“ఏది కష్టం?”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 169

అవును… ఎప్పటికీ ఈ సందేహం తీరేట్టు లేదు!

ఏది కష్టం?

” నువ్వు లేవు, నీ పాట ఉంది” అన్నాడు బాలగంగాధర తిలక్… అదృష్టవంతుడు…”నువ్వు” లేకపోయినా కనీసం “నీ పాట” అయినా ఉంది అతగాడి దగ్గర!

నిజంగా అదృష్టమేనా?

కానీ…

నువ్వూ, నీ పాటా రెండూ లేవే నా దగ్గర!

ఏది కష్టం?

నువ్వు లేకపోయినా నీ పాట ఉండటమా?

నువ్వూ, నీ పాటా రెండూ లేకపోవటమా?

ఏది కష్టం?

“నువ్వు లేకపోయినా నీ పాట ఉంటే నువ్వు దగ్గర ఉన్నట్టే ఉంటుందిగా?” అంటారా?

అదెంత బాధ? మరింకెంత కష్టం?

నీ పాట ఎదురొచ్చినప్పుడల్లా నువ్వు లేవనే ఆలోచన రేకెత్తి కత్తి రెండంచులా గుండెను కోసేయదూ?

ఎంత కష్టం అదీ?

మరి నువ్వూ, నీ పాటా రెండూ లేకపోతే?

అది ఛాతీని చీల్చి గుండెను చేత్తో పట్టుకుని పెకలించుకొని పట్టుకుపోయినట్టు ఉండదూ?

మిగిలింది ఒక మహా శూన్యమూ, భయంకర నిశ్శబ్దమూ కదూ?

మరి అదెంత కష్టం?

ఇంతకీ ఏది కష్టం?

“గర్భ”గుడిలో నిద్రాణంగా ఉన్న నాలోకి మొదటి ఊపిరి నాకు తెలియకుండానే  మెల్లగా ప్రవేశించినప్పుడు కదూ నీ మొదటి అమృత హస్త స్పర్శ!

ఆ సుమకోమలమైన నీ మునివేళ్ళతో నా అనామక హృదయాన్ని అలవోకగా స్పృశిస్తూ అనేకానేక జన్మల రహస్యాలను నా చెవిలో మధురంగా గానం చేసినప్పుడు కదూ మన మొదటి సంభాషణ!

అప్పుడే కదూ నాకు ఎదురయ్యే సంఘర్షణలను, సంతోషాలనూ కూడా విడమరచి జీవన గీతను బోధించావూ!

ఆ నువ్వు, ఆ నీ పాట ఏమైపోయాయి!

నిద్ర తేరుకొని, “గర్భ” గుడి నుంచి బయటకు తలపెట్టి  ఈ లోకంలోకి ప్రవేశించిన క్షణం, కళ్ళు తెరిచి ఈ లోకాన్ని చూసిన క్షణం… నువ్వూ, నీ పాటా రెండూ అదృశ్యమై పోయాయి కదూ!

అందుకేనేమో అప్పుడు క్యారుమని ఏడ్చింది! అప్పటివరకూ నెమరు వేసుకొన్న జన్మజన్మల సుఖ దుఃఖ అనుభవాలు రెండూ ఎండవేడికి కరిగిపోయిన మంచు తెరలా మాయమైపోయి, వాటితో పాటే నువ్వూ, నీ పాటా నా నుంచి దూరమై పోలేదూ? ఆనాటి ఆ దుఃఖం ఇంకా అలాగే తెలియకుండానే నాలో ఎక్కడో ఏదో మూల నిశ్శబ్దంగానైనా ప్రతిధ్వనించటం లేదూ?

ఇది కదూ అసలైన కష్టం?

ఇది కదూ నిజమైన దుఃఖం?

ఇది కాదూ సృష్ట్యాది నుంచీ నాతో కలసి ప్రవహిస్తున్న విషాద గీతం?

ఈ కాలఖండంలో నేను కళ్ళు తెరిచినప్పటి నుంచీ నువ్వూ , నీ పాటా రెండూ నా దగ్గర లేవు!

అదెంత కష్టం? చెప్పుకోగలనా?

చెప్పుకోవాలన్నా ఎవరున్నారు నా దగ్గర? నువ్వు లేవుగా? నన్ను నేను ఓదార్చుకోవడానికి నీ పాటా నా దగ్గర లేదే?

ఇదెంత కష్టమో కదూ?

బాలగంగాధర తిలక్ “నువ్వు లేవు, నీ పాట ఉంది” అంటూ తృప్తి పడ్డాడేమో?

బాలగంగాధర తిలక్ “అమృతం కురిసిన రాత్రి” లో తడిసి పులకించాడేమో?

నాకు అది సాధ్యం కావటం లేదే!?

నాకు నువ్వూ, నీ పాటా రెండూ కావాలి!

నాకు అమృతం కురిసిన రాత్రి కాదు, నీ గానంతో ఉదయించే ఉషస్సు కావాలి!

ఇలా అని వదలి వేస్తానని అనుకున్నావేమో?

వెతుకుతాను, వెతుకుతూనే ఉంటాను…

నువ్వు దొరికే వరకూ!

నిన్నూ, నీ పాటను మళ్ళీ నా నిండా నింపుకునే వరకూ!

ఓ జీవితమా!

ఓ జీవన గీతమా!

ఓ జీవిత పరమార్ధమా!

నిన్ను మళ్ళీ నాలో నిలుపుకోవడమే నా సాధన!


Leave a comment