కాళిదాసు ప్రశ్న – 4

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 183

స్వామీ వివేకానందులు ఈ జాతికి ఒక నినాదాన్ని ప్రసాదించారు…” ఉత్తిష్ఠ జాగ్రత ప్రాప్యవరాన్నిబోధత” అని.  అంటే ఏమిటి? “లే, మేలుకో, నీ లక్ష్యాన్ని సాధించేవరకు విశ్రమించకు” అని స్థూలంగా భావం.

అంటే నువ్వొక లక్ష్యాన్ని పెట్టుకుంటే ఆ లక్ష్యాన్ని సాధించే వరకూ విశ్రమించ కూడదు. నువ్వు ఏ పని మొదలు పెట్టినా చివరి వరకూ ఫలితాన్ని సాధించే వరకూ వదలకూడదు.

నిజానికి ఇది స్వామీ వివేకానందులు స్వంతంగా ఇచ్చిన నినాదం ఏమీ కాదు.. ఇది ” కఠోపనిషత్” లో ఉన్నదే.  ఆయన సనాతన భారతీయ ధర్మమైన హిందూత్వ భావనను ప్రపంచ వేదిక మీద ప్రకటించిన మహాత్ముడు.

నా చిన్నప్పుడు మా ఇంటిలో వివేకానందులు ఒక కుర్చీలో కూర్చొని ఉన్న ఫోటో ఒకటి ఉండేది. దానిలో ఆయన బొమ్మ క్రింద “The Hindu Monk” అని ముద్రించి ఉండేది. ఇప్పుడు ఆయన ఫోటోలలో ఆ “హిందూ సన్యాసి” అనే మాట కనిపించదు! ఆ సంస్థ వారు “మేము హిందువులం కాదు, మాది వేరే పంథా” అని ప్రకటించుకున్నారు కూడా! వారు ఈ సమాజంలో “మైనారిటీలు” ట! వారి ప్రసంగాలన్నీ ఉపనిషత్తులు, భగవద్గీత తదితర సనాతన ధార్మిక గ్రంథాల పైనే! అయినా వారు “హిందువులు” కారు!

సరే… ఈ సంగతి ప్రక్కన పెట్టి అసలు సంగతికి వద్దాం. “నీ లక్ష్యాన్ని సాధించే వరకూ విశ్రమించవద్దు” అనే కఠోపనిషత్ వాక్యాన్ని నినాదంగా మలచి ఆయన ఈ జాతికి ఉపదేశ వాక్యంగా అందించారు.

చిన్నదో, పెద్దదో ఒక  లక్ష్యాన్ని పెట్టుకొని పెట్టుకున్నాక దానిని సాధించాలి. భర్తృహరి ఒక మాటన్నాడు… నీచులైన మానవులు పనిలో కలిగే అడ్డంకులకు వెరచి అసలు పనినే మొదలు పెట్టరు. మధ్యములు ఒక పని మొదలు పెట్టినా ఆ క్రమంలో కలిగే అడ్డంకులకు  తట్టుకోలేక ఆ పనిని మధ్యలోనే వదలివేస్తారు. కానీ ప్రజ్ఞానిధులు అయిన ధీరులు ఆ పనిలో వచ్చే అడ్డంకులను దాటుకొని ఉత్సాహంతో తాము మొదలు పెట్టిన పనిని పూర్తి చేస్తారు… అని.

కాళిదాస మహాకవి వర్ణించిన రఘువంశ చక్రవర్తుల లక్షణాలలో ఇది కూడా ఒకటి… ” ఆఫలోదయ కర్మణామ్” ఫలితం వచ్చే దాకా ఆ పనిని వదిలేవారు కారు వారు… వారు ప్రజ్ఞానిధులు కదా మరి!

ఇటు కాళిదాసు చెప్పినది, అటు వివేకానందులు చెప్పినదీ ఒకటే! భర్తృహరి పద్యం అదే భావాన్ని విశ్లేషించి చెప్పింది. ఈ ముగ్గురికీ ఆధారం ఏమిటీ? కఠోపనిషత్తు లోని “ఉత్తిష్ఠ, జాగ్రత, ప్రాప్యవరాన్నిబోధత” అనే ఉపనిషత్ వాక్యమే మూలం.

రఘువంశ చక్రవర్తులు ఆ ఉపనిషత్ వాక్యాన్ని తూచా తప్పకుండా నిర్వహించి సర్వాత్మనా సనాతన ధార్మిక జీవనులయారు!

మరి నా సంగతి ఏమిటీ?

ఎన్ని పనులు చేద్దామనుకోలేదూ? వాటిలో ఎన్ని పనులు మొదలు పెట్టలేదూ? వాటిలో ఎన్ని పనులు మధ్యలో వదలి వేయలేదూ?

మరి నేనెవరిని? ఓ ఊరికే సనాతన ధర్మం అంటూ అరవడమే కానీ ఆ ఉపనిషత్ వాక్యాన్ని ఆచరణలో పెట్టానా?

పోనీ… ఆ వాక్యం ఆత్మానుభవం కోసం చెప్పారని అనుకుందాం. అది లౌకిక జీవితానికి మాత్రం అన్వయించదూ? అలా బద్దకాన్ని వదిలించుకొని లేచి, మేల్కొని, ఆ పని చేస్తే ఫలితం రాదూ? జీవితం బాగుపడదూ? రాబోయే అడ్డంకులకు భయపడక పోయినా, ఎదురైన అడ్డంకులను ఎదుర్కొనే ఓపిక లేక వదిలేస్తే అప్పటి దాకా పడిన శ్రమ అంతా వ్యర్ధమే కాదూ?

రఘువంశ చక్రవర్తుల జీవన విధానంలోని “ఆఫలోదయ కర్మణామ్” అనే ఒక్క మాట కాళిదాసు ఈ జాతికి ముఖ్యంగా యువలోకానికి వేస్తున్న ప్రశ్న కాదూ?

ఇవన్నీ ప్రక్కన పెట్టేసి కాళిదాసు కవిత్వ ప్రతిభకు మురిసిపోతూ, మైమరచిపోతే ఆ మహోపాసక కవి లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేసినట్టే!


Leave a comment