స్వీయ అన్వేషణ – 165
“చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం” అంటే ఇదే మరి!
అరవై ఆరేళ్ళు గడచి పోయాక కానీ అర్ధం కాని జీవిత సత్యం ఇది!
చుట్టూ మనుషులుంటే ఎంత బాగుంటుందో కదా?
ఆ మనుషులు “మన”వాళ్ళు అయితే ఇంకెంత బాగుంటుందో కదా?
ఇలా అందరమూ అనుకుంటాం కదా?!
దానికి…
మనుషుల మధ్య సంబంధాలు ఉండాలి. బాంధవ్యాలు ఉండాలి. అనుబంధాలు ఉండాలి. బాధ్యతలూ ఉండాలి. నిజమే…
కానీ…
ఆ మనుషుల మధ్య…
దాపరికాలు ఉండకూడదు. స్వార్థాలు ఉండకూడదు. “నోరు నవ్వి నొసలు వెక్కిరించే” బుద్ధి ఉండకూడదు. నమ్మకాన్ని “వాటం”గా వాడేసుకునే “తెలివితేటలు” ఉండకూడదు.
క్రమంగా మొదటివి మాయమైపోయి, రెండవ లక్షణాలు పెరిగిపోతున్న సమాజంలో బతుకుతున్నాం. కాదంటారా?
“కుటుంబం” అనే ఒక వ్యవస్థ ఒకప్పుడు గంగానదిలా ఉండేది. పవిత్రంగా ఉండేది. “ఒకరికొకరు” అన్నట్టు బతికే మనుషులు ఉండేవారు. అలాటి కుటుంబాన్ని, అలాటి మనుషులని నేను చూశాను.
క్రమంగా ఆ గంగానదిలో “పారిశ్రామిక కాలుష్యం” చేరినట్టే కుటుంబాల్లోకీ “మానసిక కాలుష్యం” చేరింది… దాహం పెరిగింది… “అంతా నేనే, అన్నీ నేనే ” అనే వాళ్ళు తయారయ్యారు. హిరణ్యాక్షుడు భూమినంతా చాపగా చుట్టేసి, చంకనెట్టుకుని పోయాట్ట! అలాగే కుటుంబంలో అంతా చుట్టేసే హిరణ్యాక్షులు పుట్టుకొచ్చారు.
“ఒకరికొకరు” అని బతికిన కుటుంబంలో “అందరితో నేను, అందరి కోసం నేను” అనేది కనుమరుగైపోయి, “అందరూ నా కోసమే, అన్నీ నావే” అనే “ఘాతకులు” అవతరించారు. వాళ్ళు కొత్తగా పుట్టుకొచ్చారా? లేదు… ఉంటారు… అదను చూసుకొని ముసుగు తీసేస్తారు… అంతే!
కాలం గడిచింది… సంకీర్తనాచార్యుడు అన్నమాచార్యుడు చెప్పిన మాట అనుభవంలోకి వచ్చింది…
” ఎంత విభవము కలిగిన
అంతయును ఆపదయని
తెలిసినది కదా తెలివి!”
ఆ “తెలివి” మనకి లేకపోవటం ఎదుటివాడి తప్పు కానే కాదు!
” కాస్త ముందు తెలిసెనా ప్రభూ!
ఈ మందిరమిటులుంచేనా?” అన్నట్టు అన్నమయ్య మాట కాస్త ముందుగా తెలిసి ఉంటే వేరేలా ఉండేదేమో!
కానీ…అలా ముందే తెలిస్తే మనిషి దేవుడే అయిపోడూ?
అయినా చప్పట్లు కొట్టి సెలబ్రేట్ చేసుకోవటానికి అయితే రెండు చేతులు కావాలి కానీ, జేబులు కొట్టేయడానికి ఒక్క చెయ్యి చాలదూ? ఒడుపు, అదను తెలిసిన ఆ హస్త లాఘవం ముందుగా ఎలా తెలుస్తుంది? తెలియదు కదా?
విశ్వనాథ వారు తన తమ్ముడు రామమూర్తి గారి గురించి చెబుతూ…
” తమ్ములు రామచంద్రునకు తమ్ములు ఊహ ఎరింగి చేయగా/ తమ్ములు ధర్మరాజునకు తమ్ములు చెప్పినయట్లు చేయ, నా/ తమ్ములు నట్టి రందు చినతమ్ముడు సన్మతి రామమూర్తి చి/ త్తమ్మున నేను వాని కొక దైవముగా కనిపింతు నెంతయున్”
“శ్రీరామచంద్రుని తమ్ములు ఆయన ఊహ/ ఆలోచనను తెలుసుకొని దానికి అనుగుణంగా ఆ పని చేసేవారు. ధర్మరాజు తమ్ములు ఆయన చెప్పినట్టు చేసేవారు” ఇక్కడి దాకా తీసుకుందాం.
ఏరీ ఆ అన్నలు? ఆ తమ్ములు? ఆ అన్నలుంటే ఆ తమ్ములు లేరు! ఆ తమ్ములు ఉంటే ఆ అన్నలు లేరు! అవునా? కాదా?
కుటుంబంలో మాత్రమేనా? మన చుట్టూ ఉన్న సమాజంలో మాత్రం ఇలాటి ముసుగు దొంగలు లేరూ? ఆ ముసుగు తొలగిపోయే వరకూ, జేబు కొట్టేసే వరకూ తెలియదు కదా?
ఆ “ముసుగు”లో దాక్కున్న మనిషిని గుర్తు పట్టలేక పోవటం మన తప్పు!
ఇది అర్ధం అయేసరికి “పుణ్యకాలం” కాస్తా గడిచిపోతుంది!
“ఆలస్యం అయిపోయింది!” అనుకుని ఏం లాభం?
Leave a comment