“పచ్చళ్ళ పండుగలు!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 147

ఈ తరం గురించి నాకు తెలియదు కానీ, నా తరం వరకూ శ్రీవైష్ణవుల ఇళ్ళల్లో మొగవాళ్ళకి వంట చేయడం వచ్చు. వీళ్ల ఇళ్ళల్లో చాలా నియమాలు పాటించే సంప్రదాయం ఉండటం వల్ల నెలలో అయిదు రోజులు తప్పకుండా గరిటె పట్టే వాళ్ళు. ఇంటిలోని ఆడవారు నెలసరి రోజులలో విడిగా ఉండేవారు. అయిదవ రోజు కూడా వారి చేతులతో మంచినీళ్లు కూడా అందుకొనేవారు కారు. కనుక అయిదు రోజుల వరకూ ఆ ఇళ్ళల్లో “మొగ వంట” తప్పదు!

అయితే నేను మా చిన్న తాత వేంకట వల్లభాచార్యులు, కనకవల్లి దంపతుల దగ్గర పెరిగాను. ఇంటిలో నిత్య దేవతార్చన ఉండేది. వాళ్ళు ఇద్దరూ పెద్దవాళ్ళు కనుక ఆ ఇంటిలో నెలసరి ఇబ్బంది లేదు. అయినా ఒక్కొక్కసారి మా చిన్న మామ్మ ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. మా చిన్న తాత వంట చేసి ఆరగింపు ( నైవేద్యం) సమర్పించే వాడు. నేను పదవ తరగతి పరీక్షలు వ్రాసిన తరువాత ఆయనకు ఒక ప్రమాదం జరిగింది. ఆ విషయం గతంలో చెప్పాను. ఆయన దాదాపు మంచానికే పరిమితం. అలాటి సమయంలో ఆవిడకు ఆరోగ్యం బాగు లేకపోతే? దేవతార్చన, ఆరగింపు ఎలా? అలా నేను “పాక శాస్త్రం” లో ప్రవేశించాను. మా చిన్న మామ్మ చెబుతూ వుంటే వంట నేర్చుకున్నాను. క్రమంగా అది మామూలు వంట నుంచి ప్రసాదాల తయారీ వరకూ వచ్చింది! మరి ధనుర్మాసం, వైకుంఠ ఏకాదశి, ఆళ్వార్ ల తిరు నక్షత్రాలు… ఇలాంటివన్నీ వస్తాయి కదా! ఆయా సందర్భాలలో మా చిన్న మామ్మ ఆరోగ్యం బాగాలేక పోతే ప్రసాదాలు తయారు చేయాలి కదా? అందువల్ల ఆ పాఠాలు కూడా చెప్పింది ఆవిడ! అప్పుడు కదా శ్రీవైష్ణవం నిలబడింది!!

అనంతర కాలంలో మా నలుగురు తాతలలో ఒకరైన భాష్యకారాచార్యులు గారి కుమారుడు అనంత తులసీ వేంకటాచార్యులు గారి వివాహం జరిగింది. ఆయనను అందరూ “దాసు గారు” అని పిలిచేవారు. మురమళ్ళ దగ్గర ఉన్న టి. కొత్తపల్లి గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్ సేనాధిపత్యం హయగ్రీవాచార్యులు గారి పెద్ద కూతురు శేషగిరి తాయారు తో ఆయన వివాహం అయింది.

మా తండ్రి గారి తండ్రి వేంకట రంగాచార్యులు గారు “దాన వీరత్వం” కి వారసుడు ఈ “దాసు గారు”! ఒకప్పుడు గోదావరి పుష్కరాలు వస్తే ఎక్కడెక్కడి బంధువులూ ఫణిహారం వారి “దివాణం”లోనే బస, భోజనాలు. ఈ దాసు గారి ఇంటిలో పుష్కరాల ప్రసక్తి లేదు. ప్రతి రోజూ పుష్కరాలే. అప్పట్లో ఒక మాట అనేవారు మా చిన్న తాత ” ఎవరైనా ఢిల్లీ వెళ్ళాలంటే రాజమండ్రి వచ్చి దాసు ఇంట్లో దిగితే చాలు. ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చే ఖర్చులన్నీ అందినట్టే!”

అలాటి ఇల్లు అది. చదువులు అయిపోయి, మానేసిన కుర్రాళ్ళు ఏడెనిమిది మందికి ఆ ఇల్లు నివాసం. వాళ్ళ తిండి తిప్పలు ఆయనవే. దానికి తోడు ప్రతి రోజూ దాదాపు విందు భోజనంలాగే ఉండేది. అంతేకాదు… పనీ పాటా లేదు కదా… అంతేనా… మా పిన్ని గారికి సినిమా వ్యామోహం ఒకటి… సో, ఈ ఏడెనిమిది మందీ ఆవిడకి తోడుగా సినిమా యాత్ర! ఆ ఏడెనిమిది మందిలో నేనూ ఒకడినే!

అంతమంది ఇంటిలో ఉంటే… కూరలు, పచ్చళ్ళు, ఊరగాయలు ఏ లెవెల్లో ఉండాలి? అలా ఆ ఇంటిలో మామూలు పండుగలతో పాటుగా “పచ్చళ్ళ పండుగలు”, ” ఊరగాయ పండుగలు” క్రమం తప్పకుండా ఆచరించే వారు. కొత్తిమీర, టొమెటో, ఉసిరికాయ పచ్చళ్ళు ప్రధానం. ఊరగాయలలో ఆవకాయ, మెంతికాయ, మాగాయి, పులిహోర ఆవకాయ…ఇలా!

పచ్చళ్ళ పండుగ చేయాలంటే ముందు రోజు రాత్రి సెకండ్ షో సినిమాకు వెళ్ళాలి. అది ఏ ఒంటి గంటకో అయేది. తెల్లవారగట్ల నాలుగు గంటలకు చుట్టు ప్రక్కల ఊళ్ళ నుంచి కూరల బళ్ళు వచ్చేవి. అప్పటి వరకూ మెలకువగా ఉండాలి కదా? అందుకని సెకండ్ షో సినిమా మాకు బోనస్! సినిమా అయిపోతుంది. మనకి నిద్ర వస్తుంది. అందుకని సినిమా అయిపోయాక రాజమహేంద్రవరంలో కోటగుమ్మం సెంటర్ కి వెళ్ళే వాళ్ళం. అక్కడ జైహింద్ హోటల్ ఉంది. అది తెరిచే ఉండేది “ప్రజా సేవ” కోసం!

అంత రాత్రి వరకూ ఈ “ప్రజా సేవ”కు కారణం ఏమిటంటే…

ఈ మధ్య “మట్కా” అని ఒక సినిమా వచ్చింది కదా? మా వూళ్ళో ఆ “మట్కా జూదాన్ని ” బ్రాకెట్” అనే వారు. ప్రతి రోజూ రెండు నంబర్ల మీద పందెం కాసేవారు… ఓపెనింగ్ నంబర్, క్లోజింగ్ నంబర్! ఆ సినిమాలో “ఓపెనింగ్ నంబర్ ఉదయం 9 గంటలకు వస్తుంది, క్లోజింగ్ నంబర్ రాత్రి తొమ్మిది గంటలకు వస్తుంది” అని చెప్పారు. అలా కాదు. ఓపెనింగ్ నంబర్ రాత్రి తొమ్మిది గంటలకు, క్లోజింగ్ నంబర్ రాత్రి ఒంటి గంట, రెండూ మధ్య వచ్చేవి. నేను చెబుతున్నది 80వ దశకం సంగతి.

ఈ నంబర్ల మీద పందెం కాసే వాళ్ళ “తెలివి తేటలు” గొప్పగా ఉండేవి. ఇండియన్ ఎక్స్ ప్రెస్ డైలీలో చివరి పేజీలో టార్జాన్ కామిక్స్ వచ్చేది. ఆ బొమ్మలలో ఈ బ్రాకెట్ ఓపెనింగ్ నంబర్, క్లోజింగ్ నంబర్ ఉంటాయని వాళ్ళ నమ్మకం! కొన్ని గ్రూపులుగా కూచుని ఆ టార్జాన్ బొమ్మలని భూతద్దంలో చూస్తూ నంబర్లు వెతికే వాళ్ళు. ఈ బృందాలు మా ఇంటి అరుగు మీద కూచుని ఈ “పరిశోధన” చేసేవాళ్ళు.

వాళ్ళలో సూరి అని ఒక రిక్షా అతను ఉండేవాడు. మా చిన్న తాత ఎక్కడికి వెళ్ళాలి అన్నా అతని రిక్షాలోనే వెళ్ళేవాడు. సూరి చాలా గొప్పవాడు. సంపాదనకు ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్నీ వాడేసే వాడు. చీకటి పడి చుక్క కనపడితే చుక్క పడాల్సిందే! నన్ను “అబ్బాయి గారు” అంటూ పిలిచేవాడు. మా ఇంటి ముందున్న రిక్షా స్టాండ్ లో ఉండే నలుగురైదుగురు రిక్షా వాళ్ళకి నేను “అబ్బాయిగారి”నే.

ఆ రిక్షా సూరిని ఒకసారి అడిగాను “ఆ టార్జాన్ లో ఏముంది అలా చూస్తున్నారు మరీ భూతద్దంలో?” అని.

అప్పుడు సూరి నాకు ఈ బ్రాకెట్ విద్య గురించి బోధించాడు.

అలా బ్రాకెట్ నంబర్ల మీద పందెం కాసి, క్లోజింగ్ నంబర్ కోసం రాత్రి రెండిటి వరకూ వెయిట్ చేసే వాళ్ళ కోసం కోటగుమ్మంలో జైహింద్ హోటల్ తలుపులు తెరిచే ఉండేవి. కానీ ఒకటే ఐటమ్ ఉండేది… వేడి వేడి ఉప్మా! అదేం ఉప్మానో! దానికి అదేమి రుచో! కనీసం మూడు నాలుగు ప్లేట్లు మెత్తగా జారిపోయేవి లోపలికి!

అలా రాత్రి సెకండ్ షో సినిమా అయిపోయాక జైహింద్ హోటల్ ఉప్మా ఆరగించి, దానిపై ఒక స్ట్రాంగ్ కాఫీ తగిలించి, కాల్చే వాళ్ళు సిగరెట్ పొగలు వదులుతూ,  నవిలే వాళ్ళు కిళ్ళీలు బిగించి మా ఇంటి అరుగు మీదకి చేరేవాళ్ళం. కబుర్లు సాగిపోతూ ఉండేవి. తెల్లవారు ఝామున కూరల బళ్ళ ఎడ్ల మెడ గంటల సవ్వడి వినవచ్చేది. అప్పుడు అరుగు మీద నించి లేచి, ఆ బళ్ల వెంటబడి మార్కెట్ కి వెళ్ళేవాళ్ళం. ఊర్వశి ధియేటర్ వెనుక పెద్ద మార్కెట్ అనే  కూరల మార్కెట్ ఉండేది. అక్కడికి మా యాత్ర.

కొత్తిమీర బస్తాలు ఉండేవి. మనకి కట్టలు, కేజీలు ఏం సరిపోతాయ్? ఓ కొత్తిమీర బస్తా రిక్షాలో వేసుకు రావలసిందే! నేనూ, మా మేనత్త కొడుకు కిష్టి గాడు ( కృష్ణమాచార్యులు) ఈ సేవలో చాలాసార్లు తరించాం.

ఇంటికి తెచ్చిన బస్తా లో నుంచి కొత్తిమీర బయటకు తీసి, కాడలు కట్ చేసి ఆరబెట్టడం ఒక పని. ఈ లోగా ఇటుకల పొయ్యి రెడీ అయేది. దాని లోకి కట్టెలు ముందే తెచ్చి పెట్టుకొనే వాళ్ళం. అలాగే ఒక పెద్ద బాణలి కూడా రెడీ.

కొత్తిమీర కాస్త ఆరాక పొయ్యి వెలిగించి, దాని మీద బాణలి ఉంచి నూనె పోసి, వేడి చేయటం మా పిన్ని గారి పని. నూనె వేడయ్యాక ఆ కొత్తిమీర దఫదఫాలు వేస్తూ కలుపుతూ మగ్గబెట్టే పనిలో నేనూ, కిష్టి గాడు, మా పిన్ని గారి చెల్లెలు సీత…

ఆ పని పూర్తయి పోపు పెట్టేసి, దించి ప్రక్కన పెట్టే సరికి తెల్లగా తెల్లారి పోయేది. దంత ధావనం, కాఫీ సేవనం పూర్తి చేసుకొని పడకేస్తే మధ్యాహ్నం భోజనానికి లేవటమే!

ఇలాగే టొమోటో పండగ… ఊరగాయల పండుగ… సాగిపోయేవి.

ఇవికాక “పనస పొట్టు” కూర ఉద్యమం మరొకటి! మా పిన్ని గారి తండ్రి గొప్ప “ఆలూ కుర్మా” స్పెషలిస్ట్!

దేవతార్చనకు ప్రసాదాల తయారితో మొదలైన పాక శాస్త్ర ఉద్యమం పచ్చళ్ళు, ఊరగాయలు, పనస పొట్టు కూర, కుర్మా… ఇలా ఎన్నెన్నో…

అందుకే అప్పుడప్పుడూ నా భార్య అంటూ ఉంటుంది… ” వంటొచ్చిన మొగుడితో వేగడం కష్టమబ్బా!” అని!


Leave a comment