స్వీయ అన్వేషణ – 182
ప్రశ్న మీద ప్రశ్న వేస్తూనే ఉన్నాడు కవికుల గురువు, ఋషికల్పుడైన కాళిదాసు.
“నీ సంప్రదాయాన్ని, సదాచారాన్ని పాటిస్తున్నావా?” అని నిలదీస్తున్నాడు.
“సనాతన ధర్మం అంటూ గొంతు చించుకుంటున్నావ్ కదా? ఆ ధర్మం నిర్దేశించిన విధులను నువ్వు ఆచరిస్తున్నావా?” అని పరోక్షంగా బోనులో నిలబెట్టి అడుగుతున్నాడు.
సమస్త సనాతన భారతీయ సమాజాన్ని కడిగి పారేస్తున్నాడు. ఇవన్నీ సూటిగా అడుగుతున్నాడా? లేదే? సూటిగా అడిగితే “కవి” ఎందుకు అవుతాడు?
ఎంతసేపూ ఆ మహాకవి చేసిన వర్ణనలు, కల్పనలు, ” ఉపమా కాళిదాసస్య” అనుకుంటూ మురిసిపోయే పండితులు, రసైక జీవులు మాత్రమే కనిపిస్తున్నారు కానీ ఆయన వేస్తున్న ప్రశ్నలు పట్టించుకోరే? అబ్బే! అలాటి ప్రశ్నలేవీ ఆయన అడగటం లేదే? ఆ రఘువంశ చక్రవర్తుల లక్షణాలు చెప్పాడు అంతే! అనుకుంటే ఆ మహోపాసక కవి ఉద్దేశించిన పరమార్థాన్ని నిర్లక్ష్యం చేసినట్లే. ఆ మేరకు అంధులం అయినట్లే!
రఘువంశ మహాకావ్యాన్ని మళ్ళీ అధ్యయనం చేస్తున్నప్పుడు నాలో చెలరేగుతున్న ఘోష ఇది! ఏమో… ఇలాటి ఘోషతో సంవదించే సమాన ధర్ములు ఎవరైనా ఉంటే వారితో గొంతు కలపటానికే ఈ ఘోష.
రఘువంశ చక్రవర్తులు ” యధా విధి హుతాగ్నులు”. అంటే ఏమిటి? శాస్త్రం విధించిన పద్ధతిలో అగ్నికార్యాన్ని నిర్వర్తించేవారు.
ఉపనయన వేళ చేసిన ప్రతిజ్ఞ ఏమిటి? “యావజ్జీవం హోష్యామి” అని కదూ? “అహరహ ముపాసీత” అని కాదూ?
అంటే “బ్రతికి ఉన్నంత కాలమూ అగ్నిహోత్ర విధిని నిర్వర్తిస్తాను”, “ప్రతిరోజూ సంధ్యోపాసన చేస్తాను” అని కాదూ ఆ ప్రతిజ్ఞలకు అర్థం?
చేస్తున్నామా? లేదే? అంటే ఉపనయన వేళ చేసిన ప్రతిజ్ఞలను తుంగలో త్రొక్కేసినట్టే కదా?
“పోవయ్యా! ఇదంతా మీ ‘ బాపనోళ్ల ‘ గోల ! మాకేం సంబంధం?” అని కూకలేయకండి. ఎవరి వంశాచారాలు వారికి ఉంటాయి కదా? వాటిని పాటిస్తున్నారా? “అగ్రవర్ణాలు” అనే ముఠాను వదిలేయండి. మిగిలిన వాళ్ళ సంగతేవిటీ?
ఎంతమంది తమ “కులదేవత”లను కొలుస్తున్నారు? అసలు ఎంతమందికి తమ కులదేవత ఎవరో తెలుసు? ఎంతమందికి తమ పూర్వీకులు కొలిచిన “గ్రామదేవత” గురించి తెలుసు? ఇంటిలో ఏ శుభకార్యం జరిగినా ఆ కులదేవతను అర్చిస్తున్నారా? ఆ గ్రామదేవతను దర్శిస్తున్నారా? కొలువులు చేస్తున్నారా? లేదే?
నా ప్రస్తుత “వ్యాపకం” రీత్యా కలిసిన వారిలో నూటికి తొంభై తొమ్మిది శాతం మందికి తమ కుల దేవత ఎవరో, గ్రామదేవత ఎవరో తెలియదు!
“యధా విధి హుతాగ్నీనాం” అంటే కేవలం అగ్నిహోత్రమే అనుకుంటే పొరపాటు! ఆ ఉదాహరణ ద్వారా సమస్త సనాతన భారతీయ సమాజానికీ కాళిదాసు వేస్తున్న ప్రశ్న ఇది. ఎవరి వంశాచారాన్ని వారు తప్పకుండా పాటించటమే పరోక్షంగా “అగ్నికార్యం”. అంతే కానీ ఇదేదో కేవలం అందరూ అనే “బాపనోళ్ల” గోల మాత్రం కాదు! అలా అనుకోవడం కేవలం అజ్ఞానం! అవిద్య!
ఇంతకీ… పోనీ… ఆ అగ్నికార్యం చేయవలసిన వాళ్ళైనా చేస్తున్నారా? లేదు! ఎందుకు? “టైమ్ లేదండీ!”.
అవును… నిజమే… టైమ్ లేదు. ఎందుకు లేదు? మన ఉద్యోగాలు, మన పరుగులు మనకి టైమ్ ఇవ్వటం లేదు. షిఫ్ట్ ఉద్యోగాల వల్ల రేయింబవళ్ళు ఆ బానిసత్వానికే సరిపోతోంది. ఏం చేస్తాం?
నిజంగా సంధ్యోపాసన చేయాలన్నా, అగ్నికార్యం చేయాలన్నా దానికి తగిన సమయం ఏది? బ్రాహ్మీ ముహూర్తం. అంటే దాదాపుగా తెల్లవారు ఝామున నాలుగున్నర నుంచి ఐదున్నర వరకూ. ఆ సమయంలో మనం గాఢనిద్రలో కూరుకుపోయి ఉంటున్నాం. రాత్రి ఒంటిగంట రెండు దాకా నిద్ర పోని జాతి బ్రాహ్మీ ముహూర్తానికి నిద్ర లేచి సిద్ధం కాగలదా?
రఘువంశ చక్రవర్తులు ఆ విధంగా విధి యుక్తంగా ఈ కార్యాలను నిర్వహించటానికి “యధా కాల ప్రబోధినామ్” … తగిన సమయంలో నిద్ర లేచేవారు! తగిన సమయం అంటే? బ్రాహ్మీ ముహూర్తం. వాళ్ళంటే చక్రవర్తులు… మనలా బానిసలు కారు కదా? వాళ్ళకి పనీపాటా ఏవుంటుంది కనుక? అనొచ్చు!
సరే… బ్రాహ్మీ ముహూర్తం కాదు… ప్రాతః కాలానికేమి వచ్చింది? ఉద్యోగాలు చేస్తూ రాత్రి డ్యూటీలు చేసి ఎప్పుడో తెల్లవారు ఝామున ఇంటికి చేరే వారి సంగతి ప్రక్కన పెట్టేద్దాం. ఉదయం వెళ్ళి సాయంత్రం ఇంటికి చేరేవారూ ఉన్నారుగా? ఉద్యోగ జీవితాలు పూర్తి చేసుకొని ఇంటి పట్టున ఉన్న వారూ ఉన్నారుగా? ఒక కుటుంబంలో ఒక్కరైనా వారి వారి వంశాచారాన్ని పాటిస్తే చాలదూ? అదే “యథా విధి హుతాగ్ని”గా ఆ వంశాన్ని, ఆ కుటుంబాన్ని కాపాడదూ?
కాళిదాసు రఘువంశ చక్రవర్తుల గురించి చెప్పిన ఈ రెండు లక్షణాలు మనం ఒంట బట్టించుకొంటే చాలదూ మన వంశం, మన కుటుంబం క్షేమంగా ఉండటానికి?
Leave a comment