స్వీయ అన్వేషణ -115
” మీరు కోరుకున్న వారిని వశం చేసుకోండి!”
” ఈ చిన్న పని చేస్తే చాలు, పరుగెత్తుకొని వస్తారు!”
… ఇలా ఎన్నో వీడియోలు యూ ట్యూబ్ నిండా!
ఇలాటివి చూసి, ” నిజమే” అనుకొని, భ్రమల్లో మునిగిపోతున్నారు.
దాదాపు రెండేళ్ళ క్రితం ఒక వీడియో అందించాను. దానిలో ” ప్రేమ వ్యవహారాలు, అనైతిక సంబంధాలు వంటి విషయాలు నా దగ్గర ప్రస్తావించవద్దు. వివాహ విషయాల్లో కూడా అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ సంప్రదించవద్దు. వారి తల్లిదండ్రులు మాత్రమే మాట్లాడండి” అని స్పష్టంగా చెప్పాను.
యువత ఎలా తయారు అయారంటే…
ప్రేమలు, బ్రేక్ అప్ లు, పెద్దలకు చెప్పక పోవటం,వేరేవేరే పెళ్ళిళ్ళు, అసంతృప్తులు… ఇలాటి విషయాలలో ఫోన్లు వస్తున్నాయ్!
” నేను ఒకబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయి కూడా నన్ను ప్రేమించాడు. కానీ ఇప్పుడు నన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ పెళ్లి ఆపేయాలి. వెంటనే ఆపేయాలి. ఏదైనా మంత్రం చెప్పండి!” ఇదీ ఒక యువతి ఫోన్ చేసి అడిగిన విషయం!
ఏం చెప్పాలి? “మంత్ర శాస్త్రం” ఇందుకా?!
” అమ్మా! ఈ ప్రేమ వ్యవహారాలు నా దగ్గర ప్రస్తావించ వద్దు అని స్పష్టంగా చెప్పాను గతంలో” అన్నాను.
” మరి మీరెందుకు సార్? ఎంతమంది చెప్పటం లేదు ఇలాటి వాటికి పరిష్కారం? మీరెందుకు చెప్పరు?” అని వాదానికి దిగింది ఆ యువతి.
” అలాటివేవీ ఉండవమ్మా!” అంటే…
” ఎందుకు ఉండవు? అదేదో చెప్పారు ఒకాయన… రాత్రి పూట ఒక మనిషి పేరు చెప్పుకొని, ఆ వ్యక్తి నాకు వశం కావాలి అని లవంగాలు కాలిస్తే, ఆ మనిషి 24 గంటల్లో మీ దగ్గరకు పరుగెత్తుకొని వస్తారు అని చెప్పారు. మీరేమో అలాటివేవీ ఉండవు అంటున్నారు. చెప్పటం ఇష్టం లేకపోతే ఆ మాటే చెప్పండి. లేకపోతే మీకు తెలియదు అని చెప్పండి. అంతేకానీ అలాటివేవీ లేవనకండి!” అంటూ నాకు “జ్ఞాన బోధ” చేసింది ఆ యువతి.
ఏవిటీ పరిస్థితి? శాస్త్ర విషయాలు, విధానాలు, సాధనలు ఇందుకా?
ఎక్కడికి పోతున్నది ఈ ” జాతి?”
ఈ తరానికి కనీస పరిజ్ఞానం అందించని ” నేరం” ఎవరిది?
చివరికి మన మహర్షులు దర్శించి, అందించిన ” మంత్ర విజ్ఞానం” అనే మహత్తర శక్తిని ఏ ” మురుగు కాలువ” లోకి దింపేశారో తెలుస్తోంది కదా?
దేవతలను చివరికి పెళ్ళిళ్ళు చెడగొట్టటానికి వాడాలా?
ఇలా ” వశీకరణ” అనే మాటను అడ్డమైన వాటికీ వాడేస్తున్న వాళ్ళని ఏమి చేయాలి?
ఆలోచించండి! మీరు, మీ తరువాతి తరాలు ఇలాటి ” భ్రమలు”, “అజ్ఞానం” నుండి బయటపడే ప్రయత్నం చేయండి.
మీతో పాటుగా మీ తరువాతి తరాలకు కనీస దైవ జ్ఞానాన్ని అందించండి. నాకు తెలుసు… మీ ముందు తరం మీకు ఆ ” జ్ఞానా”న్ని అందించలేదు!
ప్రతి వారికీ… కుల – లింగ – వయో భేదాలు లేకుండా “దేవతానుగ్రహం” పొందే అధికారం ఉంది!
ఆ ” అధికారా”న్ని వినియోగించు కోండి!
ఆ ” అధికారా”న్ని మీ అందరికీ అందించాలనే పరమ పూజ్య గురుదేవులు స్వామీ నిఖిలేశ్వరానందగా ప్రసిద్ధులైన డాక్టర్ నారాయణ్ దత్ శ్రీమాలీజీ జీవితాంతం శ్రమించారు. తన తరువాత కూడా ఆ మార్గాన్ని అందరికీ అందించటానికి ఎంతో మందిని సిద్ధం చేశారు. ఆ పరంపర ఇప్పటికీ గురుదేవుల ఆశయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
శ్రీ గురు చరణ కమలేభ్యో నమః!
Leave a comment