స్వీయ అన్వేషణ – 135
చాలానే నేర్పింది జీవితం! ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం కన్నా గొప్ప “గురువు” లేరనిపిస్తుంది. ఎంత పెద్ద గ్రంథమూ, ఎంత గొప్ప శాస్త్రమూ, ఎంత కఠిన సాధనా నేర్పని ఎన్ని ” సత్యా”లను నేర్పలేదూ ఈ జీవితం! మరి ఈ జీవితాన్ని మనకు “ఇచ్చినది” ఎవరు? అదేం బుద్ధి లేని ప్రశ్న? తల్లిదండ్రులు అని కూడా తెలియదా అంటారు కదూ? అందుకే అడుగుతున్నా… ఈ జీవితాన్ని “ఇచ్చినది” కాదు…”ప్రసాదించినది” ఎవరు? ఇంకెవరు? శ్రీ గురుదేవులే!!!
శ్రీవైష్ణవ సంప్రదాయ గురుపరంపరను స్తుతించే సందర్భంలో నమ్మాళ్వార్ ను స్మరించే శ్లోకంలో దీనికి కీలకం ఉంది. ఆ శ్లోకం చదువుకుంటూ పోవడం కాదు… దాని భావనను మదిలో నిలబెట్టుకోవాలి కదా? ఆ శ్లోకం ఇదీ…
” మాతా పితా యువతయ స్తనయా విభూతిః, సర్వం యదేవ నియమేన మదన్వయానామ్ ఆద్యస్య నః కులపతే ర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రి యుగలం ప్రణమామి మూర్ద్నా”
నా వంశంలో తల్లి, తండ్రి, భార్య / భర్త, పిల్లలు ఎవరి నియమనం ( ఆదేశం) ప్రకారం జరిగాయో… ఆ విధంగా “కులపతి” అయిన శ్రీవకులాభిరామ ( నమ్మాళ్వార్) పద ద్వందానికి శిరసా నమస్కరిస్తున్నాను…అని స్థూలంగా భావం!
ఇప్పుడు చెప్పండి… జీవితంలో తల్లి, తండ్రి, భార్య / భర్త, పిల్లలు ఎవరి ఆదేశం వల్ల మీకు లభించారు? ఈ తల్లిదండ్రులకే పుట్టాలని, ఈ భార్య లేదా భర్తను పొందాలని, ఇలాటి సంతానం కలగాలని నిర్ణయించినది ఎవరు? శ్రీ వైష్ణవ సంప్రదాయంలో నమ్మాళ్వార్ అయితే ఇతర సంప్రదాయాలలో వారి గురుదేవులు!!!
గురుదేవులు అలా ఎందుకు నిర్ణయించారు? అసలు ఎలా నిర్ణయించ గలిగారు?
ప్రప్రధమ సృష్టిలో నేను ఉన్నాను… నా గురుదేవులూ వున్నారు. ఆనాడు వారి చరణ కమలాలను ఆశ్రయించి ఈ జీవితం సాగింది. కర్మ సంచయాన్ని ప్రోగు చేసుకుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకూ సాగివచ్చిన జన్మ పరంపరలో కూడా గురుదేవులు నా వెంటనే వున్నారు. కొన్ని జన్మలలో వారిని గుర్తించి ఉండవచ్చు, కొన్ని జన్మలలో గుర్తించ లేకపోవచ్చు. అనేక సహస్రాధిక జన్మలలో వెంట నిలిచిన గురుదేవులు ఆయా జన్మలలో నేను ప్రోగు చేసుకొన్న కర్మ సంచయాన్ని క్షయింప చేయటానికి అనువైన ” ఈ వంశంలో ఈ కుటుంబం”లో జన్మను నిర్ణయించి ప్రసాదించారు!
ఈ “ఎరుక” కలగటం కూడా గురుదేవుల కృపా కటాక్షాలతో మాత్రమే సాధ్యం అవుతుంది! మరి ఆ కృపా కటాక్షాలు ఎలా లభిస్తాయి? గురుదేవుల మార్గదర్శనం లో సాధన చేయడమే… అదొక్కటే మార్గం!
కనుక… మనకు మనంగా నేర్చుకున్నది కొంతే!
గురుదేవుల అనుగ్రహంతో నేర్వ వలసినది ఇంకా ఎంతో ఉంది!
Leave a comment