స్వీయ అన్వేషణ – 149
అవును… ఎవరికి ఎవరు ఈ లోకంలో?… ఆ పాట వింటూంటే నిజమే కదా అనిపించదూ?
లోకంలో ఉన్న మీ జీవితంలో ఎంతో మంది ప్రవేశిస్తారు… నిష్క్రమిస్తారు. తెలుగు భాగవతంలో పోతన గారు ఒక పద్యం వ్రాశారు. తమాషా ఏమిటంటే ఆ సందర్భం కాదు… ఆ మాటలు చెప్పిన పాత్ర!
హిరణ్యాక్షుని మరణం తరువాత తల్లి కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడు ఆమె మరొక కుమారుడైన హిరణ్యకశిపుని నోట గొప్ప మాట పలికించారు పోతన మహాకవి…
“నీరాగార నివిష్ఠ పాంథుల క్రియన్ జనంబులు వత్తురు, కూడి, విత్తురు, సదా సంగంబు లేదొక్కచో…”
వేసవి కాలంలో బాటసారుల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు పెడుతూ ఉంటారు. బాటసారులు ఆ చలివేంద్రాలలోకి చేరుతారు. కలుస్తారు, దాహం తీర్చుకొని, కాస్సేపు విశ్రమించి, వెళ్ళిపోతారు. ఎప్పటికీ కలిసి ఉండటం అనేది ఎప్పుడూ ఉండదు!
నిజం కాదూ? ఈ లోకం ఒక చలివేంద్రం. మనం అందరం బాటసారులమే కాదూ? ఇక్కడికి వచ్చాం, ఎందరెందరో కలిశారు, కబుర్లు చెప్పుకొన్నాం, నవ్వుకొన్నాం, ఏడ్చాం, తిట్టుకొన్నాం, కొట్టుకొన్నాం, ఆడుకొన్నాం, పాడుకొన్నాం… ఒక్కొక్కరూ వెళ్ళిపోతున్నారు. ఎప్పటికీ కలిసి ఉంటున్నామా? లేదు కదూ?
మా మాష్టారు శరభయ్య గారు ఒక ప్రసంగంలో… ” నా చిన్నప్పుడు అందరూ నా కన్నా పెద్దవాళ్ళే కనిపించేవారు. కొంత కాలానికి పెద్దవాళ్ళు, నా సమ వయస్కులు కనిపించేవారు. మరి కొంత కాలానికి పెద్దవాళ్ళు తక్కువై, సమవయస్కులే ఎక్కువ కనిపించేవారు. ఇంకొంత కాలానికి పెద్దవాళ్ళు మాయమై, నాతో సమ వయస్కులు, నా కన్నా చిన్నవాళ్ళు కనిపించారు. ఇంకొంత కాలం జరిగాక నా సమ వయస్కులు కూడా తగ్గుతూ నా కన్నా చిన్నవాళ్ళు ఎక్కువ కనిపించటం మొదలైంది. మరి కొంత కాలం గడిచింది. అందరూ నా కన్నా చిన్నవాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు ఇప్పుడు” అన్నారు. ఇదెప్పుడైనా గమనించామా?
మన జీవితంలోకి ప్రవేశించిన వాళ్ళు కొన్ని వర్గాలుగా ఉంటారు… స్నేహితులు, బంధువులు, పరిచయస్తులు, సహచరులు, సహ ప్రయాణికులు… ఇలా.
మనం… లేదూ… నేను జీవితంలో చేసిన ఒక పెద్ద తప్పు ఒకటి ఉంది! ఒకటే ఉందా? చాలా ఉన్నాయ్! కానీ మనుషుల విషయంలో ఒక తప్పు చేశాను… ఖచ్చితంగా చేశాను.
ఇప్పుడు నేను చెప్పిన అన్ని వర్గాల వారినీ స్నేహితులు అనుకోవడం! వారితో ఒక “బంధం” ఏర్పరచుకోవడం! అది ఎంతో కొంత బలపడటం! అదీ నేను చేసిన పెద్ద తప్పు. బంధువర్గం, రక్త సంబంధీకుల విషయం ప్రక్కన పెడితే… ఆ “ప్రహసనం” వేరే కథ! మిగిలిన వారిలో పరిచయస్తులు, సహచరులను కూడా “స్నేహితులు” అనుకోవడం… ఆ “విచక్షణ” లేకపోవడం… అజ్ఞానం కాదూ?
“పుస్తకాలు బోలెడన్ని చదవటం వల్ల లోకజ్ఞానం రాదు… లోకంలో తిరగాలి” అని ఊరికే అన్నారా? సాహిత్య శాస్త్రంలో “పర గత సుఖ దుఃఖములు తనవిగా భావించడం సత్వ గుణం” అని చదువుకొని, అదే నిజం అనుకొని బ్రతికితే… చివరికి నాలాగ “అజ్ఞాని”గా మిగిలిపోవడం ఖాయం!
జీవితంలో రక్త సంబంధీకులే నీ చేత “రక్త కన్నీరు” పెట్టించేస్తే లోకంలో ఇంక దిక్కెవరు?
“ఈ మనిషి నాకు అన్నిటిలో తోడున్నాడు!” అని ఒక్కరినైనా చూపించుకో గలుగుతున్నామా?
“దిక్కులేని వారికి దేవుడే దిక్కు” అంటారు కానీ…
కనిపించే మనుషులే తోడు నిలవకపోతే… కంటికి కనిపించని దేవుడు మాత్రం ఎలా తోడు వస్తాడు?
ఆ దేవుడు ఎక్కడుంటాడు? వేదాంత శాస్త్రాలు ఎన్నాన్నా చెప్పనీ… అదంతా నూటికి తొంభై తొమ్మిదిన్నర శాతం మందికి తెలియదు కదా? తెలియదు అంటే … అదేదో ఉపనిషత్తులో చెప్పారు, ఇదేదో ప్రవచనంలో చెప్పాడు… అనటమే కానీ నువ్వు చూశావా? ఆ దేవుడు నీ అనుభవంలోకి వచ్చాడా? లేదు కదా?
మరి ఎలా తోడు నిలుస్తాడు?
ఆ దేవుడు ఎవరో, ఎక్కడున్నాడో నీకు తెలియదు… నువ్వు చదివిన పుస్తకాల్లో లేడు…
మరి ఎలా?
ఆ దేవుణ్ణి నీకు చూపించే వారు ఎవరు?
ఆ దేవుణ్ణి నీ అనుభవం లోనికి తెచ్చేవారు ఎవరు?
నీ జీవితాన్ని భగవదనుభవమయంగా మార్చేది ఎవరు?
ఎవరు ఎవరు అనే విచక్షణ కలిగించేది ఎవరు?
జీవితంలోని వివిధ బంధాల నిజ స్వరూపాన్ని నీ కళ్ళ ముందు “నగ్నం” గా నిలబెట్టేది ఎవరు?
ఇంకెవరు?
ఆ పరబ్రహ్మ స్వరూపుడైన “శ్రీగురుదేవులు” మాత్రమే కాదూ?
ఎవరికి ఎవరూ కాదు. ఎవరికి ఎవరూ లేరు.
ఒకటే తారక మంత్రం…
” శ్రీ గురు చరణ కమలేభ్యో నమః!”
Leave a comment