నా కోసం రావటం ఏమిటి! అని ఆశ్చర్యపోతూ వెళ్ళాను.  వరదరాజు నన్ను ఆయనకు పరిచయం చేశారు.

” కారెక్కండి. ఒక అరగంట అలా తిరుగుతూ మాట్లాడుకుందాం” అన్నారు. కారు బయలుదేరింది.

” మీరు శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు ఆలయం గురించి చేసిన ప్రోగ్రాం చూశాను. చాలా బాగుంది. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి!” అన్నారు వేటూరి వారు.

” నేను మీకు హెల్ప్ చేయడం ఏమిటి సర్?” అని అడిగాను.

” నేను ఎస్ వి బి సి కి ఆంధ్ర మహావిష్ణువు సీరియల్ ప్రపోజల్ ఇస్తున్నాను. మీరు నాకు దానికి అవసరమైన మెటీరియల్, సినాప్సిస్ ఇవ్వాలి! తరువాత స్క్రిప్ట్ లో కూడా మీ హెల్ప్ కావాలి” అన్నారు వేటూరి వారు.

నాకు ఏమీ అర్థం కాలేదు. ” నేను మీకు హెల్ప్ చేయడం ఏమిటి సర్! పైగా సినాప్సిస్, స్క్రిప్ట్ లో మీకన్నా నేనేమి చేయగలను?” అని అడిగాను.

” లేదు మీ స్క్రిప్ట్ లో ఒక ‘ సోల్ టచ్ ‘ ఉంది. అది కావాలి నాకు. అందుకే అడిగాను” అన్నారు. అంతటి కవి, పండితుడు అడిగితే కాదు అనేది ఏముంటుంది? ” నీకంత నమ్మకం ఉంటే చేస్తాను సర్! ముందు సినాప్సిస్ ఇస్తాను. చూసి అప్పుడు డిసైడ్ చేయండి” అన్నాను. అలా వేటూరి వారితో ఆనాడు జరిగిన సంభాషణ మర్చిపోలేనిది నాకు.

ఆ కార్యక్రమానికి ” ఆంధ్ర వల్లభుని ఆలయం” అని టైటిల్ పెట్టాను. రామలక్ష్మి గారు అది చూసి ” ఏం? మీ పేరు కలిసొస్తుందని ఆ టైటిల్ పెట్టారా?” అన్నారు. సగం నిజమే!

అలా నాకు ఇప్పటికీ గుర్తున్న మరొక కార్యక్రమం… ” జలానికి వందనం”. అధర్వ వేదంలోని జల సూక్తాలు ఆధారంగా చేసిన కార్యక్రమం. స్క్రిప్ట్ రెడీ అయింది. ఎడిటర్ రవి. ఒకరోజు ఆ ఔట్ పుట్ ఇవ్వటానికి డెడ్ లైన్.  ఉదయం ఆఫీస్ కి వెళ్లేసరికి ఎడిటర్ రవి లేడు. పది అయింది… పదకొండు అయింది… రవి జాడ లేదు. సాయంత్రానికి ప్రోగ్రాం ఇచ్చేయాలి. చివరికి పన్నెండు గంటలకు వచ్చాడు. ” రండి సార్! చేసేద్దాం” అన్నాడు. ” ఇప్పటి వరకూ ఎక్కడికి పోయావ్?” అని కొంచెం విసుగ్గానే అడిగాను. రవి నవ్వేసి ” ఒక్క టెన్ మినిట్స్ సర్!” అంటూ ఒక పెన్ డ్రైవ్ తీసి దానిలోని ఫుటేజ్ క్యాప్చర్ చేయటం మొదలు  పెట్టాడు. టెన్ మినిట్స్ అయిపోయింది. స్క్రిప్ట్ కు వరదరాజు వాయిస్ ఓవర్ రెడీ గా ఉంది. ఎడిటింగ్ మొదలు పెట్టాడు. వాయిస్ వస్తోంది. దానికి తగిన వీడియో ఫుటేజ్ వేసుకుంటూ పోయాడు. నేను ప్రక్కనే చూస్తూ ఉన్నాను. ఆ వీడియో చూస్తూ నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చివరికి పూర్తి అయేసరికి మళ్ళీ చూడాల్సిన పని కూడా లేకుండా పోయింది. అంతా అయిపోయి ఔట్ పుట్ పెట్టాక చెప్పాడు… ” ఈ ఫుటేజ్ తీసుకు రావటానికే వెళ్ళాను సర్!” అన్నాడు. రవి డెడికేషన్ అలాటిది. స్క్రిప్ట్ ఎంత బాగున్నా దానికి తగిన ఫుటేజ్ లేకపోతే అంతా వేస్టే! Thank you Ravi!

భక్తి టీవీ లో ఒక ఎడిటర్ మానేశాడు. మరొకరిని తీసుకోవాలి. అప్పుడు వచ్చాడు వర్మ. అతన్ని చూడగానే రామలక్ష్మి గారు ” ఈ అబ్బాయి భక్తి కి ఏం పనికి వస్తాడు?” అన్నారు. అతగాడు వేషం అలా ఉంది మరి. మొత్తం మీద చేరాడు. నాలుగో ఎడిట్ సూట్ నాకు, రవికి, వర్మకి అడ్రస్! అక్కడే “నిత్యోత్సవం” కార్యక్రమం చేసేవాళ్ళం. రవి ఎంత రెస్పాసిబిల్ గా ఉంటాడో ముందే చెప్పాను.

వర్మని చూస్తే రవికి పూర్తిగా భిన్నంగా ఉంటాడు. ఏదీ పెద్దగా లెక్క చేసే మనిషిలా కనిపించడు. ఒక రోజు రవి, ఒక రోజు వర్మ నిత్యోత్సవం ఎడిట్ చేసేవారు. ఆ కార్యక్రమం ప్రధానంగా రెండు భాగాలుగా ఉండేది. మొదటి భాగంలో శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామ స్తోత్రం లోని పది నామాలకు అర్థం, రెండవ భాగం తిరుమలలో జరిగే ఉత్సవాల గురించి. ఈ భాగానికి ఫుటేజ్ తిరుపతి లోని కెమెరామన్ మునిరాజు పంపేవాడు. విశేష ఉత్సవాలు ఉంటే సరే… లేకపోతే ప్రతి రోజూ జరిగే సహస్ర దీపాలంకరణ సేవ ఫుటేజ్ పంపేవాడు. దానికి ప్రతి రోజు ఏమి స్క్రిప్ట్ రాస్తాం? దానికి మేము చూసుకున్న మార్గం అన్నమాచార్యుల వారు సంకీర్తనలు. మా దగ్గర అన్నమాచార్యుల వారి వెయ్యి సంకీర్తనల డివిడి లు ఉన్నాయి. వాటిలో నుంచి ఎంపిక చేసుకునే వాళ్ళం. ఈ ఎంపిక కూడా కార్యక్రమం మొదటి భాగంలో చెప్పిన స్వామి నామాలకు చెప్పిన అర్థాలకు సరిపోయే సంకీర్తనలను ఎంపిక చేసుకునే వాళ్ళం. 

ఒకసారి మరొక ప్రోగ్రాం చేస్తూ “నిత్యోత్సవంలో సంకీర్తన ఏదో ఒకటి వేసేయ్ ” అని వర్మ తో అన్నాను. “అదెలా కుదురుతుంది సార్? వెతుకుదాం” అంటూ వెతికి వెతికి ఒక సంకీర్తన తీశాడు. రవి, వర్మ ఇద్దరూ ఇద్దరే. ఎక్కడా కాంప్రమైజ్ అయే వారే కారు. సుబ్బు, రవి, వర్మ ముగ్గురి దగ్గరా ఎడిటింగ్ నేర్చుకున్నాను నేను! వాళ్ళు ముగ్గురూ ఆ విషయంలో నాకు టీచర్స్!

ఇలా సాగుతూ ఉండగా శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిదిన్నర వరకూ ఉండే స్లాట్ ఖాళీ అయింది. దానికి ప్రోగ్రాం ఫిక్స్ చేయాలి. రామలక్ష్మి గారు నన్ను పిలిచి ” ఫ్రైడే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ స్లాట్ ఖాళీ. ఆ స్లాట్ మీదే!” అన్నారు.

“ఏ ప్రోగ్రామ్ చేయాలి?” అని అడిగాను.

“మీ ఇష్టం! నాకేమీ చెప్పక్కర్లేదు” అన్నారు. అలా ఒక స్లాట్ నాకు వచ్చింది. ఔట్ పుట్ చూసేవారు అంతే!

రామలక్ష్మి గారు గొప్ప మేనేజర్! గొప్ప అడ్మినిస్ట్రేటర్! ఎవరి చేత ఏ పని ఎలా చేయించుకోవాలి అనేది ఆవిడకి వెన్నతో పెట్టిన విద్య. ఆనాడు భక్తి టీవీలో పనిచేసిన వారందరూ ఇప్పటికీ ఆమెకు ” భక్తులే!”. కరోనా కాలం రెండేళ్లు వదిలేస్తే ప్రతి ఏటా ఆనాడు భక్తి టీవీలో పని చేసిన వారందరూ కలుస్తూనే ఉన్నాం. దాని వెనుక ” మాతృ శక్తి” మేడపాటి రామలక్ష్మి గారు!

” ఎస్ వి బి సి నుంచి పిలుపు!” రేపు…


Leave a comment