స్వీయ అన్వేషణ – 136
అవును… ఎవరితో ఈ యుద్ధం? లోకంలో ఎదురైన ప్రతి పరిస్థితితోనూ యుద్ధం చేసుకుంటూ పోతూనే ఉన్నాను ఇన్నాళ్లూ! సాధించినది మాత్రం ఏముంది కనుక?
సంపాదన కోసం పోరాటం!
అది చాలక అప్పు కోసం ఆరాటం!
చేసిన అప్పులు తీర్చటానికి పోరాటం!
ఉద్యోగాల్లో ప్రతిక్షణం పోరాటం!
విలువల కోసం ఆరాటం!
వాటిని నిలబెట్టుకోవడానికి పోరాటం!
జ్ఞాపకాలతో పోరాటం!
వాటిని తుడిచేయటానికి ఆరాటం!
పడి పోతానేమో అని ఆరాటం!
పడిపోకుండా ఉండటానికి పోరాటం!
పడిపోతే మళ్ళీ లేవటానికి ఆరాటం!
లేచాక నిలబడటానికి, ముందుకు నడవడానికీ పోరాటం!
దయ బ్రతుకును కమ్మేయకుండా పోరాటం!
కమ్మేసిన దయ చేసిన గాయాలను నయం చేసుకోవటానికి మళ్ళీ మళ్ళీ పోరాటం!
అపనమ్మకంతో పోరాటం!
నమ్మకం త్రాగేసిన నెత్తురు కూడ దీసుకోవటానికి పోరాటం!
విశ్వాసం కోసం ఆరాటం!
విశ్వాస ఘాతకులతో పోరాటం!
బాంధవ్యాల కోసం ఆరాటం!
బాంధవ్యాలు చేసిన హత్య నుంచి పునర్జన్మ కోసం పోరాటం!
పరిపక్వత కోసం పోరాటం!
పరిపూర్ణత కోసం ఆరాటం!
సుఖాల కోసం ఆరాటం!
బాధలతో పోరాటం!
కనిపించని వెలుగు కోసం ఆరాటం!
కనిపించే చీకటితో పోరాటం!
ఇంతేనా! ఇదేనా జీవితం?
ఈ ఆరాట పోరాటాల నడుమ ఆటుపోట్లేనా?
ఇదీ ఒక జీవితమేనా?
అసలు ఇది ” బ్రతుకా?” లేక “జీవితమా?”
బ్రతుకే అయితే ఈ సృష్టిలోని అన్ని జీవులూ ఎలాగో ఒకలాగ బ్రతికేస్తున్నాయ్ చచ్చే వరకూ. తేడా ఏముంది వాటికీ, మనకీ? “ఆహార నిద్రా భయ మైథునాదులు సర్వ జీవ సహజాలు”. పైన అనుకొన్న ఆరాట పోరాటాలు అన్నీ వాటికోసమే కదా? అంటే ” బ్రతుకు”తున్నాం! అంతే!
నేను “నేను”గా జీవించినది ఎప్పుడు? నేను “నేను” గా నిలబడినది ఎప్పుడు! నేను “నేను”గా భావించినది ఎప్పుడు? నేను “నేను”గా నిర్లిప్తంగా, నిరామయంగా, “ఆనందమయం” గా విహరించినది ఎప్పుడు? అలా జీవించినది కదా “జీవితం” అంటే!
దానికోసమే ఈ అన్వేషణ! నాతోనే నాకు యుద్ధం! నాతోనే నాకు పోటీ! నాకు నేనే లక్ష్యం, ధ్యానం, ధ్యేయం, గమనం, గమ్యం.
Leave a comment