” ఎస్ వి బి సి నుంచి పిలుపు!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 91

భక్తి టీవీ లో ఆకెళ్ళ విభీషణ శర్మ కొన్ని కార్యక్రమాలు చేసేవారు. అలా పరిచయం అయ్యారు. ఆయన టి టి డి ఉద్యోగి. ఎస్ వి బి సి కి కూడా కార్యక్రమాలు చేసేవారు.

ఆయన ఒకసారి “ఎస్ వి బి సి కి వచ్చేయకూడదూ?” అని అడిగారు. ” రాను!” అన్నాను.

” ఎందుకు?”

” నాకు ఇక్కడ బాగుంది. ఇక్కడవచ్చే జీతం చాలు. మా ఆవిడ ఇక్కడ ఉద్యోగం చేస్తోంది. రామలక్ష్మి గారు స్టాఫ్ అందరినీ వాత్సల్యంతో చూసుకుంటున్నారు. ఇలాటి ఛానల్ వదలి వెళ్లే అవసరం ఏముంది? రాను!” అని చెప్పాను. అప్పటికి ఆయన ఏమీ మాట్లాడలేదు… కానీ రెండు మూడు సార్లు ఈ ప్రస్తావన చేశారు. నా సమాధానం మారలేదు.

ఒక రోజు విభీషణ శర్మ తిరుపతి నుండి ఫోన్ చేశారు… ” నేను మీ గురించి వేంకట శర్మ గారికి చెప్పి చాలా కాలం అయింది. ఆయన నన్ను అడుగుతున్నారు. పైగా సిఇఓ కే. ఎస్. శర్మ గారికి కూడా చెప్పారు. ఆయన ఒకసారి రమ్మన్నారు. రండి!”

” నేను ఎస్ వి బి సి కి రానని మీకు చెప్పాను కదా? మరి వాళ్ళకి ఎందుకు చెప్పారు?” అని అడిగాను.

” మిమ్మల్ని అడగటానికి ముందే వాళ్ళకి చెప్పాను. వాళ్ళు నన్ను అడుగుతున్నారు. సరే! మీరు చేరవద్దు. కానీ సిఇఓ రమ్మన్నారు. ఆయన చాలా సీనియర్ ఐ ఎ ఎస్ ఆఫీసర్. ఆయన రమ్మన్నాక రాకపోతే మర్యాద కాదు. ఒకసారి రండి. నాకు చెప్పినట్టే ఇష్టం లేదని చెప్పేయండి!” అన్నారు.

ఇక్కడ వేంకట శర్మ గారి గురించి చెప్పాలి. ఆయన టి టి డి లో ఒక ప్రత్యేక హోదాలో అన్నారు. ఆ ఛానల్ ప్రారంభం అయేటప్పుడు ఛానల్ స్వరూపస్వభావాలు ఎలా ఉండాలి అనే విషయం ఒక పేపర్ తయారు చేశారు కూడా!

సరే! విభీషణ శర్మ చెప్పినట్టు వెళ్లి సిఇఓ కే చెప్పేస్తే పోలే! పైగా ఒకసారి స్వామి దర్శనం కూడా చేసుకుని రావచ్చు. అదీ ముఖ్యమైన ఆశ! అప్పటికి మూడేళ్లు అయిపోయింది స్వామి దర్శనం చేసుకుని!

రెండు రోజులు లీవ్ పెట్టి వెళ్ళాను. విభీషణ శర్మ నన్ను వేంకట శర్మ గారి దగ్గరకు తీసుకువెళ్ళారు. ఏదో మీటింగ్ జరుగుతోంది. నేరుగా ఆ మీటింగ్ లోకి తీసుకువెళ్ళారు. పరిచయం చేశారు. ” మీటింగ్ అయిపోయాక సిఇఓ దగ్గరకు వెడదాం” అన్నారు ఆయన. మీటింగ్ అయిపోయింది.

వేంకట శర్మ గారు నన్ను సిఇఓ దగ్గరకు తీసుకువెళ్ళి పరిచయం చేసి ” మీరు మాట్లాడండి” అని బయటకు వెళ్ళిపోయారు. మా సంభాషణ ఇలా సాగింది…

” మీరు ఎస్ వి బి సి కి రావాలని అనుకుంటున్నారని  విభీషణ శర్మ, వేంకట శర్మ చెప్పారు”

” లేదు సర్! విభీషణ శర్మ నన్ను అడిగారు. ఆయనకు క్లియర్ గా చెప్పాను రానని”.

” ఎందుకు? ఏమిటి మీకు ఇబ్బంది?”

ఏదో చెప్పాలి కదా?

” నేను తిరుపతికి షిఫ్ట్ కాలేను”

” అదే… ఏమిటి ప్రాబ్లెమ్?”

” నా భార్య హైదారాబాద్ లో ఇన్ కమ్ టాక్స్ లో పని చేస్తోంది. రాలేదు”

” అంతేనా? నేను సి బి డి టి ( సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) ఛైర్మన్ తో మాట్లాడతాను. ట్రాన్స్ఫర్ చాలా చిన్న విషయం”. మొదటి బాణం ఫెయిల్ అయిపోయింది.

” మా అబ్బాయి అక్కడ చదువుకుంటున్నాడు”

” తిరుపతిలో ఏ స్కూల్ లో అడ్మిషన్ కావాలో చెప్పండి”. రెండో బాణం కూడా ఫెయిల్.

” సర్! మా అత్తగారున్నారు. పెద్దావిడ. మాదే బాధ్యత. ఆవిడ ఆరోగ్యం బాగుండదు”.

” అదేవిటీ అలా అంటారు? ఇక్కడ హాస్పిటల్స్ లేవా? స్విమ్స్ లాంటివి ఉన్నాయి. నో ప్రాబ్లెమ్!” మూడోది, చివరి బాణం కూడా గురి తప్పిపోయింది! నాలాటి వాళ్ళని ఎంతమందిని చూసి ఉంటాడు ఆ సీనియర్ ఐ ఎ ఎస్ అధికారి. ఇంక నా దగ్గర బాణాలు లేవు.

ఆయన ఒక పేపర్ తీసి నా ముందు పెట్టారు. ” ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎవిరి ప్రాబ్లెమ్. డోంట్ వర్రీ! అది సైన్ చేసేయండి” అన్నారు. అది అప్లికేషన్!

అనవసరంగా మర్యాద కోసం వచ్చి దొరికిపోయాను. ” సరే! జాబ్ వాళ్ళు ఇవ్వచ్చు. నేను జాయిన్ అవాలని ఏముంది?” అనుకుని సంతకం పెట్టాను. అప్పుడు శర్మ గారు ” ఈ అప్లికేషన్ కాపీ ఈ ఓ కి కూడా ఇవ్వండి” అన్నారు. ” రేపు ఉదయం స్వామి దర్శనం ఎరేంజ్ చేస్తాను. దర్శనం చేసుకురండి. రేపటికల్లా ఆర్థర్ మీ చేతిలో ఉంటుంది” అన్నారు కూడా.

అప్పుడు టి టి డి ఈ ఓ రమణాచారి. ఆయన నాకు బాగా పరిచితులే. సాయంత్రం ఆయనను కలిశాను. ” ఎప్పుడు వచ్చావ్? దర్శనం కోసమా?” అని అడిగారు.

” కాదు సర్! కె ఎస్ శర్మ గారు రమ్మంటే  కలవటానికి వచ్చాను” అంటూ అప్లికేషన్ కాపీ ఆయన ముందు పెట్టాను.

అది చూసి ” భక్తి వదిలేస్తున్నావా?” అని అడిగారు.

” ఇప్పటివరకూ ఆ ఆలోచన లేదు సర్!”

ఆయన పెన్ తీశారు ఆ అప్లికేషన్ కాపీ మీద ఏదో రాయటానికి. అది చదువుతూ ” అప్లికేషన్ కాపీ ఒకటి శర్మ గారికి ఇయ్యి” అన్నారు.

” As per protocol ఆయనకు పొద్దున్నే ఇచ్చాను. ఇది దాని కాపీ” అన్నాను.

ఆయన ఒకసారి నా వైపు చూశారు. రాయటానికి తీసిన పెన్ పక్కన పెట్టేశారు. ” ఓకే. నేను శర్మ గారితో మాట్లాడతాను” అన్నారు. ” రేపు దర్శనానికి వెడతావా?” అనీ అడిగారు.

” శర్మ గారు ఎరేంజ్ చేస్తానని చెప్పారు సర్!” అన్నాను.

“ఓకే” అన్నారు. నేను వచ్చేశాను.

మరునాడు ఉదయం ఎస్ వి బి సి కి వెళ్ళాను. గతంలో భక్తి టీవీలో పని చేసిన ప్రొడ్యూసర్ శ్రీనివాస రావు అప్పటికే ఇక్కడ చేరారు. అతన్ని కలిశాను. ” శర్మ గారు మిమ్మల్ని దర్శనానికి తీసుకు వెళ్ళమన్నారు. రండి. వెడదాం” అని తీసుకు వెళ్ళాడు. దర్శనం అయింది. క్రిందకి వచ్చాం. శర్మ గారిని కలిశాను.

” ఈ పాటికి ఆర్థర్ రావాలి. ఇంకా రాలేదు. రేపు కూడా ఉండండి” అన్నారు.

“సారీ సర్! రెండు రోజులే లీవ్ పెట్టి వచ్చాను. సాయంత్రానికి రిజర్వేషన్ కూడా అయిపోయింది. నేను వెళ్ళాలి” అన్నాను.

” సరే… వెళ్ళండి. ఆర్థర్ పంపిస్తాను” అన్నారు. నేను హైదారాబాద్ తిరిగి వచ్చేశాను.

ఆ ఆర్డర్ రాదని నాకు తెలుసు. రమణాచారి పెన్ పక్కన పెట్టినప్పుడే అర్థం అయింది. ఆయనతో అంత పరిచయం ఉండీ, ఈ ఓ అయిన ఆయనకు ముందు అప్లికేషన్ ఇవ్వకుండా సి ఇ ఓ కి ఇవ్వటం, చివరికి స్వామి దర్శనం కూడా ఆయనే ఎరేంజ్ చేస్తారని చెప్పటం… ఒక ఐ ఏ ఎస్ అధికారి కి నచ్చదు కదా?

ఒకరకంగా నా పర్పస్ సర్వ్ అయింది. ఇక ఎస్ వి బి సి మరచిపోవచ్చు!

” భక్తికి గుడ్ బై!” రేపు…


Leave a comment