” అనుభవమే ప్రమాణం!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 116

ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలి అంటే నీకు నువ్వే తెలుసుకోవాలి… ఒక్క శాస్త్ర విషయాలు తప్ప! ఆ విషయాలలో మార్గదర్శనం అవసరం కనుక తప్పదు. మిగిలిన విషయాలలో అవసరం లేదు.

ప్రధానంగా సాహిత్య విషయంలో ఇది చాలా అవసరం. ఒక పుస్తకం ఉంది అంటే… అది కవిత్వం కావచ్చు , కథా సంపుటి కావచ్చు, వ్యాస సంకలనం కావచ్చు… ఏదైనా సరే… పుస్తకం తెరిచాక ” ముందు మాటలు” అంటూ కొన్ని ఉంటాయి. వాటిని అసలు చదువ కూడదు! నేరుగా ఆ రచయిత వ్రాసినది ఏదో అది చదవాలి! అప్పుడే మీకంటూ ఒక “అంచనా” ఏర్పడుతుంది. ఆ తరువాత వెనక్కి వెళ్లి ఆ ” ముందు మాటలు” చదవాలి. అప్పుడు చాలా “అసలు రంగులు” బయట పడతాయి! నూటికి తొంభై తొమ్మిదిన్నర పైన శాతం ” ఇది నోబెల్ బహుమతికి అర్హమైన రచన” అనే లెవెల్ లో ఉంటాయి! ముందుగా అవి చదవటం అంటే మీరు ” బ్రెయిన్ వాష్” కి లొంగి పోవటమే! ఆ దృక్కోణంలో నుంచి మాత్రమే అసలు రచన చదువుతారు. అప్పుడు మీకు  కలిగేది ” మీ” అనుభవం కాదు! “ముందు మాటలు” వ్రాసిన వాళ్ళ భావాన్ని “మోసుకొని” లోపలికి వెడతారు. ఇతరుల అనుభవాలను మోసుకొని వెళ్ళటం సాహిత్య ప్రక్రియలలో పనికిరాదు,

కానీ, శాస్త్ర సంబంధమైన విషయాలు చదివేటప్పుడు ఆ “ముందు మాటలు” అవసరం అవుతాయి! ఎందుకు? అది శాస్త్ర విషయం. దానిని వివరించటానికి ఒక రచయిత ఒక గ్రంథాన్ని వ్రాశాడు. దానికి తన “గురు స్థానీయులు” అయినవారు, ఆ రంగంలో విశేష కృషి చేసేవారు ఉంటే వారి అభిప్రాయాలు కోరుతాడు. వారు ఆ శాస్త్రంలో తమ అనుభవాన్ని క్రోడీకరించి వ్రాస్తారు. అటువంటి “ముందు మాటలు” మనకు ఆ గ్రంథ అధ్యయనంలో “కర దీపికలు” అవుతాయి. కనుక తప్పదు!

అలాగే ” మంత్రశాస్త్ర” విషయం కూడా! ఈ అంశంలో వచ్చిన ప్రాచీన గ్రంథాలు ప్రామాణికమైనవి. అవి ఋషి దర్శనాలు కనుక. ఆధునిక గ్రంథాలు చాలా వరకూ “సేకరణలు”, “సంకలనాలు”. అలా అని ప్రామాణికమైనవి కావు అనటం లేదు! వాటి మూల గ్రంథాలు అధ్యయనం చేయటం ద్వారా అనువాదాలలోని ప్రామాణికతను నిర్ధరించుకోవచ్చు. దానికి సంస్కృత పరిజ్ఞానం తప్పనిసరి. కేవల భాషా పరిజ్ఞానం మాత్రమే చాలదు. దానిలోని ” పరిభాష” యొక్క పరిజ్ఞానం కూడా ఉండాలి. అది “నిఘంటువు”లలో దొరకదు. కేవలం గురు సన్నిధిలో తెలుసుకోవలసిన అనేక రహస్యాలు ఉంటాయి!

“శాస్త్ర పరిజ్ఞానం” వేరు, “అనుభవ జ్ఞానం” వేరు అని బుద్ధిమంతులు అందరికీ తెలిసిన విషయమే. ఈ “అనుభవ జ్ఞానం” కేవలం “సాధన” వల్ల మాత్రమే సిద్ధిస్తుంది. ఈ విషయంలో ఇతరుల అనుభవాలు మనకు సహకరించవు. అవి కేవలం మనను ఆ రంగంలో ప్రవేశించటానికి ఉత్సాహ “ప్రేరకాలు”గా మాత్రమే పనికివస్తాయి.

అలాగే ” శాస్త్ర పరిజ్ఞానం” సంపాదించుకోవాలి అన్నా, “అనుభవ జ్ఞానం” సాధించుకోవాలి అన్నా ముందుగా ఉండవలసినది “ఓపిక”! ఏదో సరదాగానో, ఏదో సమస్య పరిష్కారానికో మంత్రాన్ని పట్టుకొనే వాడు ( నా అనుభవంలో) ముందుగా మూడు ప్రశ్నలు వేస్తున్నారు…

1. ఈ మంత్రం నిజంగా పని చేస్తుందా?

2. ఈ మంత్రం ఎన్నాళ్ళు చేయాలి?

3. ఫలితం ఎన్నాళ్లలో వస్తుంది?

అసలు మొదటి ప్రశ్న దగ్గరే ఆ వ్యక్తి ఈ రంగానికి పనికిరాడు అని తేలిపోతుంది. రెండవ ప్రశ్న వచ్చింది అనగానే ఆ వ్యక్తికి సాధనకు కావలసిన ఓపిక లేదని తేలిపోతుంది. మూడవ ప్రశ్న వచ్చేసరికి ఆ వ్యక్తికి మంత్రం మీద కాక ఫలితం మీద మాత్రమే దృష్టి ఉంది అని తేలిపోతుంది. ఈ మూడు లోపాలతో సాధనలోకి దిగే వ్యక్తి జీవితాంతం సాధన చేసినా ఫలితం రాదు.

నా విషయంలో గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషీజీ కి తప్ప ఇతరులకు తెలియని ఒక విషయాన్ని ఇప్పుడు పంచుకుంటాను…

నాకూ ఎన్నో సమస్యలు ఉండేవి. కొన్ని భరించలేని స్థాయిలో ఉండేవి. వెళ్లి గురుదేవులకు చెప్పుకొనే వాడిని. ఆయన ఒక మంత్రం చెప్పేవారు. ఇన్ని రోజులు, రోజుకు ఇన్ని మాలలు జపించాలి అని చెప్పేవారు.

ఆయన దగ్గరకు వెళ్ళింది ఎందుకు? ఒక సమస్య నుంచి బయట పడటానికి. మరి ఆయన చెప్పిన జపం చేసేటప్పుడు ఆ సమస్యకి సంబంధించిన సంకల్పం చెప్పుకోవాలి కదా? ఆ మొదటి రోజుల నుంచి ఈనాటి వరకూ నేను ఆ పని చేయలేదు. సంకల్పం చెప్పకూడదు అని కాదు! అసలు సంకల్పం చెప్పాలి అనే ఆలోచనే ఉండేది కాదు! ఎందుకో? అలా ఎన్ని సమస్యలో? ఎన్ని మంత్రాలో? ఎన్ని జపాలో? అప్పటికీ, ఇప్పటికీ వేటికీ సంకల్పం చెప్పనేలేదు!

కానీ… క్రమంగా సమస్యలు ఒక్కొక్కటీ మాయం అవుతూ వచ్చాయి! ఒక దశలో సమస్య అనేదే లేని పరిస్థితి సిద్ధించింది!

ఇప్పుడు నీకేవీ సమస్యలు లేవా? అంటే… గతంలో వలె భరించలేనివి ఏవీ లేవు! ఉన్నవి అయినా “స్వయంకృతాపరాధా”ల వల్ల వచ్చినవే! మనకి సంబంధం లేని విషయాలలో తలదూర్చి నెత్తికి తెచ్చుకొన్నవే! ఇలాటి వాటిని గురుదేవుల దగ్గర ప్రస్తావించటం కన్నా బుద్ధి హీనత వేరే ఉంటుందా?

నిజానికి మనకు వస్తున్న సమస్యలలో నూటికి తొంభై శాతం ఇలాటి ” స్వయంకృతాపరాధాలు” మాత్రమే! కాస్త ఆలోచిస్తే ఈ విషయం సులువుగానే అర్థం అవుతుంది!

సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం, తాహతుకు మించి ప్రవర్తించటం ప్రధాన కారణాలు! అలాగే ఇతరులతో పోల్చుకుని వారిలా బ్రతకాలి అనుకొని మునిగిపోవడం మరొకటి! ఆ విధంగా మనకు వంద రూపాయల ఆదాయం వస్తుంటే వెయ్యి రూపాయలు ఖర్చు చేయటం, దానికి అప్పు చేయటం!

ఆర్థికంగా వుండే సమస్యలు మాత్రమే కాదు… జీవితంలో క్రమశిక్షణ, ప్రవర్తనలో మార్పు, పరస్పర అవగాహన, కుటుంబ సమైక్యత వంటి వాటిలో సరైన దారిలో నడిస్తే నూటికి తొంభై సమస్యలు వాటంతట అవే పరిష్కారం అయిపోతాయి. ఆ మార్గాన్ని అవలబించ గలిగితే నూటికి తొంభై శాతం  అసలు సమస్యే తలెత్తవు!

ఈ ధోరణి లేక అవి అలా అలా పెరిగి పెరిగి భరించలేని స్థితికి రావటం, అప్పుడు పరిష్కారం కోసం వెతకటం, లౌకిక పరిష్కారాలు అందుబాటులో లేకపోవటం లేదా ఎలాటివి పని చేయక పోవటం వల్ల చిట్కాలు – మంత్రాలను ఆశ్రయించటం…ఇలా ఒక వలయంలో పడి పోతున్నారు.

మన శాస్త్రాలు ” నియమబద్ధమైన, క్రమ శిక్షణాయుతమైన జీవన విధానం” ఒక దానిని బోధించాయి.  ఎన్నో శాస్త్రాల వరకూ ఎందుకు? ఒకే ఒక వాక్యం… భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పిన ఒకే ఒక మాట… “యుక్తాహార విహార”ములు పాటిస్తే చాలదూ?!

” చేస్తే తెలుస్తుంది!” రేపు..


Leave a comment