“కాళిదాసు ప్రశ్న -2”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 181

మనిషి జీవితంలో ఈ రోజు ప్రధానమైన అంశం డబ్బు. దాని ముందు మరేదీ పనికిరాని దశ వచ్చింది. మనిషికి అవసరాలు, సౌకర్యాలు, భోగాలు అనే మూడు ఉంటాయని ఆధునిక ఆర్థిక శాస్త్రవేత్తలు విభజించారు. స్థూలంగా బ్రతకటానికి అవసరం అయినవి అవసరాలు. బ్రతుకు సాఫీగా సాగటానికి పనికి వచ్చేవి సౌకర్యాలు. దానికి మించినవి భోగాలు.

ఏ మనిషి అయినా అవసరాలు తీరగానే … పూర్తిగా కాకపోయినా కొంత వరకు అయినా… తీరగానే సౌకర్యాల వైపు చూపు మళ్ళుతుంది. ఆ సౌకర్యాలు కూడా కొంతలో కొంతైనా సమకూర్చుకున్నాక దృష్టి భోగాల వైపు తిరుగుతుంది. ఈ పరుగులో మనిషి తనను తాను ఆహుతి చేసుకుంటున్నాడు. తన కుటుంబ సౌఖ్యాన్ని బలి పెడుతున్నాడు. సంపాదన పరుగులో కుటుంబానికి తగిన సమయాన్ని కేటాయించలేక పోతున్నాడు. ఇదంతా ఎందుకు జరుగుతోంది? సంపాదన కోసం పరుగు వల్ల.

కానీ రఘువంశ రాజులు ఏమి చేసేవారు? సంపాదించేవారు, అంతులేని సంపదలను కూడబెట్టేవారు. దేని కోసం? అవసరాలు తీర్చుకోవటానికా? సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవటానికా? భోగాలను అనుభవించటానికా? కాదే!

మరెందుకు?

“త్యాగాయ సంభృతార్థానాం” అర్థ సంచయం చేయటం త్యాగం చేయటానికి! అంటే ఇతరులకు, అవసరంలో ఉన్న వారికి ఇవ్వటానికి! అది కూడా ఎలా ఇచ్చేవారు?

“యథా కామార్చితార్థినాం” అర్థించిన వారి కోరికను పూర్తి చేసేటట్టు ఇచ్చేవారు! ఇక్కడ కాళిదాసు వాడిన మాట “అర్చిత” అనేది! అవసరంలో ఉన్నవారికి వారి కోరిక తీరేవిధంగా ఇచ్చేవారు! ఇవ్వటం అంటే “దానం” అనే మాట వాడతాం మనం.  కాళిదాసు ” వారు దానం చేసేవారు” అనలేదు. “అర్చించారు” అన్నాడు. అది “అర్చన!” అన్నాడు.

ఉపనిషత్తు ఒక మాట చెప్పింది… మనం ఇచ్చేటప్పుడు… “వినయంతో ఇవ్వాలి, అడిగిన వాడు బాగుపడాలనే భావనతో ఇవ్వాలి, ఇంతకన్నా ఇవ్వలేక పోతున్నానే అని సిగ్గు పడుతూ ఇవ్వాలి, ఇంతే ఇస్తున్నాను, అవసరానికి సరిపోతుందో లేదో అని భయపడుతూ ఇవ్వాలి”. ఇదీ ఉపనిషత్తు ఆదేశం, ఉపదేశం, ఉపాసితవ్యమైన అంశం. దీనిని పాటించడం అంటే అర్థించిన వారిని అర్చించడమే! ఉపనిషత్తు ఆదేశించిన , ఉపదేశించిన మార్గాన్ని అనుసరించటమే! ఉపనిషత్తు ఆదేశించిన మార్గాన్ని అనుసరించడం అంటే… అదే “అర్చన!”

సంపాదన లక్ష్యాన్ని రఘువంశ రాజుల ప్రవర్తన ద్వారా కాళిదాసు నిర్దేశించాడు. నేను అలా బ్రతికానా? బ్రతుకుతున్నానా? కనీసం అలా బ్రతకటానికి ప్రయత్నమైనా చేశానా? చేస్తున్నానా? లేదే!

ఎంతసేపూ నేనూ, నా కుటుంబం, మా అవసరాలు, సౌకర్యాలు, భోగాల పైనే దృష్టి కేంద్రీకరించి పరుగుల మీద పరుగులు పెట్టానే కానీ సంపాదన లక్ష్యం ఏమిటో కాళిదాసు ఇంత స్పష్టంగా నిర్దేశించినా, ఆ కావ్యాన్ని గతంలో చదివినా బుర్రకెక్కలేదే? కేవలం కావ్యకళ, రసభావ వివేచనలలో కొట్టుకుపోతూ ఋషి కల్పుడైన కవికుల గురువు కాళిదాసు చెప్పిన మౌలిక విషయాన్ని పట్టించుకోలేదే?

చదువుకుని ఏమి ప్రయోజనం? రసోన్మత్తత వల్ల ఏమి ప్రయోజనం? బ్రహ్మానంద సహోదరమైన రసానందం బ్రతుకులో అధ్యయన వేళ ఆవరణ భంగం కలిగించి, కావ్య పాత్రలతో మమేకం చేసి, ఆనందాన్ని కలిగించవచ్చు.

కానీ వాల్మీకి, వ్యాసుల తరువాత ఋషి కల్పుడైన కవికుల గురువు కాళిదాసుని కావ్య, నాటకాలను కేవలం రసానందం కోసం అధ్యయనం చేస్తే ఆయన లక్ష్యంలో పావువంతు మాత్రమే నెరవేరినట్లు.

కాళిదాసు స్వతహాగా ఉపాసకుడు! ఆయన కూర్చిన “పంచ స్తవి” దానికి సాక్ష్యం! ఆయన రచనా పరమార్థం కేవలం రసానందం మాత్రమే కాదు… మానవ జీవన పరమార్థాన్ని నిరూపించటం!

అందుకే కాళిదాసు సనాతన ధార్మిక జీవన వ్యాఖ్యానం!


Leave a comment