” కరిగిన కాలం!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 164

అఖండమైన కాల ప్రవాహంలో మరొక ఏడాది కొట్టుకొని పోయింది ఎప్పటిలాగే!

ఈ ఏడాదిలో సాధించింది ఏమిటి? అంటే… ఈ ఏడాది మాత్రమేనా?

అసలు ఏ ఏడాదిలో అయినా సాధించినది ఏముంది కనుక?

ఏమీ కనపడ్డం లేదే!

అసలు ఎలా బ్రతకాలి అనుకున్నామో అలా బ్రతుకుతున్నామా? అనేది అందరం వాటంగా మరచిపోయే ప్రశ్న!

ఎందుకంటే… సమాధానం కటువైన నిజం కాబట్టి! మనం అనుకున్నట్టు బ్రతకడం లేదు అన్నది సత్యం కాబట్టి…

“ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ అవుతాయా?” లాంటి డైలాగ్ ఏదో సినిమాలో విన్నా. సరిగ్గా అలాగే ఉంటాయి అందరి బ్రతుకులూను.

ఆంధ్రపత్రికలో ఉన్న రోజుల్లో ఎందుకో ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కి వెళ్ళాను. ఎందుకు వెళ్ళానో ఇప్పుడు గుర్తు లేదు.

అలా వెళ్ళి ఆ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఆటో దిగి, ఆ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా నిలబడి ఆ భవనాన్ని చూడగానే ఏదో “మోహం” కమ్మేసింది. ఆ భవనంతో “ప్రేమ”లో పడిపోయాను. ఆ బిల్డింగ్ లో చదువుకుంటే ఎంత బాగుంటుంది? అక్కడ చదువుకుంటున్న వాళ్లు ఎంత అదృష్టవంతులు? అనుకున్నాను.

ఆ బిల్డింగ్ లో చదువుకోవాలి అంటే తెలుగులో ఎం. ఎ క్లాస్ లో చేరాలి. అది రెగ్యులర్ కోర్స్ కదా? దానిలో చేరాలంటే పెద్ద అడ్డంకి నా ఆంధ్రపత్రిక ఉద్యోగం! ఉద్యోగమా? చదువా?

“బ్రతుకు” ఈ సమస్యని ఒక్క క్షణంలో తీర్చేసింది. ఉద్యోగమే! చదువు కాదు! కానే కాదు! బతకాలి కదా ఈ మహానగరంలో?

కానీ… తెలుగు శాఖలో ఉన్న ఆచార్య కసిరెడ్డి వేంకటరెడ్డి గారితో, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారితో ఏర్పడిన సాన్నిహిత్యం వల్ల చాలాసార్లు ఆ భవనంలో వారితో కొంతసేపు గడిపి వచ్చిన తృప్తి మాత్రం మిగిలింది. దూర విద్యా విభాగంలో తెలుగు ఎం ఎ చేస్తూ ఫైనల్ పరీక్షలు వ్రాయటానికి ఆ ఆర్ట్స్ కాలేజ్ భవనమే సెంటర్ కావటం అదొక తృప్తి!

ఇలా మనం కావాలి అనుకున్నవి పొందటానికి “బ్రతుకు” అడ్డం పడుతుంది. మనం బతకాలి అనుకున్నట్టు బ్రతకనివ్వదు ఈ “బతుకు”!

చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం విని ఉన్న ప్రాణం హైదరాబాద్ వచ్చాక హిందుస్థానీ సంగీతంతో ముడి పడి, సితార్ మీద మనసు పారేసుకుని, కొంతలో కొంత వీణతో పరిచయం ఉండటం వల్లనూ సితార్ నేర్చుకోవాలని మరో కోరిక!

దానికీ బతుకూ, దానికి ఆధారమైన ఉద్యోగమే అడ్డంకి! షిఫ్ట్ ఉద్యోగాల బతుకు కదా మనది ఆంధ్రపత్రిక దినపత్రికలో! ఏ సంగీత కళాశాలలో చేరగలం?

చార్ట్ ల మీద బ్రష్, ఇండియన్ ఇంకులతో సాధన చేసిన చిత్రకళ మాయమైపోయింది ఈ బతుకు వల్లనే కదా?

ఇలా క్షణ క్షణం “బతుకు” అడ్డం పడి “బ్రతుకు”ను మాయం చేస్తుంది! కాదంటారా?


Leave a comment