స్వీయ అన్వేషణ – 166
అవును… వదిలేయ్… వదిలేయాలంతే! అంతే!
నీ పక్కనే ఉన్నారు… నీతోనే ఉన్నారు.
కానీ… నీ సుఖ దుఃఖాలతో సంబంధం లేదు!
నీ కష్టాలు కడగండ్లతో సంబంధం లేదు!
ఎందుకు వాళ్ళు?
వదిలేయ్… వదిలేయాలంతే… అంతే!
నువ్వు కూడా రెండు “మనసు”లతో బతకటం నేర్చుకో!
వాళ్ళ కోసం ఒక “మనసు”, నీ కోసం ఒక “మనసు”! తప్పదు.
వినటానికి, శ్రద్ధగా వినటానికి, కనీసం శ్రద్ధగా వింటున్నట్టు కనపడటానికి ఒక “మనసు”ను కేటాయించు.
నీ సుఖదుఃఖాలు, కష్టాలు కడగండ్ల పరిష్కారం కోసం నీ సొంత నిర్ణయం తీసుకోవటానికి ఒక దృఢమైన “మనసు”ను నీలోనే దాచుకో!
ఒకరి మీద నమ్మకం పెట్టుకోవడం అంటే నీ బతుకుని వాళ్ళ చేతుల్లో పెట్టేయటమే!
ఒకవేళ ఆ “నమ్మకం” నిన్ను దెబ్బ కొడితే నీ బతుకు అంధకారంలోకి పోయినట్టే!
ఎటు పోవాలో తెలియని చీకట్లోకి మునిగిపోవటమే!
అది నీ బతుకుని అయోమయంలో పడేయటం మాత్రమే కాదు…
నీ మనసుని కోలుకోలేని దెబ్బ తీస్తుంది.
అందుకే రెండు “మనసు”లు అవసరం!
నీకు ఓపిక ఉన్నంతసేపు వాళ్ళని ఆడుకోనీ! ఎంతసేపని ఆడుకుంటారు వాళ్ళు మాత్రం? ఎంతటి ఆటగాడికైనా ఏదో క్షణంలో అలుపు రాదూ? సరిగ్గా అదే బ్రేకింగ్ పాయింట్!
ఓపిక పట్టినంత కాలం పెట్టావ్! “ఇంకానా? ఇంక చాలు!” అనిపించిందా?
ఆ క్షణమే వదిలేయ్… వదిలేయాలంతే… అంతే!
ఎదుటి వాడు అలసిపోక పోయినా, నీ ఓపిక నశిస్తే… అదే సరైన క్షణం… నీ బతుకుని నీ చేతుల్లోకి తీసుకోవటానికి!
అప్పుడు కనక తటపటాయించావా…అంతే సంగతులు… ఇంక నిన్ను నువ్వు కూడా రక్షించుకోలేవు!
Leave a comment