స్వీయ అన్వేషణ – 117
నిన్న మంత్ర శాస్త్ర విషయంలో “ప్రాచీన గ్రంథాలు ప్రామాణికం అయినవి. అవి ఋషి దర్శనాలు కనుక. అలా అని ఆధునిక గ్రంథాలు ప్రామాణికం కావు అని కాదు” అని మాత్రమే అని వదలి వేశాను. ఇక్కడ మరికొన్ని విషయాలు ప్రస్తావించాలి.
మనకి మూడు శాస్త్రాలలో “పరిశోధన”, ” పరిణామం” రెండూ ఆగిపోయాయి అనిపిస్తోంది నా మటుకు నాకు! ఏవిటా శాస్త్రాలు? 1.మంత్ర శాస్త్రం,
2. సాహిత్యానికి సంబంధించిన అలంకార శాస్త్రం,
3. ( కంగారు పడకండి!) కామ శాస్త్రం.
చివరి రెండూ అప్రస్తుతాలు. మనకి ప్రస్తుతం మంత్ర శాస్త్రం.
ప్రాచీన ఋషి దర్శనాలు వేద మంత్రాలుగా మొదట ఆవిష్కృతం అయ్యాయి. వాటిని “అపౌరుషేయాలు” అన్నారు. అంటే వాటికవి వారికి వ్యక్తం అయినవి తప్ప వారు ప్రయత్నించిందని కావు. తరువాత అనేక మంది ఋషులు ఈ విశ్వచైతన్య పౌనఃపున్యాలను ఎవరికి వారుగా తమ తపశ్శక్తితో దర్శించి అందించారు. ఇవి “పౌరుషేయాలు”.
ఇవన్నీ సంస్కృత భాషలో ఉండటం, అనేక పారిభాషిక పద సమన్వితం కావటం, వివిధ నియమ నిబంధనలకు లోబడి సాధించవలసినవి కావటం వల్ల జన సామాన్యానికి సాధనానుకూలంగా లేవు.
ఆ సందర్భంలో ” నాథ సంప్రదాయం”లో ఒక ప్రత్యేక మంత్ర శాస్త్ర విధానం వచ్చింది. ఈ మంత్ర సమూహం అంతా సంస్కృతంలో కాక ” దేశ భాష”లలో ఉండటం వల్ల బహుళ ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇది సంప్రదాయ మంత్ర శాస్త్రంలా దేశవ్యాప్తం కాక కొన్ని ప్రాంతాలలో బాగా ప్రచారంలో ఉండగా, కొన్ని ప్రాంతాలలో తక్కువగా ఉంది.
ఈ విధానంలో సంప్రదాయ విధానంలో ఉండే అనేక “ప్రక్రియ”లు ఉండవు. దాదాపుగా ప్రతి మంత్రం చివర ” మేరీ భక్తి గురు కీ శక్తి” అని ఉంటుంది. ఇదే ఈ విధానంలో “కీలకం”!
సంప్రదాయ మంత్ర శాస్త్ర విధానాలతో పాటుగా, ఇలాటి అనేక విధానాలను దేశం అంతటా పర్యటించి, అన్వేషించి, తెలుసుకుని, సాధన చేసి, సిద్ధిని పొందిన మహాత్ములు స్వామీ నిఖిలేశ్వరానందగా ప్రసిద్ధులు అయిన పరమ పూజ్య గురుదేవులు డాక్టర్ నారాయణ్ దత్ శ్రీమాలీజీ!
తాను సాధించిన సిద్ధిని తనకే పరిమితం చేసుకునే మహాత్ములు ఉన్న కాలంలో తన సిద్ధిని అందరికీ అందించాలనే దృఢ సంకల్పానికి తన జీవితాన్ని అంకితం చేయటం మాత్రమే కాక, ఆ విచారధార, ఆ పరంపర నిరంతరంగా కొనసాగడానికి సమర్ధులైన శిష్యులను తయారుచేసి, లోకానికి సమర్పించిన మహాత్ములు పరమ పూజ్య గురుదేవులు! ఆ పరంపరలోనే కొన్ని వేలమందికి మార్గదర్శనం చేస్తున్నవారు మా గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషీజీ!
ఏదైనా రుచి చూస్తేనే తెలుస్తుంది! “తీపి” అంటే ఎలా తెలుస్తుంది? ఆ తీపి పదార్థాన్ని తింటే తెలుస్తుంది. అంతే కదా? అలాగే మంత్ర శక్తి తెలియాలి అంటే ఆ సాధన చేస్తేనే తెలుస్తుంది. అలా గురూజీ చెప్పిన అనేక విధానాలను ఆచరించి ఫలితాన్ని పొందిన వారు ఎందరో ఉన్నారు! ఒకే ఒక్క ఉదాహరణ చెబుతాను…
ఒక యువకుడు ఉన్నాడు. చదువు పూర్తి అయింది. ఏవో పోటీ పరీక్షలు రాశాడు. ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం వచ్చింది ఒక దూర ప్రదేశంలో. వెళ్లి చేరాడు. ఆ సంస్థ పరిస్థితి ఏమిటంటే అక్కడ ఉద్యోగం వచ్చి, ఒక చోట పోస్టింగ్ వచ్చింది అంటే రెండు రెండున్నరేళ్ల వరకూ ఆ ఊరి నుంచి బదిలీ కాదు. ఈ యువకుడు అక్కడ చేరిన అయిదారు రోజులకే వాతావరణం, భోజనం రెండూ సరిపడలేదు. అయితే బదిలీ కావాలి లేదా ఆ ఉద్యోగం మానివేసి తిరిగి వచ్చేయాలి. అదీ పరిస్థితి! అప్పుడు ఫోన్ చేసి చెప్పాడు.
పరమ పూజ్య గురుదేవులు చెప్పిన శ్రీ నృసింహ కార్యసిద్ధి మంత్ర విధానం చెప్పి, చేయమన్నాను. అది పది రోజుల జపం, రోజుకు వెయ్యి జపం.
ఒక రోజు మొదలు పెట్టాడు. ఉదయం అయిదు వందల జపం చేసి, పూర్తి చేయటానికి వ్యవధి లేక ఆఫీస్ కి వెళ్ళాడు. ఆ రోజు మధ్యాహ్నం ఒక మీటింగ్ పెట్టారు. రెండు రెండున్నరేళ్ల వరకూ బదిలీలు లేని ఆ సంస్థలో ఆ రోజు జరిగిన ఆ మీటింగ్ లో “ఎవరెవరికి బదిలీ కావాలి?” అని అడిగారు!
అలా పది రోజుల జపం పూర్తి అయేసరికి ఆ యువకునికి తన సొంత ఊరికే బదిలీ అయిపోయింది!
కెనడాలో వుంటూ అయిదారేళ్ళుగా ప్రమోషన్ కోసం నానాపాట్లు పడుతున్న వ్యక్తి! అతని ప్రమోషన్ కోసం అతని భార్య అదే జపం చేసింది. పదిహేనవ రోజు ఆ వ్యక్తి ప్రమోషన్ లెటర్ అందుకున్నాడు!
అమెరికాలో ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోయిన స్థితిలో అదే మంత్ర సాధన వల్ల మెరుగైన ఉద్యోగం పొందాడు!
ఒక హాస్టల్ నడుపుతూ, నష్టాలు వచ్చి, ఇంక నడపలేక అమ్మేద్దామని అనుకుని, సరైన అమౌంట్ రాక ఇబ్బంది పడుతున్న వ్యక్తి అదే మంత్ర సాధనతో తాను కోరుకున్న అమౌంట్ కి అమ్మి, బయట పడ్డాడు!
ఇలా పరమ పూజ్య గురుదేవులు అందించిన విధానాలు ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపాయి.
” మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?” అని ప్రశ్నిస్తారు చాలామంది. అసలు నాకు అర్ధం కాని విషయం ఏమిటంటే ఒడుపుగా ఒక రాయి విసిరితే రాలే చింతకాయలకు మంత్రాల దాకా ఎందుకు? రాయి విసరడానికి బద్ధకమో లేక ఒడుపు లేకపోవడమో కాకపోతే!
కనుక ఏదైనా విషయాన్ని స్వయంగా ఆచరించి, అప్పుడు మాట్లాడాలి! అంతేకానీ ” ఇంటలెచ్యువల్” ప్రసంగాలు చేయటం కాదు.
ఏదైనా ” చేస్తేనే తెలుస్తుంది!” మరి.
Leave a comment