స్వీయ అన్వేషణ – 134
” వెనక్కి తిరిగితే శిలై పోతావ్!”
ఈ శీర్షిక నాది కాదు! వాకాటి పాండురంగరావు గారికీ, నాకూ అభిమాన కథా రచయిత ఎమ్మెస్ మూర్తి ఈ శీర్షికతో ఒక కథ వ్రాశారు. అదే శీర్షికను నేను ఇక్కడ మార్చి వాడుకుంటున్నాను.
“గచ్ఛతి పుర శ్శరీరం, ధావతి పశ్చా దసంస్కృతం చేతః” అంటాడు కవికుల గురువు కాళిదాసు.
” శరీరం ముందుకు వెడుతోంది… మనస్సు మాత్రం వెనుకకు పరుగులు పెడుతోంది”.
మనందరి బ్రతుకులూ ఇంతే కదా?!
చాలా మంది అంటారు ” గతం గతః” అయిపోయిందేదో అయిపోయింది, తిరిగిరాదు, దానికోసం ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? అంటారు. నిజమే! జరిగిపోయిన దానిని మనం మార్చలేము. కానీ…
జరిగిపోయినది అలా ఎందుకు జరిగింది! అసలు అలాగే ఎందుకు జరిగింది? “కర్మ” అంటారా? మరి ఆ “కర్మ” అలా ఎందుకు ఉంది? మరోలా ఎందుకు లేదు? అది నిన్ను ఎందుకు గోతిలోకి తోసేసింది? పైకి ఎందుకు చేర్చలేదు?
ఏళ్ళు గడచిపోయి, శరీరం ముందుకు పోతూనే ఉంటుంది. ఎటు వైపో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కదా? అలా శరీరానికి వయసు పెరుగుతున్న కొద్దీ మనసు మాత్రం గడిచిపోయిన కాలం వైపు పరుగులు పెడుతూ ఉంటుంది. ” ఆ రోజులే వేరు” అనుకుంటూ, ” ఆ రోజులు మళ్ళీ రావు” అనేసుకొని నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు.
” అప్పుడు అలా చేసి ఉండి ఉండకూడదు”, ” ఇలా చేసి ఉంటే బాగుండేది” అనుకుంటూ ఇప్పుడు చేతులు పిసుక్కుంటే ఏమి లాభం?
” ఆ రోజులే వేరు” అంటావా? ఎందుకు? అప్పట్లో నీ మాటకు ఎవరూ ఎదురు చెప్పలేదనా? అందరూ నీకు భయపడి ఒదిగి ఉన్నారనా? అందులో సుఖాన్ని పొందావనా?
“అలా చేసి ఉండకూడదు”, ” ఇలా చేసి ఉండాల్సింది” అంటున్నావ్ కదా? మరి అప్పుడు ఈ “తెలివితేటలు” ఏమైపోయాయ్? నా నిర్ణయం కరెక్ట్ అనే అహంకారం కాదూ? కాదూ… ఎవరి కోసమో త్యాగం చేసేశావా? అందులోనూ నీకే తెలియని నీ అహంకారం దాగిలేదూ?
” మోసపోయాను”, ” నా వాళ్ళే నన్ను మోసం చేశారు” అనుకుంటూ ఇప్పుడు మనసు పిండుకుంటే ఏమి ప్రయోజనం? తప్పెవరిది! నీదే! కాదా?
అవతలివాడి ” చలాకీతనం” నువ్వు గుర్తించలేక పోయావ్! వాడి చేతిలో ఓడిపోయావ్! తప్పెవరిది! నీదే!కాదా?
” గౌరవం” సంపాదించుకున్నానని అంటావా? సరే… కానీ… ఇప్పటికీ “ఒరేయ్” అని ఆప్యాయంగా పిలిచే ఆ చిన్ననాటి నేస్తులు ఒక్కరైనా వున్నారా నీ ప్రక్కన? నువ్వు చేసిన ఉద్యోగం నిన్ను వదలించుకున్నాక ఒక్కడైనా పలకరించాడా? నువ్వు సంపాదించిన దాన్ని తినే వాళ్ళే కానీ… దానికి నువ్వు ఎన్ని పాట్లుపడ్డావో నీ పిల్లలైనా తెలుసా?
“కడివెడు ఖరము పాలు” నీ బ్రతుకంతా “తోడు” పెట్టుకున్నావ్ కానీ… ” గంగి గోవు పాలు గరిటెడై” నా సరే ” కాచుకు”న్నావా? లేదే? ఇప్పుడు ఏడ్చి ఏం లాభం?
కాలం మారలేదు… మారదు. నువ్వు మారుతూ ” పోతున్నావ్”! ఏదో ఆశించి, ఇంకేదో సాధిద్దామని, మరేదో నీదేనని క్షణ క్షణానికి దారులు మార్చుకుంటూ పరుగులు పెడుతూ నిన్ను నువ్వు పోగొట్టుకొన్నావ్ కానీ.. ఒక్క క్షణం నిలబడి, గట్టిగా ఊపిరి తీసికొని “ఎక్కడికి పోతున్నాను? ఎలా పోతున్నాను? ఈ దారుల్లో ఎందుకు పోతున్నాను? అని ఆలోచించావా? ఇప్పుడు పిసుక్కొని ఏం ప్రయోజనం?
నువ్వు ” పరాజితుడివి!” నిన్ను నువ్వు వెతుక్కోనంత వరకూ.
నువ్వు ” విజేత” వి నిన్ను నువ్వు వెతుక్కోవటం మొదలు పెట్టిన క్షణమే!
“మోక్షం ఎప్పుడు? ఎక్కడా?” అని అడిగితే… ” ఇప్పుడే… ఇక్కడే… ఈ క్షణమే!” అన్నాడుట పరమాత్మ!
ఆ “క్షణం” కోసం ” నిరీక్షణం” కన్నా బుద్ధి తక్కువ పని మరొకటి లేదు!
ఆ క్షణాన్ని ఒడిసి పట్టుకోవటం కోసం యుగాలు ప్రయత్నిస్తే ఫలితం శూన్యం!
“ఇప్పుడే… ఇక్కడే… ఈ క్షణమే” అన్న మాట గుర్తు పెట్టుకో!
Leave a comment