” అలసట లేదు…రాదు!’

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 170

నీకు తెలియదేమో…

నిన్ను వెతకడంలో నా కళ్ళకు

అలసట లేదు… రాదు!

ఈ యుగయుగాల వెతుకులాటలో

అలసట లేదు… రాదు!

నీకు తెలియదేమో…

నా శ్వాస సూత్రాన్ని నీతో అనుసంధించిన క్షణమే నువ్వు నాలో అవిభాజ్య భాగానివి అయిపోయావ్!

నువ్వు నాకు ఎంత దూరంగా వెళ్ళిపోయినా… నువ్వూ, నేనూ ఒకటే… అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ!

తెంచుకున్నానని అనుకుంటున్నావేమో… ఎంత అమాయకత్వం నీది!

ఎన్ని సార్లు ఈ ఊపిరి పోలేదూ? మరో రూపంలో ఎన్నెన్నిసార్లు మళ్ళీ మళ్ళీ తిరిగి రాలేదూ!

జన్మలు మారినా, కాలాలు మారినా నువ్వూ, నేనూ మళ్ళీ మళ్ళీ పుట్టడం లేదూ? కలవటం లేదూ? విడిపోవటం లేదూ?

అయినా ఫరవాలేదు… మళ్ళీ మళ్ళీ కలుస్తున్నాం కదా!

అలా కలిసి కలిసీ… విడిపోయి విడిపోయీ…మళ్ళీ మళ్ళీ కలిసి కలిసీ… ఎప్పటికో ఒకప్పటి నువ్వే అలసిపోయి… మళ్ళీ విడిపోకుండా కలిసిపోవా?

నేను ముందే చెప్పానుగా…

“నిన్ను వెతకటంలో నా కళ్ళకు అలసట లేదు… రాదు!

ఈ యుగయుగాల వెతుకులాటలో అలసట లేదు… రాదు!

నిన్ను కట్టిపడేసిన నా శ్వాస సూత్రాన్ని ఎన్ని యుగాలు గడిచినా నువ్వు మాత్రం తెంచుకొని పోలేవు! ఎవరూ తెంచనూ లేరు!

కానీ…

ఇది అంతు లేని ప్రయాణం అని తెలుసు.

గమ్యాన్ని చేరే ఆశ తప్ప చేరుతామో, లేదో తెలియదు.

ఇది బ్రతుకు కడలిలో ఒంటరి నావ పయనం అనీ తెలుసు.

కానీ అక్కడెక్కడో మినుకుమినుకు మంటున్న దీపంలా నువ్వు!

అటే కదా నా చూపు…

అటే కదా నా శ్వాస సూత్రాన్ని బిగించిన నువ్వు!

అటే కదా యుగయుగాల దాహంతో నేను ఎదురీదుతూ వస్తున్నది!

ముందే చెప్పాను కదా…

ఈ వెతుకులాటలో నా కళ్ళకు, పయనానికీ అలసట లేదు… రాదు!


Leave a comment