“నేను నీ అధీనం!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 168

మనం కలిశామా ఎక్కడైనా?

మనం మాట్లాడుకున్నామా ఎప్పుడైనా?

కలిసినట్టే ఉంది…

కానీ గుర్తు లేదు!

మాట్లాడుకున్నట్టే ఉంది…

కానీ గుర్తుకు రావటం లేదే!

అసలు ఈ “గుర్తు”కు రావటం ఏవిటి?

ఒక అనుభవం కలిగి, కొన్నాళ్ళకు మనసు తెరల్లోకి జారిపోయి, మళ్ళీ ఎప్పుడో ఆ అనుభవ సంబంధిత వ్యక్తులు ఎదురు పడినప్పుడు, ఆ అనుభవం మనసు అట్టడుగు పొరల నుంచి చీల్చుకొని బయటకు రావడమే కదా?

కానీ… ఇప్పుడేవిటీ ఇలా ఉంది?

కలిసీ కలవనట్టు…

మాట్లాడుకొనీ మాట్లాడుకోనట్టు…

ఎందుకిలా ఉంది?

ఏమో?

కొన్ని అంతేనేమో!

సన్నని మంచు తెర వెనుక దృశ్యంలాగా …

మేలిముసుగులో అస్పష్టంగా తెలిసీ తెలియనట్టున్న కాళిదాసు శకుంతల వదనారవిందంలాగ…

ప్రతి క్షణం కలుస్తూనే ఉన్నట్టుంది!

ప్రతి క్షణం మాట్లాడుకుంటూ ఉన్నట్టే ఉంది!

ప్రతి క్షణం అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నట్టే ఉంది!

కానీ… గుర్తుకు రావటం లేదే!

నీ అవ్యాజ కరుణామయ హృదయంతో ఎంత మందిని నా బ్రతుకులోకి తీసుకువచ్చి పరిచయం చేశావో!

బ్రతుకును చక్కదిద్దుకోవటానికి ఎన్నెన్ని అనుభవాలను, అవకాశాలను దోసిళ్ళ కొద్దీ గుమ్మరించావో నా ముందు!

ఎంతమంది చేత ఎన్ని పాఠాలను చెప్పించి, వాళ్ళని నిర్దాక్షిణ్యంగా నా బ్రతుకు నుంచి తీసి అవతలికి విసిరి పారేశావో!

తెలుస్తూనే ఉంది… కానీ… తెలియనట్టుగా  ఉంది!

ఆ అనుభవాలనూ, అవకాశాలనూ పట్టించుకోకుండా, కురుక్షేత్ర మహాసంగ్రామ ప్రారంభానికి ముందు అర్జునుడిలాగ “శోకింప దగని వారి గురించి శోకిస్తూ” నిన్ను నిర్లక్ష్యం చేశానని కోపగించుకున్నావా? లేదే! నీ అవ్యాజ కరుణ అలాగే నిరంతర వర్షంలాగా నా మీద కురిపిస్తూనే ఉన్నావ్!

అయినా… నిన్ను కలిసినట్టు, మాట్లాడినట్టు, నీతో అడుగు కలిపి నడచినట్టు అనిపించటం లేదు!

నా వెంట నీడలా నువ్వు ఎప్పుడూ నడుస్తూనే ఉన్నావ్! కానీ నిన్నెందుకు గుర్తు పట్టలేక పోతున్నాను?

ఓ జీవితమా! నీకు కృతజ్ఞతా పూర్వక నమస్సులు!

“బ్రతుకు” ఊబిలో మునిగిపోయి, ఓ జీవితమా! నిన్ను గుర్తు పట్టలేక పోతున్నాను… అని ఇప్పుడిప్పుడే అర్థం అవుతూ ఉంది!

నువ్వు గుర్తుకు రాకపోయినా…

నువ్వు నేర్పిన పాఠాలు గుర్తు చేసుకుని నా దారిని సరిదిద్దుకుంటాను!

నువ్వు గతంలో నా ముందు గుమ్మరించిన అనుభవాలను, అవకాశాలను వెతికి వెతికి పోగేసుకుంటాను!

ఇక నుంచీ నువ్వు నా వెంట నడవడం కాదు… నీ వెంట నేను నడుస్తాను!

ఓ జీవితమా! ఇక నేను నీ అధీనం!


Leave a comment