స్వీయ అన్వేషణ – 148
రాజమహేంద్రవరంలో ఉన్న రోజులలో అంటే 1985 కు ముందు సంగతి…
కెనరా బ్యాంక్ ఉద్యోగులు చిలుకూరి వేంకటరామ శాస్త్రి, ఆవంత్స సీతా రామాంజనేయులు ఇద్దరూ సన్నిహితులు అయ్యారు. ఈ ఆవంత్స వారే మాకు గాయత్రీ పరివార్ ను పరిచయం చేశారు. గాయత్రీ హోమాలు మొదలు పెట్టినది ఆయన ఆధ్వర్యవం లోనే.
ఆయన అనేక ఆధ్యాత్మిక సాధన గ్రంథాలు చదువుతూ ఉండేవారు. వాటిలో విశేషాలను మాతో పంచుకుంటూ ఉండేవారు. వాటిలో “ఏస్ట్రల్ ట్రావెల్” ఒకటి. అది గురువు ప్రత్యక్ష పర్యవేక్షణలో సాధన చేయ వలసినదే కానీ ఎవరికి వారు స్వతంత్రంగా ప్రయత్నిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
ఇంతకీ ఏమిటిది? ఒక ప్రశాంత ప్రదేశంలో పడుకొని సాధన ద్వారా మన సూక్ష్మ శరీరాన్ని బయటకు రప్పించి, దానిని వివిధ ప్రదేశాలకు పంపడం.
మన పూర్వీకులు రాత్రి నిద్ర పోయేటప్పుడు మంచం ప్రక్కనే మంచినీళ్ల చెంబు పెట్టుకొనే వారు. దాని మీద తప్పనిసరిగా మూత వేసి ఉంచేవారు. ఎవరైనా ఆ నీళ్లు త్రాగినా వెంటనే మూత పెట్టాలని నియమం. ఒకసారి మా చిన్న తాతను అడిగాను… ” మూత పెట్టకపోతే ఏ బొద్దింకలో, చీమలో దూరతాయని భయమా?” అని.
ఆయన “కొంత వరకూ అదీ నిజమే. కానీ దాని కన్నా పెద్ద కారణం ఒకటి ఉంది. మనం గాఢ నిద్రలోకి వెళ్లిపోయిన తరువాత మన సూక్ష్మ శరీరం బయటకు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. దానికీ, ఈ స్థూల శరీరానికీ లంకెగా ఒక సిల్వర్ థ్రెడ్ ఉంటుంది. అలా అలా తిరుగుతూ ఉంటుంది. దానికీ దాహం ఉంటుంది. పొరపాటున మూత తీసి ఉన్న చెంబులోనికి వెళ్లి, అదే సమయంలో ఎవరైనా మూత పెట్టేస్తే అది అందులోనే ఉండిపోతుంది. ఆ సిల్వర్ థ్రెడ్ తెగిపోతుంది. బయటకు రాదు. అప్పుడు ఈ నిద్రలో ఉన్న మనిషి ఇంక లేవడు. ప్రాణానికే ప్రమాదం” అని చెప్పారు.
నాకు అర్థమూ కాలేదు, నమ్మ బుద్ధీ కాలేదు. ఎప్పుడో ఎన్నో ఏళ్ల తరువాత లోబోసాంగ్ రాంపా వ్రాసిన ” Third Eye” చదివినప్పుడు ఈ లంకె గురించి అర్థం అయింది.
ఆవంత్స వారు ఏ గురువు పర్యవేక్షణ లేకుండానే కేవలం గాయత్రీ మంత్రం ఆలంబనగా ఈ సాధన చేశారు. కొంత వరకూ సాధించానని, అయితే ఎక్కడో దారి తప్పుతోందని అనేవారు.
నేను ఈ సాధన చేసే సాహసం ఎప్పుడూ చేయలేదు. కానీ ఒకసారి అనుకోకుండా అది జరిగింది. గమనించరు కానీ చాలా మందికి ఆరుబయట పడుకున్నప్పుడు ఇది జరిగే అవకాశం ఉంది.
మా చిన్నాన్న దాసు గారి డాబా మీద పడుకొనే వాళ్ళం అప్పుడప్పుడు. అప్పుడు ఆకాశం మరీ దగ్గరగా అనిపిస్తుంది. అది అమావాస్య నాడు అయితే కేవలం నక్షత్రాలు గుంపులు గుంపులుగా ఉండి మరీ దగ్గరగా కనిపిస్తుంది. ఒక అమావాస్య రోజు ఒక్కడినీ ఆ డాబా మీద పడుకొని చుక్కల గుంపులతో నిండి పోయిన ఆకాశం వైపు ఏకాగ్రంగా చూస్తున్నాను. నక్షత్రాలు చేతికి అందుతున్నట్టుంది. కొద్ది సేపటికి విచిత్రమైన అనుభవం కలిగింది. నేను మెల్ల మెల్లగా పైకి వెడుతున్నాను. కొంత సేపటికి మరి కొంత వేగంగా వెడుతూ ఉన్నాను. దాదాపు చుక్కల మధ్యకు వెడుతున్నట్టు అనిపించింది. ఒక్కసారిగా భయం వేసింది. ఉలికి పడ్డాను. అంతే! ఆ అనుభవం ముగిసిపోయింది! ఇది నేను ప్రయత్నించింది కాదు! యాదృచ్ఛికంగా జరిగింది. ఆ తరువాత నేను ఎప్పుడూ ఒంటరిగా ఆ డాబా మీద పడుకోలేదు.
తరువాత ఆవంత్స వారు ఒక విచిత్రమైన సాధన చెప్పారు.
“మనం ఒక దృశ్యాన్ని చూస్తూ ఉండాలి. దానితో పాటు శబ్దమూ ఉంటుంది. మనం చేయవలసినది ఏమిటి అంటే చూస్తూన్న దృశ్యం కనపడ కూడదు. కేవలం శబ్దమే వినపడాలి. ఇది వచ్చిన తరువాత దృశ్యమే కనపడాలి కానీ శబ్దం వినపడ కూడదు. ఇలా సాధన చేయటం వల్ల దృశ్యం, శబ్దం మీద మనకి అధికారం వస్తుంది. అప్పుడు మనం ఏ సాధన చేస్తున్నా, జపం చేస్తున్నా మన చుట్టూ ఉన్న దృశ్యాలను, శబ్దాలను కనపడకుండా, వినపడకుండా ఆపేసి, ఏకాగ్రంగా మన సాధన మనం చేసుకోవచ్చు!”
ఇదేదో బాగుంది అనిపించింది. శాస్త్రి గారూ, నేనూ మొదలు పెట్టాం. నిరంతరంగా దృశ్యం, శబ్దం దొరికే స్థలం ఏది? సినిమా!
రోజూ సినిమాకు వెళ్ళేవాడిని. కళ్ళు తెరుచుకొని చూస్తున్నా ఎదురుగా ఉన్న సీన్ కనపడ కూడదు. చాలా రోజులు ఈ ప్రయత్నం చేశాను. దాదాపు రెండు నెలల కాలంలో అది సాధించ గలిగాను. అలాగే సీన్ చూస్తున్నా డైలాగ్ వినపడ కూడదు. మరో రెండు నెలలు. అదీ వచ్చింది. తరువాత కళ్ళు తెరుచుకుని చూస్తున్నా, చెవులు పని చేస్తున్నా సీన్, డైలాగ్ రెండూ కట్ చేసేయటం. అదీ వచ్చింది.
ఆ ప్రయత్నం చేస్తున్న రోజులలోనే హైదారాబాద్ ఆంధ్రపత్రిక లో ఉద్యోగం రావటంతో రాజమహేంద్రవరం వదలి వచ్చేశాను. ఈ హైదారాబాద్ లో అడుగు పెట్టిన నాటి నుంచీ పూజ్య గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషీజీ పరిచయం అయే వరకూ దాదాపు తొమ్మిదేళ్ళ విలువైన కాలం … ఏ సాధన లేని కేవల లౌకిక ఉద్యోగ జీవితంలో మునిగి పోయాను.
Leave a comment